గౌడన్లలో భారీగా చేరుతున్న మందు నిల్వలు

గౌడన్లలో భారీగా చేరుతున్న మందు నిల్వలు
February 23 12:25 2019

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ రాకముందే భారీగా మద్యం నిల్వలు చేసేందుకు సిండికేట్లు సన్నద్ధమయ్యారు. మొన్నటి వరకు బెల్టు షాపులుగా కొనసాగిన మద్యం గోడౌన్లు రాబోయే రెండు నెలల పాటు భారీగా నిల్వ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే మద్యం వ్యాపారుల డిమాండ్‌ మేరకు ఏపీబీసీఎల్‌ నుంచి సరుకు సరఫరా చేసే అవకాశం ఉండదు. గత ఏడాదిలో ఆ నెలకు సంబంధించి ఎంత మేర వ్యాపారం చేశారో అంతకు పది శాతం అధికంగా మాత్రమే సరుకు సరఫరా చేస్తారు. ఆ మేరకు మాత్రమే వ్యాపారుల నుంచి డీడీలు స్వీకరిస్తారు. గతేడాది రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనవరి నెలకు సంబంధించి రూ.1,690 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది జనవరిలో రూ.2 వేల కోట్లకు పైగా సరుకు కొనుగోలు జరిగింది.గతేడాది ఫిబ్రవరి నెలలో రూ.1,338 కోట్ల విలువైన మద్యం సరఫరా ఏపీబీసీఎల్‌ నుంచి జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికే ఏపీబీసీఎల్‌ నుంచి రూ.1.004 కోట్ల విలువైన సరుకు కొనుగోలు చేశారు. మద్యం వ్యాపారంలో మెజార్టీ శాతం అధికార పార్టీ నేతలే ఉన్నారు. రాష్ట్రంలోని 4,380 మద్యం షాపుల్లో సరుకు కొనుగోళ్ల వివరాలు సరిగా లేకపోవడం గమనార్హం. గతంలో మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు, ఆన్‌లైన్‌ మద్యం విక్రయాలు చేపట్టేలా ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. అసలు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు పర్యవేక్షించే అవకాశమే ఇప్పుడు లేకుండా పోయింది. దీంతో మద్యం సిండికేట్లు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీగా నిల్వలు చేసే పనిలో పడ్డారు.మద్యం నిల్వ చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం గోడౌన్లకు లైసెన్సులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గోడౌన్లు మొన్నటివరకు బెల్టు షాపులుగా ఉపయోగపడ్డాయి. ఎన్నికల అవసరాల దృష్ట్యా రోజు వారీ మద్యం విక్రయాలను కొంత మేర తగ్గించి ఈ గోడౌన్లలో సరుకు దాచేస్తున్నారు. ఎరువులకు, నిత్యావసరాలు దాచేందుకు వినియోగించే గోడౌన్లలోనూ మద్యం దాస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా మద్యం సరఫరా, అమ్మకాలపై దృష్టి సారించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు అసలు పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం కావడం గమనార్హం. ఇటు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం తనిఖీలను పూర్తిగా అటకెక్కించింది.  

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25433
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author