కరువు నిధుల మళ్లింపు…

కరువు నిధుల మళ్లింపు…
February 04 12:25 2019

కేంద్రం విడుదల చేస్తున్న అనేక రకాల నిధులను దారి మళ్లించడం, ఇతరేతర అవసరాలకు వాడుకోవడం కొన్ని రాష్ట్రప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిధుల మళ్లింపు చర్చకు రాకపోవచ్చునని, కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలకు సయోధ్యలేనప్పుడు ఇలాంటి నిధుల మళ్లింపులు చర్చనీయాంశమై వివాదాస్పదమౌతుంటాయని రాజకీయ విశ్లుషకులు అంటున్నారు. కరువుప్రాంతాలకు విడుదల చేసిన జాతీయ విపత్తు నిర్వహణ నిధులు సైతం గతంలో అనేకసార్లు దారి మళ్లాయని అనుభవజ్ఞులైన రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు హయాంలోని తెలుగుదేశం ప్రభుత్వం అనేక కేంద్ర నిధులను దారి మళ్లించిన దాఖలాలు, పేరుమార్చి తనవిగా చెప్పుకున్న దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. ఈనేపధ్యంలో తాజాగా కేంద్రం మంజూరు చేసిన రూ.900కోట్లు ఏ దారి పడతాయోనన్న సందేహాలు ఆర్థిక, సామాజిక విశే్లషకుల నుండి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రం రాష్ట్రానికి, జాతీయ విపత్తు నిర్వహణ నిధుల నుండి రూ.900కోట్లు మంజూరు చేసింది. ఆరు రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఈ నిధులను విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.900కోట్లు మంజూరు చేసింది.ఈ ఏడాది రాయలసీమ జిల్లాలు అత్యంత కరవుబారిన పడ్డాయి. కడప జిల్లాలో ఖరీఫ్‌లో దాదాపు 60శాతం తక్కువగాను, రబీలో దాదాపు 70శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో విత్తనం వేసేందుకు అరకొర వర్షం పడటంతో, సాధారణ పంట విస్తీర్ణంలో సగం విత్తనం వేశారు. అయితే ఆ తర్వాత వర్షం రాకపోవడంతో ఆ పంట చేతికి దక్కలేదు. రబీలో అత్యధికంగా సాగుచేసే శెనగ, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలు వేసేందుకు వర్షమే కురవలేదు. సాధారణ విస్తీర్ణంలో 30శాతం కూడా విత్తనం వేయలేకపోయారు. ఆ వేసిన విత్తనం మొలకెత్తి నేల కరచుకుని ఎండిపోయింది. ఈ కరువు నేపధ్యంలో పెట్టుబడులు కూడా కోల్పోయిన రైతులందరూ దాదాపు ‘పసల్‌బీమా’ ప్రీమియం చెల్లించి బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా, కరువురైతులకు విదిలించేది ఎంగిలి మెతుకులే. మృష్టాన్న భోజనం మాత్రం దారి మళ్లి కాంట్రాక్టర్ల కడుపులు నింపే రోడ్లు , చెక్‌డ్యామ్‌లు, నగరాల్లో అభివృద్ధి పనులు వంటి వాటికి దారి మళ్లిపోతాయి. ప్రభుత్వాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అమలుచేసే సంక్షేమ పథకాలకు దారి మళ్లిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. కడప జిల్లాలోనే 2012-13లో వచ్చిన కరువుకు ఇంతవరకు బీమా పరిహారం రైతులకు అందలేదు. ఆ పరిహారంపై వ్యవసాయశాఖ, బ్యాంకులు, రెవెన్యూశాఖలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే తప్ప, రైతులకు మాత్రం నష్టం కూడింది లేదు. 2016-17లో విడుదలైన పసల్‌బీమా పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇంకా రైతులకు అందలేదు. ఇదిలా ఉంటే కేంద్రం మంజూరు చేసే నిధులు 90శాతం అయితే, వాటికి 10శాతం రాష్ట్రప్రభుత్వం మార్జిన్ మనీ జమచేస్తేనే నిధులు విడుదలౌతాయి. రాష్ట్రప్రభుత్వం జమ చేయాల్సిన మార్జిన్ మనీ జమ చేయని కారణంతో కూడా కేంద్ర నిధులు వెనక్కువెళ్లిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. పెన్షన్ల రెట్టింపు, పసుపుకుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు రూ.10వేలు లాంటి అనేక పథకాలను తాజాగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి సమయంలో కేంద్రం కరువురైతులకోసం మంజూరు చేసిన నిధులను, రాష్టవ్య్రాప్తంగా కాకపోయినా, కరువు జిల్లాల్లో దారి మళ్లించి సంక్షేమ పథకాలకు ఉపయోగించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపధ్యంలో కేంద్రం మంజూరుచేసిన జాతీయ విపత్తు నిర్వహణ నిధులను సకాలంలో విడుదల చేయించుకుని, కరువు ప్రాంతాల కోసం, కరువు రైతుల కోసమే ఖర్చు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారుః

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24544
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author