ఆదుకోని పసుపు

ఆదుకోని పసుపు
February 11 11:14 2019

 రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుతో ఆదుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలు రైతులకు దోహదపడేవే కానీ వీటికన్నా ముఖయమైనది పంటలకు మార్కెట్‌లో పలుకుతున్న ధర. పెట్టుబడి ఆధారంగా మద్దతు ధరలు ప్రకటించాలి. అప్పుడే రైతుకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఉదాహరణకు పసుపు రైతునే తీసుకుంటే ఏటా పరిస్థితి దయనీయంగా ఉంటోంది. జిల్లాలో ప్రధాన పంట అయిన పసుపును పండించే రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. మద్దతు ధర లేకపోవడం పెట్టుబడులు భారీగా పెరగడంతో దీర్ఘకాలం కష్టపడినా ఫలితం రావట్లేదు.జిల్లాకు సరిహద్దున ఉండే నిజామాబాద్‌లో భారీగా పసుపు పండిస్తారు. ఎప్పటి నుంచో మద్దతు ధర కోసం రైతులు పోరాటం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఉద్యమాలు చేశారు. ఫలితం లేకపోగా ధరలో మార్పు రావట్లేదు. ఈ నేపథ్యంలో మరోసారి గళం వినిపించేందుకు కార్యాచరణ చేశారు. రైతులు మోర్తాడ్‌లో సోమవారం పసుపు రైతు ఆవేదన సదస్సును నిర్వహిస్తున్నారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.పసుపు పంట చేతికి రావడానికి రైతుకు  దాదాపు ఎనిమిది నెలలు పడుతుంది. విత్తనం నుంచి తవ్వేవరకు అన్నీ ఖర్చులతో కూడుకున్న పనులే. ఎకరాకు కనీసం రూ.50 వేలకు పైగానే ఖర్చు అవుతోంది. వ్యాపారులు నిర్ణయిస్తున్న ధరకు, పెట్టిన పెట్టుబడికి ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నా ధరలో పెరుగుదల కనిపించట్లేదు. విక్రయించాక లెక్కలు వేసుకుంటే కర్షకులకు నష్టాలే కనిపిస్తున్నాయి.అన్ని పంటలకన్నా పసుపులో తరుగు బాగా ఉంటుంది. నేల నుంచి బయటకు తీసిన పసుపు పచ్చిగా ఉంటుంది. దానిని కొమ్ము, మండగా వేరు చేస్తారు. ఆ తర్వాత యంత్రంలో పోసి ఉడికిస్తారు. చివరకు అమ్మేందుకు అనువుగా మార్చే సరికి 100 కిలోలు ఉడికిస్తే ఎండబెట్టి అమ్మే సరికి 20 కిలోలు అవుతుంది. పసుపు రైతుకు అన్నిదశల్లో ఇబ్బందులే ఎదురవుతున్నాయి. మొక్కజొన్న, కందులు, వరి, సోయా పంటలను స్థానికంగానే కొనుగోలు చేస్తారు. మక్కలు, వడ్లను మహిళా సంఘాలు కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రవాణా ఖర్చుల భారం ఉండట్లేదు. పసుపునకు మాత్రం జిల్లాలో పెద్దగా మార్కెట్‌ సౌకర్యం లేదు. ఖానాపూర్‌, భైంసా మార్కెట్‌లలో ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. 90 శాతం మంది రైతులు నిజామాబాద్‌కు తీసుకెళ్తారు. అధికంగా సాగుచేసే రైతులు మహారాష్ట్రలోని సాంగ్లీకి విక్రయించేందుకు వెళ్తారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.గడిచిన ఆరేళ్లలో పసుపు ధరలను పరిశీలిస్తే పెద్దగా పెరుగుదల లేదు. గరిష్ఠ ధర చూస్తే ఆశ కలుగుతుంది. అది కేవలం 10 శాతం మంది రైతులకే లభిస్తుంది. 90 శాతం రైతులకు కనిష్ఠం కన్నా స్వల్పంగా ఎక్కువ చెల్లిస్తారు. కంటి తుడుపుగా తప్ప రైతులకు పెద్దగా ప్రయోజనం కలిగించే విధంగా ఈ ఆరేళ్లలో ధర పెరగలేదు. ధర నిర్ణయంలో స్పష్టతలేక నష్టపోవడం రైతులకు ఇబ్బందిగా ఉంది. 2010 సంవత్సరంలో ఒక్క సారి క్వింటాలుకు రూ.15వేలు దాటింది. ఆ సంవత్సరం మినహా ఎప్పుడూ రూ.10వేలకు సైతం చేరుకోకపోవడం బాధాకరం.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25012
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author