గాలికొదిలేశారు (అనంతపురం

గాలికొదిలేశారు (అనంతపురం
January 08 11:14 2019

: మారాల జలాశయానికి తొలిసారిగా కృష్ణమ్మ సవ్వడి వచ్చింది. జలాశయంలో నీటి చేరికతో చుట్టుపక్కల భూగర్భ జలం ఒక్కసారిగా పెరిగింది. కానీ… జలాశయం పనులు చేసిన కాంట్రాక్టర్.. డిస్ట్రిబ్యూటరీలు చేయలేమని గతంలోనే చేతులెత్తేశారు. ధరలు పెరిగిన తరుణంలో పాత ధరలతో చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సత్వరమే స్పందించి కొత్త ప్రతిపాదనలు పంపి ఉంటే.. వాటికి అనుమతులు వచ్చి పనులు పూర్తయ్యేవి. కానీ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంతో నిర్మాణ వ్యయం మూడింతల మేర పెరిగింది. అంతేకాదు.. జలాశయంలో పుష్కలంగా నీరున్నా ఆయకట్టుకు దరి చేరక రైతన్నలకు నిర్వేదమే మిగిలింది.
హంద్రీనీవా రెండో దశలో భాగంగా ప్రధాన కాల్వపై 371.040 కి.మీ.కు సమీపంలోని బుక్కపట్నం మండలం మారాల వద్ద ఆఫ్‌లైన్‌లో మారాల జలాశయం నిర్మించారు. దీని కింద బుక్కపట్నం మండలం మారాల, కృష్ణాపురం, ముదిగుబ్బ మండలం ముక్తాపురం, ముదిగుబ్బ, మంగలమడక, జొన్నల కొత్తపల్లి తదితర గ్రామాల పరిధిలోని 18 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పదేళ్ల కిందట హంద్రీనీవా రెండో దశలోని 12వ ప్యాకేజీ కింద ఈ జలాశయ నిర్మాణం, దీని పరిధిలో ఆయకట్టుకి నీరు అందేలా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచారు. ఈపీసీ విధానంలో రూ.39.22 కోట్ల మేర చేపట్టిన ఈ పనులను ల్యాంకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే గుత్తేదారు సంస్థ దక్కించుకుంది. అయితే కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన ఓ దివంగత నాయకుడికి చెందిన సంస్థ ఉపగుత్తేదారుగా పనులు చేసింది. దాదాపు రూ.35 కోట్ల మేర పనులు చేశారు. జలాశయం కొన్నేళ్ల కిందటే దాదాపు పూర్తిచేశారు. 0.483 శతకోటి ఘనపుటడుగుల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఈ జలాశయ డెడ్‌ స్టోరేజ్‌ 0.018 టీఎంసీల మేరకు ఉంది.
ఈ జలాశయం పరిధిలో జొన్నలకొత్తపల్లి ప్రధాన డిస్ట్రిబ్యూటరీతోపాటు.. ఇతర సబ్‌ డిస్ట్రిబ్యూటరీ పనులన్నీ కలిపి 75 కిమీ మేర పనులు చేయాలి. జలాశయం పనులు చేసిన గుత్తేదారు సంస్థే ఈ డిస్ట్రిబ్యూటరీల పనులు కూడా చేయాలి. ప్రధాన డిస్ట్రిబ్యూటరీలో 13 కిమీ మేర పని చేశారు. అయితే కట్టడాలు మాత్రం నిర్మించలేదు. మొదట్లో డిస్ట్రిబ్యూటరీల పనులు త్వరగా చేయడంపై దృష్టిపెట్టలేదు. తర్వాత వీటిని అరకొరగా చేసి వదిలేశారు. ఎలాగోలా జలాశయం మాత్రమే పూర్తి చేశారు. అయితే హంద్రీ-నీవా ఇంజినీర్లు సైతం దీని డిస్ట్రిబ్యూటరీల పనులను పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ మాత్రం ధరలు ఎంతో పెరిగాయనీ.. పాత ధరలతో డిస్ట్రిబ్యూటరీల పనులు చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో కొంత కాలం కిందట ఈ ప్యాకేజీలో ఏకంగా డిస్ట్రిబ్యూటరీల పనులు తప్పించారు. వాస్తవానికి కొత్త ధరలతో డిస్ట్రిబ్యూటరీలు నిర్మించాలని భావిస్తే, ప్రస్తుత ధరలతో ఎంత మేరకు వ్యయం అవుతుందనేది ప్రతిపాదనలు ఇప్పటికే పంపించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని, టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయించి ఉంటే.. ఇప్పుడు ఆయకట్టుకు నీరు అందేది. అయితే ప్రస్తుతం జలాశయంలోకి తొలిసారిగా గత ఏడాది నవంబరులో నీటిని తీసుకొచ్చారు. ఇప్పుడు అందులో 0.23 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశారు. అంటే జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యంలో దాదాపు సగం నీటిని నిలిపారు. అయినా సరే ఈ జలాశయ పరిధిలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేకపోతున్నారు. కేవలం జలాశయానికి సమీపంలో ఉన్న బోర్లు రీఛార్జి కావడంతో సమీప రైతులకు మేలు జరుగుతోంది. డిస్ట్రిబ్యూటరీలు పూర్తయి ఉంటే ఆయకట్టు అంతటికీ కూడా నీరు అందే వీలుండేది.
ప్రస్తుత ధరలతో ఈ జలాశయం డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి కావాలంటే భారం తడిసి మోపెడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 18 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఎకరాకు రూ.10 వేలు చొప్పున డిస్ట్రిబ్యూటరీ పనులకు వ్యయమైతే నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంటే ఈ లెక్కన 18 వేల ఎకరాలకు కలిపి మొత్తం రూ.18 కోట్ల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం సరిపోదని తెలుస్తోంది. రూ.30 కోట్లకుపైగా నిధులు అవసరమని ఇంజినీర్లు చెబుతున్నారు. తాజాగా ఆ ప్రతిపాదనలు పంపి, ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు తీసుకొని, టెండర్లు పిలిచి, పనులు చేయాల్సి ఉంది. ఈ తంతు ఎప్పటికి జరుగుతుందో అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా గుత్తేదారులు చేతులెత్తేసినప్పుడే స్పందించి ఉంటే రూ.7 కోట్లతో నిర్మాణాలు కొలిక్కి వచ్చేవి. అందరి నిర్లక్ష్యం పుణ్యమా అని ఇప్పుడు రూ.20-25 కోట్ల అదనపు భారం పడనుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23176
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author