కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గరం..గరం

కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గరం..గరం
January 27 16:42 2019

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కమిటీలపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల కమిటీలను రద్దు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాగా కమిటీలు వేయాలని ఏఐసీసీ, టీపీసీసీ ఇప్పటికే ఆదేశించాయి.నాలుగు జిల్లాల కాంగ్రెస్‌ కమిటీలను త్వరలోనే ఖరారు చేసేందుకు టీపీసీసీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్‌లో డీసీసీ రేసుకు దూరంగా ఉన్న పది మంది సీని యర్లను పరిగణలోకి తీసుకుంటుంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంటుండగా, ఆశావహులు సైతం పెరుగుతున్నారు. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు దాదాపుగా డీసీసీ అధ్యక్షులు ఖరారైనట్లేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కటకం మృత్యుంజయం పేరు మొదట్లో వినిపించినా.. ఆయన కరీంనగర్‌పైనే పట్టుతో ఉన్నట్లు చెప్తున్నారు. ‘అలాగే మాజీ విప్‌ ఆరెపెల్లి మోహన్, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, డాక్టర్‌ మేడిపల్లి సత్యం, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తదితరులు కూడా డీసీసీల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. ఏదేమైనా అధిష్టానం సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీలపై ఇప్పటికే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే స్పష్టత రాగా, పెద్దపల్లిపైనా ఈర్ల కొంరయ్యకు లైన్‌క్లియర్‌ అయినట్లేనంటున్నారు. రెండుమూడు రోజుల్లో కరీంనగర్‌పై స్పష్టత వస్తే త్వరలోనే కమిటీలపై ప్రకటన వెలువడవచ్చని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ పేర్కొన్నారు.    కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లికి జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను ఖరారు చేసే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఏఐసీసీ, టీపీసీసీ అత్యవసర సమావేశం అనంతరం తక్షణమే జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఈ నెల 5న అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొదట ఈ నెల 10 వరకే కమిటీలను ఖరారు చేసి టీపీసీసీ పంపాలని సూచించినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు, కమిటీల కోసం అక్కడక్కడ పోటీ తీవ్రంగా ఉండటం తదితర కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే తక్షణమే కమిటీలను నియమించాలని మరోసారి టీపీసీసీ   సూచించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు కమిటీలను ప్రతిపాదించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన నేతలు, సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీలను నాలుగైదు రోజుల్లో అధికారులకు అందజేసే అవకాశం ఉందని తెలిసింది.జగిత్యాల జిల్లా నుంచి ప్రధానంగా జువ్వాడి నర్సింగరావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, మద్దెల రవిందర్, బండ శంకర్‌ ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే ధర్మపురి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి 400 పైచిలుకు తేడా ఓడిపోయిన అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌కు డీసీసీ పదవి దాదాపుగా ఖరారైనట్లే. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా పీసీసీ కార్యవర్గ సభ్యుడు ఈర్ల కొంరయ్య, చింతకుంట్ల విజయరమణారావు, చేతి ధర్మయ్య ఆసక్తిగా ఉండగా.. ఉమ్మడి జిల్లాలో రెండు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరు విజయరమణరావు పేరును, ఇంకొకరు ఈర్ల కొంరయ్యను సూచిస్తున్నట్లు సమాచారం. అయితే కూర్చుండి మాట్లాడేందుకు నిర్ణయించుకున్న ఈ గ్రూపుల నేతలు ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కటకం మృత్యుంజయం ఈసారి కూడా పట్టుబడుతుండటంతో కరీంనగర్‌ డీసీసీపై పీటముడి వీడటం లేదని తెలిసింది. కరీంనగర్‌ డీసీసీ పగ్గాల కోసం కటకం మృత్యుంజయంతో పాటు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్‌ డి.శంకర్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్‌లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఏడెనిమిది మంది ఉన్నా.. చివరకు నలుగురి విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24234
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author