అడవుల అభివృద్ధి పనులు ముమ్మరం

అడవుల అభివృద్ధి పనులు ముమ్మరం
January 27 17:02 2019

మహా వృక్షాలు, మొక్కలు, పక్షులు, జంతువులు.. వీటికే అడవులు పరిమితం. పశువులు, జనసంచారం ఊసే ఉండొద్దు.. ఇదీ నిబంధన. వీటిని కఠినతరం చేసేందుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. అడవులు అగ్నికి ఆహుతి కాకుండా.. నిరంతరం అధికారులు పర్యటించేందుకు బాటలు వేయడం.. ఉన్న వృక్షాలను వృద్ధి చేయడం కోసం ముమ్మర చర్యలు చేపట్టింది. ట్రెంచ్‌ కటింగ్‌ పనులు మొదలుపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డివిజన్‌కు వెయ్యి హెక్టార్లలో అడవుల రక్షణకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, పాల్వంచ వన్యప్రాణి విభాగం డివిజన్లలో నెల రోజులుగా అడవుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హరితహారంలో భాగంగా 230కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. గడిచిన రెండేళ్లలో ఆశించిన ప్రగతి కనిపించలేదు. దీంతో అటవీ శాఖ ఆధీనంలో గల అడవులను అభివృద్ధి చేయటం వల్ల 25 శాతం ఉన్న అడవిని.. 3 శాతం పెంపొందించవచ్చని అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఒక్కో డివిజన్‌కు వెయ్యి హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసి.. అడవుల పునరుద్ధరణ ఉత్పత్తి(ఏఎన్‌ఆర్‌) ప్లాంటేషన్‌ పనులు చేపట్టారు. డివిజన్ కు రూ.50లక్షల చొప్పున నిధులు వెచ్చిస్తున్నారు. వీటితో ఏఎన్‌ఆర్‌ ప్లాంటేషన్‌ పనులు చేపట్టారు. నిర్దేశించిన అటవీ ప్రాంతంలో పశువులు సంచరించకుండా రెండు మీటర్ల వెడల్పుతో ట్రెంచ్‌ తవ్విస్తున్నారు. వేసవిలో అడవులు దహనం కాకుండా.. చిన్నచిన్న మొక్కలు తొలగిస్తూ.. నిర్దేశించిన అటవీ ప్రాంతంలో పాయలు ఏర్పాటు చేస్తున్నారు.ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మరో ప్రాంతానికి విస్తరించకుండా పకడ్బందీగా పనులు చేపట్టారు. భూమికి అతి సమీపంలో నేలమీద వాలి ఉన్న మొక్కలు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆహుతి కాకుండా ఈ విధానం ఎంతో దోహదపడుతుంది. అలాగే చెట్లు, మొక్కలు ఏపుగా, బలంగా వృద్ధి చెందేందుకు అడవుల మధ్య చెత్తాచెదారం తొలగిస్తున్నారు. అడవిలో చెట్ల మధ్య దూరం వల్ల గాలి, వెలుతురు లభించేలా చిన్న మొక్కలు తొలగించి.. శుభ్రం చేస్తున్నారు. దీంతో చెట్లు, వృక్షాలు నరికితే సుదూర ప్రాంతంలో ఉన్న వారిని కూడా గుర్తించేందుకు వీలవుతుంది. జిల్లా విభజన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6.02 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉంది. కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు డివిజన్‌లతోపాటు పాల్వంచ వన్యప్రాణి సంరక్షణ విభా గం, అభయారణ్యం కూడా ఇక్కడే ఉంది. ఒక్క వన్యప్రాణి సంరక్షణ విభాగంలోనే 68,638 హెక్టార్ల భూమి ఉంది. అటవీ శాఖ రేంజ్‌లు, సెక్షన్లు, బీట్‌ల వైశాల్యం ఎక్కువగా ఉండటంతో పర్యవేక్షణ కష్టతరంగా ఉందని భావించి వాటి పరిధిని తగ్గించింది. ప్రస్తుతం ఒక్కో బీటు వైశాల్యం వెయ్యి హెక్టార్ల వరకు విస్తరించింది. గతంలో ఒక్కో బీట్‌ ఆఫీసర్‌ 5వేల హెక్లార్ల అడవిని కాపాడలేకపోవటం వల్ల కొత్తగూడెం డివిజన్‌లో సుమారు 50 హెక్లార్ల భూమి అన్యాక్రాంతమైంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24244
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author