అడవులు మాయం

అడవులు మాయం
February 21 16:25 2019

రాష్ట్రంలోనే అతి తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల రక్షణకు, మొక్కల పెంపకానికి అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యంగా కనబడుతున్నాయి. కళ్లముందే కలప అక్రమ వ్యాపారం జరుగుతున్నా నెలవారీ మామూళ్లతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలప స్మగ్లింగ్‌ చేస్తున్న వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించాలని సర్కారు ఆదేశిస్తున్నా అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఎంత సేపూ కాగితాలపై లెక్కలు తప్పితే క్షేత్రస్థాయిలో అటవీ పరిరక్షణకు సంబంధించి సర్కారు పిలుపునిచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేసి క్షేత్రస్థాయి సిబ్బందిని కార్యోన్ముఖుల్ని చేయలేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా అటవీ సంపదను దోచుకుంటున్నారు.నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో అడవుల విస్తీర్ణం దాదాపు 33 శాతం ఉండాలి. కానీ అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6.5 శాతంగా ఉండటం ఆందోళన కలిగించే పరిణామమే. యాదాద్రిలో అది రెండు శాతమే. ఉమ్మడి జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచాలనే లక్ష్యంతో 2016లో రెండో దశలో హరితహార కార్యక్రమాన్ని జిల్లా నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కల పెంపకం కార్యక్రమానికి ఈ సందర్భంగా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.కృష్ణపట్టి ప్రాంతంలోని దేవరకొండ, చందంపేట, నేరడుగొమ్ము, కొండమల్లేపల్లి, పీఏ పల్లి, పెద్దవూర ప్రాంతాలతో పాటూ నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై ఉన్న చింతపల్లి     మండలంలోనూ కలప అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏళ్లుగా కొంత మంది వ్యాపారులు బొగ్గు బట్టీల వ్యాపారం ద్వారా రూ.కోట్ల ఆర్జనకు అలవాటుపడటంతో అటవీ సంపద రోజురోజుకూ తరిగిపోతోంది. నల్గొండ-కొండమల్లేపల్లి రహదారి పక్కనే చాలా చోట్ల బొగ్గుబట్టీలు వేసి నిబంధనలకు విరుద్ధంగా కలపను వినియోగిస్తున్నా సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దేవరకొండ ప్రాంతానికి చెందిన ఇద్దరు కలప వ్యాపారులు చాలా కాలంగా కలప స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తూ కృష్ణపట్టి ప్రాంతంలోని కలపను అక్రమంగా సరిహద్దులోని నాగర్‌కర్నూల్‌ జిల్లాకు తరలిస్తున్నారు. వీటితో పాటూ ఇటీవల కోదాడ-జడ్చర్ల రహదారి విస్తరణ పేరుతో నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారికిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లనూ నరికివేసి కొంత మంది సొమ్ము చేసుకున్నారు. రహదారి విస్తరణ సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటి సంరక్షించాల్సి ఉన్నా గుత్తేదారులు చెట్ల నరికివేతకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారుు. ఈ విషయంలో పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు తమ పని కాదంటే తమది కాదని కిమ్మనకుండా చోద్యం చూస్తున్నారు.జాతీయ రహదారి విస్తరణ పేరుతో ఇప్పటికే సూర్యాపేట-జనగాం రహదారిలో పెద్ద పెద్ద చెట్లను నరికివేసిన కాంట్రాక్టర్లకు తోడూ ఇప్పుడు అక్రమార్కులు కొత్త రూట్లలో కలప వ్యాపారం సాగిస్తున్నారు. ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ సరిహద్దుకు ఆనుకొని ఉన్న నూతన్‌కల్‌, జాజిరెడ్డిగూడెం తదితర మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల నుంచి కలపను రాత్రి వేళల్లో జాతీయ రహదారి మీదుగా రాజధానికి తరలిస్తున్నారు. జాతీయ రహదారిపై ఎక్కడా అటవీ శాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎప్పటికప్పుడు కలప రవాణా జరగకుండా అడ్డుకొని పర్యవేక్షణ చేయాల్సిన బీట్‌ అధికారులకు నెలకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు తామే ఇస్తున్నామని వ్యాపారులు వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. నూతన్‌కల్‌ మండలంలోని పెదనెమిల, మాచనపల్లి, బిక్కుమల్ల, లింగంపల్లి గ్రామాల్లో నిల్వ ఉంచిన కలపను రాత్రివేళల్లో లారీల్లో ఖమ్మం, విజయవాడకు తరలిస్తుండగా ఇప్పటివరకు ఒక్క అటవీ అధికారి కూడా ఇటువైపు చూడకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు మేళ్లచెర్వు, మఠంపల్లి మండలాల్లోని కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉన్న అటవీని కొందరు పట్టా భూములుగా చేసుకుంటున్నారు. అటవీ భూములను యథేచ్ఛగా కొన్ని సిమెంటు కంపెనీలు తమకు అనుకూలంగా రికార్డుల్లో రాసుకుంటున్నా సంబంధిత రెవిన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. మఠంపల్లి, మేళ్లచెర్వు, హుజూర్‌నగర్‌, దామరచర్ల ప్రాంతాల్లో వెలిసిన సిమెంటు కంపెనీలు అటవీ భూములను సైతం కబ్జా చేస్తున్నాయి. ఈ భూములకు సంబంధించిన పత్రాలు రెవిన్యూ, అటవీ అధికారుల వద్ద లేకపోవడంతో సిమెంటు కంపెనీల యాజమాన్యాలు తమకు అనుకూలంగా భూములను రికార్డుల్లో రాసుకుంటున్నాయి.రాష్ట్రంలోనే అత్యధిక కి.మీ. జాతీయ రహదారి ఉమ్మడి నల్గొండ నుంచే వెళుతోంది. గతంలో చేపట్టిన హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ సమయంలో రహదారికిరువైపులా ఉన్న ఒక్క చెట్టును తొలగిస్తే రెండు మొక్కలు నాటాలని అధికారులు కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే హైదరాబాద్‌ నుంచి రాయగిరి వరకు విస్తరణ జరిగినా ఇప్పటివరకు 1:2 నిష్పత్తిలో మొక్కలు నాటలేదు. నాటిన మొక్కల పర్యవేక్షణ గుత్తేదారు సంస్థ చేయాల్సి ఉన్నా ఆ నిబంధనను తుంగలో తొక్కారు. హైదరాబాద్‌ – విజయవాడ రహదారిలో హరితహారం కార్యక్రమం కింద చేపట్టిన మొక్కల పెంపకాన్ని గుత్తేదారు జీఎంఆర్‌ సంస్థ చూసుకోవాలి. అయితే రెండు వరుసల్లో ఉన్న మొక్కల పెంపకం మాత్రమే తాము బాధ్యులమని మిగిలిన ఒక వరుస సర్కారు బాధ్యతని చేతులు దులుపుకుంటోంది. దీంతో అధికారులు దీనిపైనా సరైన విధంగా దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా సర్కారు చేపట్టిన ఈ యజ్ఞంలో అధికారులు భాగస్వాములై ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25362
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author