మంచిర్యాలలో యదేఛ్చగా మందుల దందా

మంచిర్యాలలో యదేఛ్చగా మందుల దందా
February 21 11:13 2019

జిల్లాలో సుమారు 1000 వరకు మెడికల్‌ షాపులు ఉండగా.. వీటికి మందులు సరఫరా చేసేందుకు 30 వరకు ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులకు అనుసంధానంగా 700లకుపైగా మందుల దుకాణాలు ఉన్నాయి. ఇందులో సగం దుకాణాలు ఫార్మసిస్టులు లేనివే ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడైనా ఆస్పత్రి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టేందుకు పోటీ విపరీతంగా ఉంటోంది. రెండున్నరేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా ఏర్పడడంతో కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇక్కడ కొత్తగా వెలుస్తున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో మందుల దుకాణాలు పెట్టేందుకు చాలా మంది పోటీ పడుతూ అవకాశం దక్కించుకుంటున్నారు. మరికొన్ని ఆస్పత్రులు సొంతంగా మెడికల్‌ షాపులు నెలకొల్పుతున్నాయి. అయితే విడిగా నిర్వహిస్తున్న మందుల దుకాణాల్లో ఫార్మసిస్టే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. దుకాణం నిర్వహిస్తున్న సమయాల్లో ఫార్మసిస్టు పర్యవేక్షణనే మందుల విక్రయాలు జరగాలి.అనేక రిటైల్‌ దుకాణాల్లో ఫార్మసిస్టు అందుబాటులో ఉండడం లేదు. పట్టణాల్లోనే ఫార్మసిస్టు లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. గ్రామాల్లో ఎలాంటి ఫార్మసిస్టు ధ్రువపత్రం లేకుండానే, ఇతరుల సర్టిఫికెట్లను అద్దెకు తెచ్చుకుని దుకాణాలు నడుపుతూ మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంబీబీఎస్‌ వైద్యులు సిఫార్సు చేసిన మందుల చీటీ ఆధారంగానే జులుబు, జ్వరం వంటి చిన్నచిన్న రోగాలకు సైతం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చిన్నపిల్లలు వెళ్లి అడిగినా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్‌ సూచన మేరకు ఎవరికైనా ఇచ్చే మందులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలి. కానీ బిల్లు కావాలంటే నిర్వాహకులు అదనంగా పదిశాతం డబ్బులు వసూలు చేస్తున్నారు.జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణపై జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. కానీ జిల్లాలో ఇష్టారీతిన మందుల దుకాణాలు నిర్వహిస్తున్నా, ఒక్క దుకాణంపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మెడికల్‌ దుకాణాల్లో ఫార్మసిస్టుల స్థానంలో మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు పలువురు సిబ్బందిని నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారు. వారికి మందులపై ఎలాంటి అవగాహన లేకపోవడం, డాక్టర్లు మందుల పేర్లను స్పష్టంగా రాయకుండా, గీతల రూపంలో రాసి ఇవ్వడంతో, ఏ మందులు రోగులకు అంటగడుతున్నారోననే భయం ప్రజల్లో ఉంది. మెడికల్‌ దుకాణంలోని మందులు డేట్‌ ఎక్స్‌పైరీ ఉంటే, వెంటనే వాటిని షాపు నుంచి తొలగించి, మళ్లీ కొత్త మందులను తెప్పించి, రోగులకు ఇవ్వాలి.ఎలాంటి అవగాహన లేనివారు మందులను విక్రయిస్తుండడం, కాలం చెల్లిన మందుల గురించి పట్టించుకోకుండా, వాటినే రోగులకు ఇస్తున్నారు. కాలం చెల్లిన మందులు వేసుకున్న వారికి వ్యాధి తగ్గకపోగా, కొత్త వ్యాధులు వస్తున్నాయి. దీంతో జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మందుల దుకాణాలను డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిత్యం తనిఖీ చేస్తూ, ఆయా దుకాణాలకు లైసెన్సు ఉందా, సర్టిఫికెట్‌ ఉన్న ఫార్మసిస్టు దుకాణం నిర్వహిస్తున్నారా అనే విషయాలతోపాటు, కాలం చెల్లిన మందుల విక్రయాలు జరుపుతున్నారా? అనే దానిపై ఇకనైనా అధికారులు దృష్టి సారించి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25332
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author