ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద 79 సీసీ కెమెరాలు

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద 79 సీసీ కెమెరాలు
February 09 11:31 2019

పేదల సరుకులు దారిమళ్లకుండా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అర్హులైన పేదలకు బియ్యం, పంచదార వంటి రేషన్‌ సరుకులను సరఫరా చేస్తుంటారు. వీటిని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నుంచి రేషన్‌ డీలర్లకు వాహనాల్లో తరలిస్తుంటారు. ఈ క్రమంలో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చింది.వీటి ద్వారా గోదాంల వద్ద ఏం జరుగుతుంది.. సరుకులు ఎలా తరలిస్తున్నారు.. అంతా సక్రమంగానే జరుగుతుందా? అనే విషయాలను తెలుసుకునే వీలు కలిగింది. గతంలో అక్రమాలు జరుగుతున్నాయని పలు ఫిర్యాదులు అందగా.. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఫిర్యాదులు తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 8 నెలల క్రితం జిల్లాలోని 8 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో 79 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాల ఏర్పాటుతో ఆయా సెంటర్లలో ఏం జరుగుతున్నదనే విషయాలను అధికారులు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండడంతో ఎవరూ అక్రమాలకు పాల్పడేందుకు సాహసించే అవకాశం ఉండదు.పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు రేషన్‌ సరుకులను ప్రతినెలా పంపిణీ చేస్తుంటారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న గోదాంలలో నిల్వ చేస్తుంటారు. వాటిని ప్రతినెలా కోటా ప్రకారం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలిస్తారు. అక్కడి నుంచి రేషన్‌ షాపులకు బియ్యం పంపిణీ చేస్తారు. అయితే ప్రతిసారి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నుంచి సరఫరా అవుతున్న రేషన్‌ సరుకులకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండేవి. వీటిని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని 8 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద 79 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. నేలకొండపల్లిలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద 10 కెమెరాలు, కల్లూరులో 5, వైరాలో 11, ఖమ్మం అర్బన్‌ 7, ఖమ్మం రూరల్‌ 8, మధిర 16, సత్తుపల్లి 11, ఏన్కూరులో 11 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.కెమెరాలు అమర్చిన  ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఏం జరుగుతున్నది.. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంతోపాటు హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి మానిటరింగ్‌ చేస్తారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ఇన్‌చార్జి, డేటా ఆపరేటర్‌ విధుల్లో ఉంటారు. అయితే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో డేటా నెల రోజులపాటు అందుబాటులో ఉంటుంది. ఈ నెల రోజుల సమయంలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా చూడవచ్చు. జిల్లాలోని సివిల్‌ సప్‌లై కార్యాలయంలో.. హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో 24 గంటలకు సంబంధించి డేటా అందుబాటులో ఉంటుంది. ఆయా కార్యాలయాల నుంచి ఆ సమయంలో ఏం జరుగుతుందనేది చూసేందుకు వీలు కలుగుతుంది.ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పౌరసరఫరాల శాఖలో జరిగే కొన్ని అవకతవకలకు చెక్‌ పెట్టే అవకాశం లభించింది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో కొందరు బస్తాల నుంచి బియ్యం దొంగిలించారనే ఆరోపణలున్నాయి. అయితే సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు. అలాగే పలు పాయింట్ల వద్ద నుంచి గతంలో బియ్యం బస్తాలు మాయం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ బస్తాలు ఎలా తరలిపోయాయనే అంశం ఎవరికీ తెలియని పరిస్థితి. ప్రస్తుతం సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రతి అంశాన్ని పౌరసరఫరాల శాఖ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఏర్పడింది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దకు ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారనే అంశాలను ఆ శాఖ అధికారులు మానిటరింగ్‌ చేసే అవకాశం ఉంది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24922
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author