కాజేసింది ఇస్తేనే..మళ్లీ ఛాన్స్

కాజేసింది ఇస్తేనే..మళ్లీ ఛాన్స్
January 07 13:30 2019

నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ కొందరు సర్పంచులు మరోసారి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు నిజామాబాద్ జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నిధులు పక్కదోవ పట్టించిన సదరు మహాశయులు మరోసారి అదే పదవిపై కన్నేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక ఇలాంటివారికి పంచాయతీ అధికారులు కొన్ని కండిషన్స్ కూడా విధించినట్లు తెలుస్తోంది. పక్కదోవ పట్టించిన సొమ్ము అంతటినీ తిరిగి చెల్లిస్తేనే మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఉంటుందని అధికారులు తేల్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే గత పంచాయతీ ఎన్నికల్లో ఘనంగా ఎన్నుకోబడిన సర్పంచులు కొందరు చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు బహిరంగంగానే వినిపించాయి. ఇక ఆడిట్‌లోనూ అవకతవకలు తేలడంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు దారితప్పినట్లు అధఇకారులు తేల్చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడి.. మళ్లీ పోటీ చేయాలనుకుంటున్న సర్పంచులు ప్రస్తుతం 150కి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మింగేసిన నిధులు కక్కితేనే మళ్లీ పోటీ చేయడానికి అర్హులని అధికారులు తేల్చడంతో వారికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా నిధులు ఇస్తాయి. వీటిని అభివృద్ధి పనులకు వెచ్చించడం, సమస్యలు పరిష్కరించడం సర్పంచుల బాధ్యత. అయితే కొందరు సర్పంచులు మాత్రం ప్రభుత్వ నిధులను జేబు చేసుకున్నారు. ఖర్చులకు సంబంధించిన లెక్కలు కూడా సరిగా లేవు. 
పదవిలో ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్‌లపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజేసిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ అధికారులు దానికి తగ్గట్లే చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి నిధులు దుర్వినియోగం చేసిన వారే కాకుండా, ఆడిట్‌లో అవకతవకలు ఉన్నా బాధ్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లెక్కలు సరిగా లేకుండా నిధులు పక్కదారి పట్టించిన వారి వివరాలు కూడా అధికారులు ఇప్పటికీ తెలుసుకున్నారు. ఉమ్మడిజిల్లాలో పలువురు మాజీ సర్పంచులకు చెందిన ఆడిట్‌లో అభ్యంతరాలున్నట్లు అధికారులు గుర్తించారు. జమకావల్సిన నిధులు చెల్లిస్తేనే ఈ ఎన్నికల్లో వారు పోటీకి అర్హులని తేల్చారు. ఇక సర్పంచులు దుర్వినియోగం చేసిన ప్రభుత్వ సొమ్ము భారీగానే ఉంది. కామారెడ్డి జిల్లాలో రూ.88,11,867, నిజామాబాద్‌ జిల్లాలో రూ.58,39,370 వరకు నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఇంత భారీమొత్తం పక్కదోవ పట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటివారికి మరోసారి పోటీచేసే అవకాశమే ఇవ్వడకూడదని అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=22974
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author