కుంటుపడుతున్న విద్య

కుంటుపడుతున్న విద్య
February 05 10:13 2019

జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతోంది. ఉపాధ్యాయ స్థానాల భర్తీ విషయంలో యంత్రాంగం జాప్యం చేస్తోంది. ప్రభుత్వ పరిధిలో కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్‌ డివిజన్లలో మొత్తంగా 983 విద్యాలయాల్లో 52 వేల మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఆదోని, డోన్‌ డివిజన్లలో పలు ఉపాధ్యాయుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పలు పాఠ్యాంశాలకు ఒక్కరే బోధించాల్సి వస్తోంది. కొన్ని పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు వేర్వేరుగా ఉపాధ్యాయులు ఉండాలి.. కానీ రెండు మాధ్యమాలకు ఒకరే బోధిస్తుండడం గమనార్హం. 2018-19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యపై విస్తృతంగా ప్రచారం చేయడం.. ఉపాధ్యాయులు సైతం ఇంటింటికి తిరిగి చైతన్యపరచడంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కువగా ప్రవేశాలు చేయించిన విషయం తెలిసిందే. వీరందరికి బోధనలో ఎలాంటి లోటు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. విద్యార్థులను చేర్పించడంలో ఉన్న శ్రద్ధ ఉపాధ్యాయుల నియామకంలో జరగడం లేదు. ఉన్నత చదువులకు పునాదిగా భావించే పదో తరగతిలో భౌతిక, గణితం, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి అత్యధిక ఖాళీలు ఏర్పడటంతో ఆ ప్రభావం విద్యార్థులపై ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల కౌన్సిలింగ్‌ తర్వాత దసరా సెలవులు, పరీక్షలు, సంక్రాంతి సెలవులతో కొంతకాలం తరగతుల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడింది. కనీసం మూడు నెలలైనా తరగతులు చక్కగా సాగలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు.
ఆర్‌ఎస్‌ రంగాపురం ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌ ఉపాధ్యాయుడి కొరత ఉంది. పాఠశాలలో బాలబాలికలు మొత్తంగా 600 మంది చదువుతున్నారు. వీరందరికీ ఒకే హిందీ ఉపాధ్యాయుడు బోధించాలంటే కష్టతరంగా ఉంది. సాధారణంగా ఒకే సబ్జెక్టుకు 6, 7, 8 తరగతులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఆపైన తరగతులకు (9, 10) మరొకరు బోధించాల్సి ఉంది. పాఠశాలకు ఒకే పోస్టు మంజూరు కావడంతో వందల మంది విద్యార్థులకు ఒక్కరే బోధించాల్సి ఉంది. వీరందరికి పరీక్షలు నిర్వహించడం.. సమాధాన పత్రాలు మూల్యాంకనం చేయడం.. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటివి ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఇక్కడ మరో హిందీ పండిట్‌ను నియమిస్తే సౌకర్యంగా ఉంటుంది. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోధించే స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ సబ్జెక్టులకు మరో ఉపాధ్యాయుడితో బోధించి చేతులు దులిపేసుకొంటున్నారు. ఒకవైపు సబ్జెక్టు ఉపాధ్యాయుడు లేక.. ఇతరులు బోధించే పాఠ్యాంశాలు అర్థం కాక పిల్లలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.  గతంలో బదిలీ కౌన్సిలింగ్‌, పదోన్నతుల ప్రభావంతోపాటు ఇటీవల పదవీ విరమణ ఖాళీలు భర్తీకి నోచుకోవడం లేదు. జిల్లా సరిహద్దు, గ్రామీణ ప్రాంతాల విద్యాలయాల్లో ఇక్కడినుంచి బదిలీపై వెళ్లేవారే ఎక్కువ. వచ్చేవారిని మాత్రం వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇప్పటివరకు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం మాత్రం గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.
బేతంచెర్ల కేంద్రంలోని హనుమాన్‌నగర్‌ ఉన్నత పాఠశాలలో మొత్తంగా 226 మంది చదువుకొంటున్నారు. పాఠశాలలో ఆంగ్లం, ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాశ్వత హెచ్‌ఎం పోస్టును భర్తీ చేయలేదు. ఫలితంగా అదే పాఠశాలలో సీనియర్‌ ఉపాధ్యాయుడికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన తన సబ్జెక్టుతోపాటుగానే హెచ్‌ఎం బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోంది ఏళ్లు తరబడి ఆంగ్లం ఉపాధ్యాయుడు పోస్టు మంజూరు కాలేదు.  ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా హిందీ పోస్టు కూడా అవసరంగా ఉంది.
పదో తరగతి చదువులకు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు నామమాత్ర బోధనకే పరిమితం కాగా ఉన్నత పాఠశాలల పరిస్థితి సైతం అధ్వానంగా మారింది. పదో తరగతి పరీక్షలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. కనీసం విద్యా వలంటీర్లను సైతం నియమించకపోవడంతో అత్యధిక పాఠశాలల్లో తూతూమంత్రంగా బోధన సాగుతోంది. గతేడాది ఒక్కో మండలంలో ఐదు నుంచి పది మంది వరకు 10 జీపీఏ సాధించారు. ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని అధిగమించాలన్నా అందుకు తగ్గ వాతావరణం కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. విభిన్న కారణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24601
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author