వినూత్న విద్య (పశ్చిమగోదావరి)

వినూత్న విద్య (పశ్చిమగోదావరి)
January 29 15:21 2019


 పుస్తకాలను చూసి పాఠాలు ఎంతగా చదివినా కొంతమంది విద్యార్థులకు బుర్రకెక్కదు. అవే పాఠాలను బొమ్మలతో వివరిస్తే వెనుకబడిన  విద్యార్థికి సైతం పాఠం వంటబడుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బోధనోపకరణాల ద్వారా పాఠాలను బోధించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు బోధనోపకరణాల ద్వారా విద్యార్థులకు పాఠాలను బోధించే ప్రక్రియను గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. మారుతున్న సిలబస్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు టీఎల్‌ఎంను రూపొందిస్తున్నారు. ప్రతి విద్యార్థికీ చదువుపై ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలను బోధింపజేస్తున్నారు. 2018-19 విద్యాసంవత్సరానికిగాను టీఎల్‌ఎం తయారీకి సంబంధించిన మాడ్యూళ్లను రూపొందించే అవకాశాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయులకు కల్పించారు. ఆమేరకు సమగ్ర శిక్షాఅభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో టీఎల్‌ఎం మాడ్యూళ్ల తయారీ కార్యక్రమాన్ని స్థానిక ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.జిల్లాలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో టీఎల్‌ఎంను తయారు చేయిస్తున్నారు. గత అక్టోబరులో పెదవేగి మండలం విజయరాయిలోని జైసాల్‌ శిక్షణ కేంద్రంలో టీఎల్‌ఎం తయారీపై మూడు రోజులపాటు ప్రాథమికంగా శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 70 మంది ఉపాధ్యాయులు ఈ శిబిరానికి విచ్చేసి బోధనోపకరణాలను తయారు చేశారు. సదరు టీఎల్‌ఎంలలో ఉత్తమమైన వాటిని ఎంపికచేసే ప్రక్రియను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఏలూరులోని ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో ‘ట్రైఅవుట్‌’ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమ పరిశీలనకు ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారులు సైతం విచ్చేశారు. ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి వి.బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 30 మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచేత టీఎల్‌ఎంను పరిశీలింపజేస్తున్నారు. తరగతి గదిలో పాఠ్యాంశానికి తగినవిధంగా బోధించడానికి అనువుగా ఎటువంటి టీఎల్‌ఎం ఉంటుందో వాటిని ఎంపికచేసి వాటి తయారీ విధానాన్ని తెలిపేలా పుస్తకాన్ని ముద్రిస్తారు.2016లో ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు ద్వారా ‘సృజన’ పేరుతో టీఎల్‌ఎం తయారీ పుస్తకాన్ని ముద్రించారు. అప్పట్లో సదరు పుప్తకం బాగా ప్రాచుర్యం పొందింది. అదేతరహాలో ఈ ఏడాది టీఎల్‌ఎం తయారీ పుస్తకాలను రాష్ట్రస్థాయిలో ముద్రించనున్నారు. 1, 2 తరగతుల విద్యార్థులకు, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా టీఎల్‌ఎం పుస్తకాలను రూపొందిస్తారు. ఈ విధంగా ముద్రితమయ్యే పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎస్‌ఎస్‌ఏ ద్వారా సరఫరా చేస్తారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఈ పుస్తకాలను చూసి ఉపాధ్యాయులు సొంతంగా బోధనోపకరణాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24372
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author