అమ్మో గ్రానైట్ లారీ

అమ్మో గ్రానైట్ లారీ
February 26 10:42 2019

 గ్రానైట్‌ తవ్వకాలతో గుట్టలు, చెట్లు కనుమరుగై పర్యావరణాన్ని దెబ్బతీస్తుంటే.. రాళ్లను రవాణా చేసే లారీలు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నాయి. రవాణాదారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. సామర్ధ్యానికి మించి బరువును తరలించడం… అతివిశ్వాసం, నిర్లక్ష్యంతో కూడిన వాహన చోదకం.. వెరసి శరీరాలు టైర్ల కింద నలిగి చిధ్రమవుతున్నాయి. నిబంధనలు కచ్చితంగా పాటించేలా పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ‘మామూలు’గానే వ్యవహరిస్తుండడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాలో నాణ్యమైన గ్రానైట్‌ ఖనిజ సంపద విస్తారంగా ఉంది. ముఖ్యంగా కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్‌, బద్దిపల్లి, ఆసిఫ్‌నగర్‌, ఎలగందుల, నాగులమల్యాల, ఖాజీపూర్‌ గ్రామాల్లో గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. నిత్యం కొన్ని వందలాది క్యూబిక్‌ మీటర్ల రాయిని వెలికితీస్తున్నారు. వివిధ రకాల నమూనాల్లో ఉన్న రంగు రంగుల గ్రానైట్‌ రాళ్లకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అత్యంత నాణ్యమైన గ్రానైట్‌ను వ్యాపారులు విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. మైనింగ్‌ శాఖ జారీ చేసే పర్మిట్లతో వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. ముఖ్యంగా విదేశాలకు ఎగుమతయ్యే రాళ్లను క్వారీల నుంచి లారీల్లో రైల్వేస్టేషన్‌లకు చేరుస్తారు. అక్కడి నుంచి నౌకాశ్రయాలకు చేరుస్తారు. అత్యధిక శాతం లారీల ద్వారానే నేరుగా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. భారీ ట్రాలీలు ఉన్న లారీలను ఉపయోగిస్తున్నారు. జిల్లా నుంచి పోర్టుకు, కటింగ్‌ ఫ్యాక్టరీలకు రాళ్లను రవాణా చేసేందుకు రోజుకు సుమారు 300 వరకు వినియోగిస్తున్నారు. దీంతో గ్రానైట్‌ వ్యాపారానికి సమాంతరంగా గ్రానైట్‌ రవాణా వ్యాపారం కూడా వృద్ధి చెందుతోంది.సాధారణంగా గ్రానైట్‌ రవాణాకు భారీ ట్రాలీలతో కూడిన లారీలను వినియోగిస్తుంటారు. డ్రైవర్లు నైపుణ్యం ఉన్నవారే ఉంటారు. కానీ ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం.. ప్రతి ఒక్కరిని కలవరానికి గురి చేస్తోంది.. గ్రానైట్‌ లారీ ఢీకొడితే మృత్యువాత పడడమేనన్న విధంగా మారింది. డ్రైవర్లు, రవాణాదారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రజల ప్రాణాల మీదికి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో ట్రాలీపైకి గ్రానైట్‌ బ్లాక్‌ లోడింగ్‌ మొదలుకొని గమ్యస్థానం చేరే వరకు అప్రమత్తంగా ఉండాలి. బరువు పరిమితిని మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, నిర్దేశించిన బరువుతో లారీలను నడిపితే తమకేం మిగులుతుందంటూ సామర్థ్యానికి మించిన బరువుతోనే నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అత్యవసరంగా బ్రేకులు వేసినా, రోడ్డుపై కుదుపులు వచ్చినా ట్రాలీపై ఉన్న రాయి అంగుళం కూడా కదలకుండా తాళ్లతో బిగించాలి. రాయిపై ఉన్న దుమ్ము, ధూళితో వెనక వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రాయిపై తప్పనిసరిగా కవర్లను కప్పి ఉంచాలి. లారీ వెనకభాగంలో ఎర్రటి రిఫ్లెక్టింగ్‌ టేప్‌, ముందు భాగంలో తెల్లటి, ఇరువైపులా పసుపు రంగు రిఫ్టెక్టింగ్‌ టేపులను అంటించాలి.. రవాణా శాఖ అధికారులు కేవలం ఫిట్‌నెస్‌ నమయంలోనే వీటిని పరిశీస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే లారీ చోదకులు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలనే ఆతృత, తగినంత విశ్రాంతి లేకుండా వాహనాన్ని నడిపించడంతో ప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణమని రవాణా రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25534
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author