గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ట్రబుల్

గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ట్రబుల్
February 21 11:01 2019

గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి  వేసవిలోగా లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించాలనేది లక్ష్యం కాగా, ముందస్తు ఎన్నికలు, తదితర పరిణామాల నేపథ్యంలో అవి అటకెక్కాయి. పూర్తవుతున్న ఇళ్లకు కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయని కాంట్రాక్టు ఏజెన్సీలు వాపోతున్నాయి.  తాజాగా రూ. 328 కోట్ల చెల్లింపులు జరిగినప్పటికీ, మరో రూ. 300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాక ఇంకో రూ. 300 కోట్ల బిల్లులు రెడీగా ఉన్నాయని సమాచారం.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక, అధికారులు చేతులెత్తేయడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ససేమిరా అంటున్నారు. రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడమే కాక పులిమీద పుట్రలా సిమెంట్‌ కంపెనీలు గతంలో ఇచ్చిన హామీ మేరకు సిమెంట్‌  బస్తాను రూ. 230కి అందివ్వడం లేవు. డబుల్‌ బెడ్‌రూమ్‌ఇళ్ల పనులకు తొలుత కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడంతో పేదల నాదుకునే ఈ పథకానికి ముందుకు రావాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులే కాక స్వయానా అప్పటి మునిసిపల్‌మంత్రి కేటీఆర్‌ కూడా కాంట్రాక్టర్లను కోరారు.వారికి సిమెంటు, ఇసుక సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్‌ ఇళ్ల రేటు తమకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు మొండికేయడంతో సిమెంటు కంపెనీలతో మాట్లాడి బహిరంగ మార్కెట్‌తో సంబంధం లేకుండా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కవసరమైన సిమెంట్‌ బస్తా ధరను రూ.230కి ఖరారు చేశారు. ఆ మేరకు సిమెంట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకనుగుణంగా ఇప్పటి వరకు సరఫరా చేశారు. ఉన్నట్లుండి ఈ నెల ఆరంభం నుంచి  పలు సిమెంట్‌ కంపెనీలు సిమెంట్‌ సరఫరాకు సంబంధించి కొటేషన్స్‌ ఇవ్వడం లేదు. ఈ నెల 15న రెండు కంపెనీలు మాత్రం కొటేషన్లు  ఇచ్చినప్పటికీ ధరను రూ. 230 నుంచి రూ. 260కి పెంచినట్లు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు  కొందరు పేర్కొన్నారు.  దీనివల్ల తమపై భారం పెరగడమే కాక ప్రభుత్వంపైనా అదనపు భారం పడనుందంటూ ఒప్పందాని కనుగుణంగా రూ. 230కే సిమెంట్‌ బస్తా లభించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని  తెలంగాణ రాష్ట్ర ‘బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ఇండియా’  ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌లకు  లేఖలు రాసింది. ఈ అంశంలో  ఒప్పందాని కనుగుణంగా సిమెంట్‌ సరఫరా జరగనిదే తాము పనులు చేయలేమని జీహెచ్‌ఎంసీలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరు ఒకరు తెలిపారు. ధర పెంపుతో ఇప్పటి వరకు పూర్తయిన పనులు పోను  మిగతా పనులకు ఒక్కో ఇంటికి దాదాపు ఐదారు వేల అదనపు భారం పడనుంది. ఈ లెక్కన వేలసంఖ్యలోని ఇళ్లపై అదనపు భారం పెరగుతుందన్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25329
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author