గుప్త నిధుల కోసం ఇంటి తవ్వకాలు

గుప్త నిధుల కోసం ఇంటి తవ్వకాలు
January 10 11:10 2019

కొన్నేళ్లుగా గుప్త నిధుల కోసం దేవాలయాలను, పంట పొలాలను కేంద్రంగా చేసుకొని పలువురు దుండగులు తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే డబ్బుకు బానిసై ఏకంగా తన సొంత ఇంటిలోనే కొన్ని నెలలుగా ఎవరికీ తెలియకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి అంతా అయిన తర్వాత ఇంటిలో గుంతల పూడ్చడానికి పిలిపించిన బంధువుల ద్వారా గుప్త నిధుల తవ్వకం విషయం బట్టబయలు అయిన సంఘటన మంగళవారం ఆలస్యంగా మోరుబాగల్‌ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం దావనంలా వ్యాపించడం సన్నరంగప్ప, ఆయన కుమారుడు రంగనాథ్‌ ఇళ్లు వదిలి పరారయ్యారు. గత కొన్నేళ్లుగా గుడిబండ మండల వ్యాప్తంగా దుండుగులు గుప్త నిధుల కోసం విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని నెలల క్రితం సింగేపల్లి సమీపంలోని ఓ పొలంలో గుప్తనిధుల కోసం రాత్రిపూట పూజలు నిర్వహించి గుప్త నిధి కోసం మూసిన బండలను పగల కొడుతుండగా సమీపంలోని ఇళ్లల్లోని కొందరు కనుగొని వారి వద్దకు వెళ్లారు. వారు అక్కడి నుంచి అర్ధాంతరంగా పనులు వదిలి పరారయ్యారు. ఈ విషయంలో సింగేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను స్టేషన్‌కు తీసుకొని విచారణ చేశారు. కోగిరనపాళ్యం సమీపంలోని ఓ దేవాలయంలో పెద్ద పెద్ద బండలు నిర్వహించి రాత్రిపూట పూజలు నిర్వహించి అక్కడి నుంచి హుండీలను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపించాయి. గుడిబండ సమీపంలోని ఓ పొలంలో రాత్రి వేళలో జెసిబితో బండలు తీసి గుంతలు తవ్వి అక్కడ కూడా గుప్త నిధులు తీసుకెళ్లినట్లు ఆనవాలు కనిపించాయి. అదేవిధంగా గుడిబండ సమీపంలోని పళారం క్రాస్‌ వద్ద రాధాస్వామి ఆశ్రమానికి తీసిన స్థలంలో కూడా కొందరు దుండగులు తవ్వి గుప్త నిధులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇదేగాక గుడిబండ కొండపై వెలిసిన మల్లికార్జునస్వామి దేవాలయంలో సమీపంలోని కొండల్లోని ఓ కొలనులు ఉన్న రాతి నంది విగ్రహాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న వజ్రం తీసుకెళ్లినట్లు, అదేవిధంగా కొండపైకి వెళ్లడానికి ముఖద్వారం వాకిలిలో పై భాగంలో ఉన్న రాతిరాయిలో వజ్రాన్ని అపహరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఇన్ని జరిగినా ఏ ఒక్క దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇదిలా ఉండగా మోరుబాగల్‌ గ్రామానికి చెందిన మాల సన్నరంగప్ప, అతని కుమారుడు రంగనాథ్‌ ఇంటిలో గుప్తనిధులు ఉన్నట్లు జ్యోతిష్యులు చెప్పిన మేరకు పూజలు నిర్వహించి 800 బస్తాల మట్టిని తవ్వి సంచుల్లో భద్రపరిచారు. 15 రోజుల క్రితం సన్నరంగప్ప కుమారుడు రంగనాథ్‌ ఇంటి నుంచి వెళ్లినట్లు అప్పటి నుండి ఇప్పటి వరకు రంగనాథ్‌ ఇంటికి రాకపోవడంతో తవ్వకంలో అతనికి ఏదో దొరికిందని గ్రామంలో పలువురు చర్చించుకుంటున్నారు. కర్నాటక రాష్ట్రం ఆరేగెర నుంచి రంగనాథ్‌ బంధువులు పెద్దసంఖ్యలో వచ్చి ఇంట్లోని గుంతలు మట్టితో పూడ్చుతుండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మాల సన్నరంగప్ప కూడా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23382
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author