తగ్గుతున్న మహాలక్ష్మిలు

తగ్గుతున్న మహాలక్ష్మిలు
January 29 15:10 2019

బిడ్డ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి వైద్యులతో స్కానింగ్‌ చేయిస్తారు. దీన్ని ఆసరా చేసుకొని కొందరు దంపతులు పుట్టబోయే బిడ్డ ఆడ, మగపిల్లలా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికనుగుణంగానే స్కానింగ్‌ సెంటర్ల యజమానులు కొందరు పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని లింగనిర్ధారణపై సమాచారం ఇస్తున్నారు.పుట్టబోయే పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి స్కానింగ్‌ చేసే కేంద్రాలు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో వందకుపైగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాల్లో కేవలం స్కానింగ్‌ చేసి సంబంధిత వైద్యులకు సమాచారం ఇస్తున్నారు. ఇక నుంచి ఈ విధానంలో పూర్తి మార్పులు తీసుకువచ్చారు. లింగనిర్ధారణ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కేంద్రంలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య, వివరాలను రాష్ట్ర, జాతీయ కుటుంబ సంక్షేమ శాఖకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు తెలిపేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా వివరాలు సంబందిత నిర్ధారణ కేంద్రాల వారు ఎప్పటికప్పుడు వివరాలను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు వారికి తగిన శిక్షణ ఇచ్చారు. ఈ వివరాలు నమోదు చేయని వారిపై కఠినచర్యలు ఉంటాయి. ఆసుపత్రుల్లో ప్రసవించే వారి వివరాలతో పాటు పుట్టిన పిల్లల వివరాలను ఏ రోజుకారోజు వైద్య ఆరోగ్యశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ వివరాల ద్వారా ఆడ, మగ జననాలు తెలుసుకొని ఏదైనా ఆసుపత్రుల్లో మగపిల్లల జననాలు ఎక్కువగా ఉంటే అక్కడ తనిఖీలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటారు.లింగనిర్ధారణతో పాటు అబార్షన్‌ చేయించేందుకు జిల్లాలో కొంతమంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. కరీంనగర్‌లో ఒక ఆసుపత్రి పక్కభవనంలో లింగనిర్ధారణ చేయగా పోలీసులు పట్టుకున్నప్పటికీ ఆ కేసు విషయంలో ఎటువంటి చర్యలు ఇప్పటికీ తీసుకోలేదు. ఫలితంగా కొందరు పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల్లోని వారికి ఆడపిల్ల అని తెలిస్తే.. కొందరు దళారులు వారి వద్ద డబ్బులు తీసుకుని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అబార్షన్లు చేయిస్తున్నారు. ఈ విషయాల్లో వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం వారిపై కఠినచర్యలు తీసుకోవాలి. లింగనిర్ధారణ ద్వారా కడుపులో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిపిన వారిపై రూ.10 వేల జరిమానా, మొదటిసారి మూడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. రెండోసారి అదే తప్పు చేసినట్లయితే రూ.50 వేల జరిమానాతో పాటు అయిదు సంవత్సరాల జైలుశిక్ష, సంబంధిత కేంద్రాన్ని తొలగిస్తారు. వైద్యుడి గుర్తింపు పట్టా రద్దు చేస్తారు.ఆడపిల్ల అని తెలిసి అబార్షన్‌ చేస్తే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలతో పాటు మధ్యవర్తులపై చట్టపరంగా చర్యలు, జైలుశిక్ష ఉంటుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24368
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author