కల్తీ రాజ్యం

కల్తీ రాజ్యం
February 04 11:37 2019

నిరుపేద, సామాన్య మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారు మార్కెట్‌లో మోసాలకు గురవుతున్నారు. కల్తీ అవుతున్న ఆహార పదార్థాలతో అనారోగ్యాలకు గురవుతున్నారు. కల్తీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల ఉపయోగార్థం రూపొందించిన వినియోగదారుల చట్టం ఎందరూ కొరగాకుండ పోతోంది. హక్కుల పరిరక్షణకు ఏర్పాటైన వినియోగదారుల ఫోరం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరర్థకంగా మారుతోంది. కొత్త జిల్లాలు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఆయా జిల్లాల్లో ఫోరం ఏర్పాటు చేయలేదు. అవిభాజ్య మహబూబ్‌నగర్‌ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఒక అధ్యక్షుడు, సభ్యుడు మాత్రమే ఉండటంతో కేసులన్నీ చాలా వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఫలితంగా అక్రమాలను అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు.. అన్నట్లుగా పరిస్థితి మారింది.            ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లుగా వినియోగదారుల చట్టం ఉనికి దాదాపు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం (డీసీఐసీ), వినియోగదారుల క్లబ్బులు, జిల్లా, రాష్ట్ర వినియోగదారుల మండళ్లు, ఆహార సలహా సంఘం, విజిలెన్స్‌ మానిటరీ కమిటీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత వినియోగదారుల సమస్యలు, చట్టం గురించి పట్టించుకొనే దిక్కులేకుండ పోయింది. మార్కెట్‌లో జరిగే మోసాలు, అన్యాయాలపై వినియోగదారుల ఫోరాల్లో కేసులు వేద్దామన్నా.. వందలాది కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతోపాటు నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి పాలమూరుకు వచ్చి కేసులు దాఖలు చేసే పరిస్థితి లేదు.             రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. పరిపాలన ఆయా జిల్లాల పరిధిలోనే కొనసాగుతోంది. కొత్త జిల్లాలు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకు ఆయా జిల్లా కేంద్రాల్లో వినియోగదారుల ఫోరం  ఏర్పాటు ఊసేలేకపోగా, మహబూబ్‌నగర్‌లోని ఫోరంలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. వినియోగదారుల సమావేశాలు నిర్వహించి, వినియోగదారుల సహకార సంఘాలతో చట్టం గురించి ప్రజలకు తెలియజేయాల్సి ఉండగా.. ఆ ప్రయత్నాలేవి జరగడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. సమావేశాల నిర్వహణకు నిధులు విడుదల  చేయలేదు. దీంతో నాలుగేళ్లుగా ఒక్క సమావేశం నిర్వహించకపోవడం విడ్డూరం.     వినియోగదారుల చట్టం ప్రకారం ఫోరాల పరిధిలో కేసులు నమోదైన 3 నుంచి 5 నెలల వ్యవధిలో పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఉమ్మడి జిల్లా పరిధిలోని కొన్ని కేసులు పదేళ్లుగా పెండింగ్‌లో ఉండటం విచారకరం. ఫోరాలకు అవసరమైన నిధులు, సిబ్బందిని సమకూర్చాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  వినియోగదారుల ఫోరాలను పటిష్ఠం చేయడం, సంఘాల సహాయ సహకారాలు తీసుకున్నప్పుడే వినియోగదారుల ఉద్యమం బలపడుతుంది. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు కల్తీలకు ఆస్కారం ఉండదు. వినియోగదారుల ఖర్చుకు తగ్గ ఫలితం లభిస్తుంది.మార్కెట్లో అక్రమాలకు పాల్పడితే వినియోగదారుల ఫోరంలో కేసులు దాఖలు అవుతాయన్న భయం వ్యాపారుల్లో ఉండేది. ఇప్పుడు ఆభయం లేకపోవడంతో  పలువురు అక్రమార్కులు బాహాటంగానే మోసాలకు పాల్పడుతున్నారు. మార్కెట్లలో, సేవా రంగంలో వినియోగదారులు, ఖాతాదారులు నష్టపోతున్నా న్యాయ, నష్టపరిహారం అందని ద్రాక్షలా మారాయి. ప్రతి జిల్లాకు ఒక వినియోగదారుల ఫోరం, దానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలి. జిల్లా వినియోగదారుల ఫోరంలో ఒక అధ్యక్షుడు, కనీసం ఇద్దర సభ్యులు, అందులో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి. మహబూబ్‌నగర్‌ జిల్లా ఫోరానికి ఒక అధ్యక్షుడు, ఒక సభ్యుడు మాత్రమే ఉన్నారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వినియోగదారుల ఫోరం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24529
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author