చర్చానీయంశంగా మారిన రేణుదేశాయ్

చర్చానీయంశంగా మారిన రేణుదేశాయ్
February 26 10:35 2019

విరామం తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంతకాలం తనకు పట్టున్న, తన సామాజకవర్గం బలంగా ఉన్న ప్రాంతంపైనే ఎక్కువ దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ ఈసారి రాయలసీమను టార్గెట్ చేశారు. అందునా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య తీవ్ర పోటీ ఉన్న కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర మొదలుపెట్టారు. రాయలసీమలోనూ తన ప్రభావం చాటుకోవాలనుకుంటున్న ఆయన ఆదివారం, సోమవారం కర్నూలులో రోడ్ షోలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఇదే కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నప్పుడే ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్ పర్యటన తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆమె కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించారు. అందునా పవన్ కళ్యాణ్ కు రాజకీయ ప్రత్యర్థి అయిన వై.ఎస్. జగన్ కు చెందిన సాక్షి ఛానల్ తరపున ఆమె ప్రజల్లోకి వెళ్లడం రాజకీయవర్గాల్లోనే కాక, సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది.గత ఎన్నికల ముందు జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. ఈసారి ఆయన ఒంటరిగా బరిలో దిగాలనుకుంటున్నారు. పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, అంతకంటే ఎక్కువ ప్రతిపక్ష నేత జగన్ ను టార్గెట్ చేస్తూ ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు. అధికార పార్టీ కంటే ఎక్కువగా తమ నేతను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వెనుక కుట్ర ఉందని, టీడీపీ – జనసేన కలిసే ఉన్నాయనేది వైసీపీ భావన. అయితే, పవన్ కళ్యాణ్ పై పెద్దగా విమర్శలు చేయని జగన్.. పాదయాత్ర సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వివాహాలను లేవనెత్తారు. దీంతో వ్యక్తిగత విమర్శలు చేశారంటూ జగన్ పై జనసేన, టీడీపీ నాయకులు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వివాదం పెద్దదయ్యే కొద్దీ పవన్ వైవాహిక జీవితంపై ప్రజల్లో చర్చ జరుగుతుందని భావించిన జనసేన అక్కడితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తర్వాత పవన్ సోదరుడు నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా జగన్ ను తీవ్రంగానే విమర్శిస్తున్నారు.ఇక, పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణూ దేశాయ్ చాలా కాలం తర్వాత ఇటీవల మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనూ రేణూ మరో వివాహం చేసుకోవడం తప్పు అన్నట్లుగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. తర్వాత తాను నోరు తెరిస్తే మీకే ఇబ్బంది అంటూ రేణూ సీరియస్ అయ్యారు. అప్పటి నుంచి ఆమెపై ట్రోల్స్ ఆగిపోయాయి. పవన్ తన పని తాను చేసుకుంటున్నారు. రేణూ దేశాయ్ కూడా రచయిత్రిగా, గృహిణి స్థిరపడిపోయారు. తాజాగా, ఆమె ఒకటిరెండు సినిమాల్లో నటించడానికి కూడా సైన్ చేశారని ప్రచారం జరిగింది. ఇంతలో ఉన్నట్లుండి సాక్షి ఛానల్ పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి రావడం జనసేనను ఇబ్బంది పెట్టే పరిణామమే. రేణూ దేశాయ్ కు ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ప్రజల్లో ఎక్కువ గుర్తింపు ఉంది. ఆమె ప్రజల్లోకి వెళితే పవన్ వైవాహిక జీవితంపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సహజంగానే ఆమె పట్ల ప్రజల్లో కొంత సానుభూతి కూడా ఉంటుంది. తన గురించి ఎక్కడా చెప్పుకునే అవకాశం అయితే లేదు. కేవలం ఆమె సాక్షి యాంకర్ గా వివధ వర్గాల సమస్యలు తెలుసుకొని ప్రజలకు చెప్పాలనుకోవడంలో ఎటువంటి తప్పులేదు. మొత్తానికి యాధృచ్ఛికంగా జరిగిందో, రాజకీయ వ్యూహం ఉందో కానీ సాక్షి ద్వారా ప్రజల్లోకి రేణూ దేశాయ్ వెళ్లడం పవన్ కళ్యాణ్ కు కొంత ఇబ్బందికరమే. అయితే, ఆమె వేరే విడాకులు తీసుకున్నాక వేరే వివాహం చేసుకోవడాన్నే జీర్ణించుకోలేక ఆమెను ట్రోల్ చేసిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా ప్రజల్లోకి రావడం పట్ల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25531
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author