అవినీతికి అడ్రస్

అవినీతికి అడ్రస్
January 31 10:19 2019

 పత్తి పండించిన రైతులు పుట్టెడు కష్టాల్లో కూరుకుపోగా.. ఆ పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మాత్రం రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. కొనుగోళ్లకు నానా కొర్రీలు పెడుతున్న భారత పత్తి సంస్థ (సీసీఐ) అధికారులు పత్తివ్యాపారులు, జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులు కలిసి భారీ అక్రమాలకు ఒడిగడుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్‌ చేయగా వచ్చిన దూదిలో తప్పుడు లెక్కలు చూపుతూ భారీ కుంభకోణానికి ఆజ్యం పోశారు. అరకొరగా కొనుగోలు చేసిన పత్తిలోనే దాదాపు రూ.7కోట్లకు పైగా జేబులు నింపుకొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే.. రాబోయే రోజుల్లో కొనుగోళ్లు పెరిగితే అదే స్థాయిలో అవినీతి పెరిగిపోయే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే పీకల్లోతూ అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సీసీఐ అధికారులు సస్పెండై ఇంట్లో కూర్చోగా.. ఏమాత్రం గుణపాఠం నేర్వకుండా తిరిగి అదే అవినీతిలో మునిగితేలుతున్నారు.జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లపైన చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ-ముంబాయి) తన బృందంతో కలిసి శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. విచారణలో ఈ విషయం బయట పడుతుందేమో అన్న భయంతో అవినీతిపరులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 26 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు మద్దతు ధర లభించనప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదీన సంస్థ సీసీఐ రంగంలో దికి పత్తి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పత్తిలో తేమ శాతం 8లోపు ఉంటే క్వింటాల్‌కు రూ.5450 చొప్పున ధర చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన పత్తిని గతంలో సీసీఐ ఆధ్వర్యంలోనే జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ చేసుకోగా.. ప్రస్తుతం జిన్నింగ్‌ మిల్లులకు పంపుతున్నారు. జిన్నింగ్‌ వ్యాపారుల కుమ్మక్కుతో సీసీఐ వ్యాపారులు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్‌ చేయడానికి మిల్లుల వారీగా పంపుతున్నారు. జిన్నింగ్‌ చేసిన పత్తిని సంబంధిత మిల్లుల వ్యాపారి సీసీఐకి అప్పగించాలి. అందుకు జిన్నింగ్‌ మిల్లు నిర్వాహకుడికి బేల్‌కు రూ.1125 చొప్పున మిల్లింగ్‌ ఛార్జీలు ప్రభుత్వం చెల్లిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లా నేలలు పత్తి పంటకు అనుకూలమైనవి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నాణ్యత కలిగిన పత్తి పంట పండుతోంది. దారం పొడవు కూడా ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో పండిన పత్తి పంటకు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండు ఉంది. ఒక క్వింటా పత్తిని జిన్నింగ్‌ చేయడం వల్ల 34.50 కిలోల దూది(లింట్‌), 1.50శాతం వేస్టేజీ (తరుగు), 64 శాతం గింజలు (సీడ్‌) వస్తాయి. కానీ.. సీసీఐ అధికారులు మాత్రం 31.50కిలోల దూది, 3శాతం వేస్టీజీ, 65.50శాతం గింజలు వస్తున్నట్లు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారు. ఈ లెక్కన క్వింటాల్‌కు మూడు కిలోల దూదిని అవే పత్తి మిల్లుల్లో కిలో రూ.122 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించగా వచ్చిన డబ్బుల్లో రెండుశాతం వరకు కార్యాలయ సిబ్బంది ఖర్చుల కోసం తీయగా.. మిగిలిన మొత్తాన్ని సీసీఐ , జిన్నింగ్‌ వ్యాపారులు నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. నష్ట (తరుగు) శాతం కూడా ప్రతి క్వింటాల్‌కు 1.50శాతం అధికంగా చూపించి గింజల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 26 సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు రెండు లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ప్రతి క్వింటాకు రూ.350 చొప్పున సీసీఐ, జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ లెక్కన ఇప్పటికే జరిగిన పత్తి కొనుగోళ్ల వల్ల రూ.ఏడు కోట్ల వరకు అక్రమాలకు జేబులు నింపుకున్నారు. ఇవి కాకుండా తరుగు పేరుతో జరిగే దోపిడీ అదనం. ప్రస్తుతం పత్తి గింజల ధర క్వింటాల్‌కు రూ.2180 పలుకుతుండగా.. ప్రతి క్వింటాల్‌కు కిలోన్నరకు రూ.32.70 చొప్పున సీసీఐ, జిన్నింగ్‌ వ్యాపారులు కలిసి అక్రమాలకు ఒడిగడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్‌ మిల్లుల వరకు సీసీఐ మాత్రమే రవాణ ఖర్చులు భరించాలి. కానీ.. రైతులే రవాణ భారాన్ని మోయాల్సి వస్తోంది. గతంలో ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి కొనుగోళ్లపై జరిగిన అక్రమాలపైన ఉన్నతాధికారులు విచారించి 14మంది అధికారులపైన సస్పెన్షన్‌ వేటు వేశారు. పలువురిపైన క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. జిన్నింగ్‌ వ్యాపారులతో కలిసి నాసిరకమైన పత్తి కొనుగోళ్లు చేశారు. ఇదంతా మర్చిపోకముందే మళ్లీ ఈ సీజన్‌లోనూ సీసీఐ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఈ దోపిడీపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24402
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author