జనసేనకు దారేదీ… మరో జేపీ అవుతారా..

జనసేనకు దారేదీ… మరో జేపీ అవుతారా..
February 11 11:29 2019

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పక్కా మాస్ హీరో. టాలీవుడ్లో టాప్ లెవెల్ స్టార్. ఆయనకున్న ఫాలోయింగ్ ఏ హీరోకు లేదన్నది నిజం. అటువంటి స్టార్ తనకు తానుగా సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చేశారు. పవన్ లాంటి గ్లామర్ ఫిగర్, చరిస్మా ఉన్న నటుడు పార్టీ పెడితే ఓ ఊపు రావాలి. కానీ పవన్ చేసిన కొన్ని పొరపాట్లు, వర్తమాన రాజకీయ వాతావరణం, ప్రజా రాజ్యం పార్టీ వైఫల్యం వెరశి జనసేనను ముందుకు కదలనీయడంలేదు. పార్టీ పెట్టి అయిదేళ్ళు గడచినా కార్యవర్గం వేసుకోలేని బలహీనత ఆ పార్టీది. ఎట్టకేలకు ఓ వైపు ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ పవన్ తన పార్టీని సంస్థాగతంగా నిర్మించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు బాధ్యులను నియమించారు. అయితే వీరిలో అత్యధికులు మేధావి వర్గానికి చెందిన వారు కావడం విశేషం.పవన్ పక్కా మాస్ నటుడు, ఆయన పార్టీలో ఉన్న వారిలో ఇపుడు ఎక్కువమంది క్లాస్ పీపుల్ కనిపిస్తున్నారు. బాగా చదువుకున్న వారు, అవగాహన ఉన్న వారు, మహిళలను ఏరి కోరి పవన్ తన కమిటీల్లోకి తీసుకున్నారు. వారితో పదవీ ప్రమాణం పేరిట కొత్త సంస్క్రుతి పెట్టి మరీ బాధ్యతలు అప్పగించారు. మాజీ వైఎస్ చాన్సలర్, పౌర హక్కుల సామాజిక ఉద్యమ నేత కేఎస్ చలం జనసేన నాయకులతో పదవీ బాద్యతలు స్వీకరణ పత్రం చదివించారు. ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ పార్టీలో ఇప్పటికే కనీసం నలుగురైనా జనంలో తెలిసిన ముఖాలు లేవు. దానికి తోడు పార్టీ బాధ్యులుగా తీసుకున్న వారంతా మంచివారే కావచ్చు కానీ జనంలోకి వెళ్ళి నాలుగు ఓట్లు సంపాదించేవారు వీరిలో ఎందరు ఉన్నారంటే జవాబు కష్టమే. రెండు కొలమానంగా వర్తమాన రాజకీయం నడుస్తోంది. జనసేనలో బాధ్యులుగా ఉన్న వారిలో చాలా మంది మధ్యతరగతి వర్గం వారు కనిపిస్తున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి రాజకీయం చేస్తున్న వర్తమాన కాలంలో వీరంతా జనంలోకి వెళ్ళి ఎలా పనిచేస్తారన్నది చూడాలి. సిధ్ధాంత పరంగా బలంగా ఉన్న వామపక్షాలు కొన్ని దశాబ్దాలుగా జనం కోసం పోరాడుతున్నా వారిని ఎప్పుడూ ఎన్నుకోలేదు. అధికారం సైతం అప్పగించలేదు. అలాగే నిన్న కాక మొన్న లొక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ప్రయోగం కూడా కళ్ళ ముందు ఉంది. మరి వీటిని చూసిన తరువాత పవన్ చేస్తున్న ప్రయత్నం మెచ్చతగినదే అయినా ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ప్రయోగాలు చేస్తున్నారేమోనని కామెంట్స్ వస్తున్నాయి. కాగా పవన్ కూడా వైసీపీ తరహాలో పార్లమెంట్ నే జిల్లా యూనిట్ గా తీసుకుని కొత్త కమిటీలు వేశారు. మరి ఈ కమిటీలలో ఎందరికి టికెట్లు వస్తాయో చూడాలి. వారు ఎంతమంది జనంలోకి వెళ్ళి మెప్పు పొందుతారో కూడా చూడాలి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25018
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author