తెలుగు రాష్ట్రాల్లో రిటర్న్ గిఫ్ట్ పై చర్చోపచర్చలు

తెలుగు రాష్ట్రాల్లో రిటర్న్ గిఫ్ట్ పై చర్చోపచర్చలు
January 17 11:45 2019

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు తగిన ఆచరణ మొదలైంది. యాక్షన్‌కు రియాక్షన్ తరహాలో టిఆర్‌ఎస్ కార్యాచరణ ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోషించిన పాత్రకు తగిన రిటర్న్‌గిఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చేలా వ్యూహం ఖరారైంది. ఇందులో తొలి మెట్టుగా టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ రెండు రోజుల క్రితం ఆంధ్ర పర్యటనతో మొదలైంది. ఇప్పుడు జగన్, కెటిఆర్ భేటీతో మరో అడుగు పడింది. త్వరలో కెసిఆర్ ఆంధ్ర పర్యటనతో ఊపందుకోనుంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నందున అప్పటికల్లా టిఆర్‌ఎస్ మరింత పకడ్బందీ వ్యూహాన్నిరూపొందించనుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇప్పటికే అక్కడి యాదవ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చెప్పినట్లుగా చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్ తథ్యమని, తన వంతు పాత్ర పోషిస్తానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత భీమవరం పర్యటనలో పోలవరం ప్రాజెక్టుపై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం కెసిఆర్ రిటర్న్‌గిఫ్ట్ వ్యాఖ్యలపై స్పందించి తాను కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి హైదరాబాద్ వచ్చి అసదుద్దీన్ ఒవైసీని కలిసి చర్చించారు. ఇప్పుడు కెసిఆర్ ఆదేశం మేరకు వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌తో హైదరాబాద్‌లో చర్చ లు జరిపారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయంలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి మద్దతును కోరారు. కాంగ్రెస్, బిజెపిలు లేని కూటమికి మద్దతుపై చర్చించారు. త్వరలో ఈ చర్చల కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న కెసిఆర్ విజయవాడలో జగన్‌తో సమావేశం కానున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో కెసిఆర్ తొలిసారిగా చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్ అనే ప్రస్తావన తెచ్చారు. ఆ తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం దానికి సానుకూలంగా స్పందించి ఆ రిటర్న్‌గిఫ్ట్ కోసం తాను కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని వ్యాఖ్యానించారు. ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు నగరానికి వచ్చి భేటీ కావడం విశేషం. గత నెల జగన్ పుట్టినరోజు సందర్భంగా టిఆర్‌ఎస్ ఎంపి కవిత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్‌ఏ హరీశ్‌రావు తదితరులు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఏకంగా జగన్, కెటిఆర్‌లు భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులు, రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కెసిఆర్ ఆలోచనల మేరకు ఏర్పడనున్న ఫెడరల్ ఫ్రంట్‌కు ఇచ్చే మద్దతు తదితరాలపై చర్చించారు. ఈ మధ్యలో తలసాని శ్రీనివాస యాదవ్ సైతం ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోనే పర్యటించి రిటర్న్‌గిఫ్ట్ పై అక్కడే వ్యాఖ్యలు చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=23648
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author