మాఫియా గుప్పిట్లో ఇసుక ర్యాంపులు

మాఫియా గుప్పిట్లో ఇసుక ర్యాంపులు
February 12 10:08 2019

గోదావరి ఇసుక ర్యాంపులు మాఫియా గుప్పెట చిక్కుకున్నాయి. ఉచితం మాటున కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది.డ్వాక్రా సంఘాలకు ర్యాంపులు అప్పగించినా, మాఫియా హవా ఏమాత్రం తగ్గలేదు. చివరకు సామాన్యులకు ఇసుక బంగారంగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది. కానీ ఈ విధానం అనంతరం సామాన్యుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. ఉచితంగా తవ్వుకోవచ్చనే నిబంధన చాటున ఇసుక ర్యాంపులన్నిటినీ మాఫియాలు చేజిక్కించుకున్నాయి మరి. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాను పరిశీలిస్తే ఇక్కడ అధికారికంగా 34 ర్యాంపులతోపాటు అనధికారికంగా కూడా కొన్ని ర్యాంపులు నడుస్తున్నాయి. ప్రభుత్వం వేలం నిర్వహించే సమయంలో గోదావరి ఇసుక ర్యాంపుల నుంచి దాదాపు రూ. 1,000 కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు సమకూరేది. అయతే మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన పేరుతో ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించి, ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ తదితర ఏర్పాట్లన్నీ చేసేందుకు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడా సవ్యంగా సాగేలా పర్యవేక్షించలేకపోయారు. ర్యాంపుల్లో యంత్రాలను వినియోగించకూడదని ప్రభుత్వం నిబంధన ఏర్పాటు చేసింది. కానీ ఎక్కడా ఈ నిబంధన అమలయ్యే పరిస్థితి కన్పించడంలేదు. యంత్రాలను వినియోగించి ఇసుకను భారీ వాహనాల్లో దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. నిత్యం ఉభయ గోదావరి జిల్లాల నుంచి వందల సంఖ్యలో భారీ వాహనాల్లో ఇసుక ఇతర జిల్లాలకు తరలిపోతోంది. పగటిపూట కంటే రాత్రి పూట అధికంగా రవాణా సాగుతోంది. మైనింగ్, రెవెన్యూ, జల వనరులు, పోలీసు శాఖలను అదుపులో పెట్టుకుని ఇసుక మాఫియా విక్రయాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాంపులున్న ప్రాంతంలో నేతలు, అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తుండటంతో మాఫియా ఆడింది ఆటగా సాగిపోతోంది. గోదావరి ఇసుకను విశాఖ, విజయవాడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజమహేంద్రవరంలో తవ్విన ఇసుకను రాజానగరంలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వచేసి, అక్కడ నుంచి విశాఖపట్నం వైపు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలోనే సరఫరా చేస్తున్నట్టుగా చూపించేందుకు రెండేసి యూనిట్ల లారీలతో ఇసుకను తరలించి 16వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో అక్రమంగా నిల్వ చేసి అక్కడ నుంచి దూర ప్రాంతాలకు భారీ టిప్పర్లను వినియోగించి రవాణా చేస్తున్నారు. ర్యాంపుల మధ్య పోటీ కారణంగా కాంట్రాక్టర్లు తక్కువ ధరకే ఇసుకను విక్రయించేవారు. ప్రస్తుతం ఉచితం పేరుతో ఎవరైనా నిర్దేశించిన ర్యాంపులో ఇసుక తవ్వుకుని తీసుకెళ్లవచ్చు. అయితే ర్యాంపులోకి మాఫియా అనుమతించిన వాహనాలు మినహా వేరే వాహనం అడుగుపెట్టే పరిస్థితిలేదు. దీంతో ఇసుక కావాలంటే దళారీలను ఆశ్రీంచాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా ఇసుక ధర చుక్కలను అంటుతోంది. అంత ధర పెట్టినా కేవలం దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఇసుక తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. వాస్తవానికి ఉచిత ఇసుక విధానంలో నావల నుంచి ఇసుక తీసినందుకు వెయ్యి రూపాయలు, లారీ కిరాయి 800 రూపాయలు, లోడింగ్‌కు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ ఎక్కడా ఈ విధంగా ఇసుక దక్కడం లేదు. దాదాపు లారీకి 3,000 రూపాయలకుపైగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25089
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author