అన్నదాతకు కష్టకాలం

అన్నదాతకు కష్టకాలం
January 29 16:27 2019

ప్రతికూల వాతావరణం రైతన్నలకు శాపంగా మారింది. పంట చేతికొచ్చే దశలో వర్షాలు కురుస్తుండడంతో కర్షకులు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఏడాది కూడా ఆర్ధికంగా నష్టాలే ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వరి కోతల సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడింది. ప్రస్తుత అకాల వర్షాలకు మిరపపంట ధ్వంసమైంది. రైతులు ఆరబెట్టుకున్న మిరపకాయలు తడిసిముద్దయ్యాయి. గతేడాది ఖరీఫ్ నుంచి వాతావరణం సహకరించని పరిస్థితే ఉంటోందని ఖమ్మం రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందుకున్నా రైతులు సాగు కోసం పెద్దమొత్తంలోనే రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు దక్కనివారు అధికవడ్డీలకు అప్పులు చేశారు. కష్టనష్టాల కోర్చి పంటలు వేసినా దిగుబడి సరిగా లేకపోవడంతో ఇప్పటికే రైతుల్లో నిరాశ నెలకొంది. కొద్దోగొప్పో చేతికి అందిన పంట వర్షార్పణం అవుతుండడంతో వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. మిరప వాణిజ్య పంట. దీంతో రైతులు పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టారు. దుక్కి దున్నినప్పటి నుంచి నారు పోయడం, నాటడం, నీటి యజమాన్య పద్ధతులకు తోడు సస్యరక్షణ, నూర్పుడి తదితర వాటికి ఖర్చు విపరీతంగా పెరిగింది. పెట్టుబడి ఖర్చు పెరిగి.. తుదకు లభిస్తోంది తక్కువే అయినా పలువురు రైతులు సాగునే నమ్ముకున్నారు. మరో పని చేయలేక కష్టనష్టాలు ఎదురవుతున్నా వ్యవసాయం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా ప్రస్తుతం మిరప రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కల్లాల్లో ఉన్న వాటికి రక్షణ చర్యలు తీసుకున్నా నష్టం వాటిల్లుతోంది. పట్టాలపై పడిన వర్షం నీరు కారణంగా లోపలి వైపునకు చెమ్మ చేరుతోంది. రాత్రి సమయాల్లో మంచు కూడా ఎక్కువగా కురుస్తుండటంతో రైతులు కలవరపడుతున్నారు. ప్రతికూల వాతావరణానికి తోడు తెగుళ్లు పంటలను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా దిగుబడులు క్షీణిస్తున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమిస్తూ రైతులు సాగు చేస్తున్నారు. ఈ దఫా విజృంభించిన ఆకుముడత తెగులును అరికట్టేందుకు పురుగుమందుల కోసం పెద్దమొత్తంలోనే ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. చేతికి అందిన పంటేమో ప్రస్తుత వర్షాలకు పాడైపోతోంది. పంట చేతికి అంది మార్కెట్ కు తరలించే సమయంలోనే వర్షాలు కురుస్తుండడంతో రైతులు సతమతమవుతున్నారు. పంటను కాపాడులేక నానాపాట్లు పడుతున్నారు. పలువురు రైతులు పంట కోతలు ఇంకా ప్రారంభించలేదు. ఈ సమయంలో వర్షాలు, భారీగా కురుస్తున్న మంచుకు మిరపకాయలు పాడైపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కే పరిస్థితి లేదని వాపోతున్నారు.  

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24380
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author