34 శాతం వృద్ధి రేటుతో మద్యం అమ్మకాలు

34 శాతం వృద్ధి రేటుతో మద్యం అమ్మకాలు
February 21 10:46 2019

ఏపీలో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో అమ్మకాల వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది జనవరిలో రాష్ట్రంలో రూ.1,406 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది జనవరిలో రూ.1,790 కోట్లు విక్రయాలు జరిగాయి. అంటే.. 34.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఫిబ్రవరిలో రూ.522 కోట్ల మద్యం విక్రయించగా, ఈ నెల 15 నాటికే అమ్మకాల విలువ రూ.780 కోట్లకు చేరింది.ఫిబ్రవరిలో 15 రోజులకే రూ.258 కోట్ల అధికంగా అమ్మకాలు జరిగాయి. 15 రోజులకే గతేడాది ఫిబ్రవరి కంటే 49.22 శాతం వృద్ధి రేటు నమోదు కావడంపై ఎక్సైజ్‌ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, వైఎస్సార్‌ జిల్లా చివరి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో రూ.79 కోట్లు, వైఎస్సార్‌ జిల్లాలో రూ.19.58 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది అమ్మకాలపై మొత్తం రూ.15,133 కోట్లకు పైగా ఆర్జించగా, ఈ ఏడాది రూ.17 వేల కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని విధించడం గమనార్హం. 2014లో రూ.11,569 కోట్లుగా ఉన్న అమ్మకాల విలువ ఇప్పటివరకు సుమారు రూ.4 వేల కోట్ల వరకు పెరగడం గమనార్హం. మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలకు అనుమతిలిచ్చింది. కొత్త ఏడాది ప్రారంభం రోజు పార్టీల కోసం ఇష్టమొచ్చినట్లు ఈవెంట్ల పర్మిషన్లు, పగలూ, రాత్రి తేడా లేకుండా అమ్మకాలకు అనుమతులివ్వడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన కూడా ఈవెంట్ల పేరుతో ఎక్సైజ్‌ శాఖ అనుమతులు జారీ చేసింది. డిస్టిలరీల నుంచి మద్యం నిల్వకు 13 జిల్లాల్లో మద్యం డిపోల సంఖ్య పెరిగింది. డిపోలను పెంచి సరుకు సరఫరాకు అందుబాటులో ఉంచారు.  గతేడాది రూ.15 వేల కోట్ల మద్యం ఆదాయం కోసంరాష్ట్ర ప్రభుత్వం 15 వేల కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్‌లుగా) మార్చేసింది.చీప్‌ లిక్కర్‌ను ఏరులై పారించేందుకు ఏకంగా టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేసింది.  మద్యం వ్యాపారులకు కమీషన్లను 7 శాతం నుంచి 15 శాతానికి పెంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25326
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author