ఎజ్రా మాస్టారి గారి మొదటి వర్ధంతి- వారి జ్ణాపకాలతో…జోహార్ మాస్టారు !!7G న్యూస్ నివాళి

ఎజ్రా మాస్టారి గారి మొదటి వర్ధంతి- వారి జ్ణాపకాలతో…జోహార్ మాస్టారు !!7G  న్యూస్ నివాళి
March 01 10:21 2019

ఎజ్రా మాస్టారు…లేరు; ఆయన లక్ష్యం సజీవంగా ఉంది.
అంబేద్కరిజానికి నిలువెత్తు సాక్ష్యం, తన జీవితాంతం అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన మనకాలపు ఆచరణ వాది ఎజ్రా మాస్టారు(85) గత ఏడాది ఇదే రోజు తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట, పల్నాడు ప్రాంతంలో ఎజ్రా మాస్టారుగా సుపరిచితమైన ఆయన ఆ రోజుల్లోనే దళితుల కోసం స్వయంగా హాస్టల్ నడిపి వందలాదికి విద్యాబుద్ధులు నేర్పి, సొసైటీలో సగౌరవంగా జీవించేలా వారిని తీర్చిదిద్దారు. తన సొంత పిల్లలను కూడా అదే హాస్టల్‌లో చేర్చి, తరతమ భేదాలు లేకుండా చదువు నేర్పించారు. ‌తనకున్న విద్యార్హతలతో ఎదోఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వీలున్నప్పటికీ దళిత పిల్లలకు చదువు చెప్పే సామాజిక బాధ్యతలు స్వీకరించారు. అంబేద్కర్ సిద్దాంతిక పుస్తకాలు, ఇతర సాహిత్యం గుంటూరు నుంచి సొంతంగా తెప్పించి పిల్లలకు బోధించే వారు. ఎజ్రా మాస్టారు ముందుచూపును తెలుసుకున్న ఎందరో రాజకీయ నాయకులు ఆయన్ను స్వయంగా కలుసుకు‌నేందుకు ఉత్సాహం చూపేవారు. అప్పట్లో రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖులైన కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎజ్రా మాస్టారును ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని పలుమార్లు ఆహ్వానించారు. కాసు సలహాను సున్నితంగా తిరస్కరించిన మాస్టారు, పల్నాడు ముఖ్యంగా నర్సారావుపేట ప్రాంతంలోని దళితుల సమస్యలను కాసు దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ‌మొన్న మొన్నటి వరకు ఎజ్రా మాస్టారు స్వగ్రామమైన పొనుగుపాడు దళిత వాడలో ఆధిపత్య పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకోవాలంటే మాస్టారి అనుగ్రహం ఉండాల్సిందే. అంటే ఆయన అనుమతి లేకుండా ఆ దళిత వాడలో ఆధిపత్య కులాల రాజకీయ నాయకులకు ఎంట్రీ లేదు. ఫిరంగిపురం మండలంలోని వారి గ్రామం, తాడికొండ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో అటు కాంగ్రెస్, ఇటు తెలుగు దేశం పార్టీలు పోటాపోటీగా టిక్కెట్ ఆఫర్ చేసినా, ఆయా పార్టీల ఆధిపత్య కులాల నాయకత్వం క్రింద పనిచేయడం ఇష్టం లేని మాస్టారు అటువైపు కన్నెత్తి చూడలేదు.
అప్పట్లో రాష్ట్రంలో బిఎస్పీ వేవ్ బలంగా ఉన్న రోజుల్లో స్వయంగా మాన్య శ్రీ కాంసీరాం, తనను కలిగిన జిల్లా నాయకులతో ఎజ్రా మాస్టారి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారంటేనే ఎజ్రా మాస్టారు ప్రభావం జిల్లాలో ఏమేరకు ఉండేదో విడిగా చెప్పాల్సిన పనిలేదు.‌
ప్రముఖ అంబేద్కరియులు గేరా రవిబాబు ఐఏఎస్ ఎజ్రా మాస్టారి రెండో కుమారుడు, మాస్టారి పెద్దబ్బాయి గేరా కిషోర్ బాబు ప్రతిష్ఠాత్మక విద్యుత్ ఉత్పత్తి సంస్థలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు, మాస్టారి మరో కుమారుడు గ్రూప్1 ఆఫీసరే.‌ ” పిల్లలంతా పట్టణాల్లో ఉన్నారుగా, మీరూ అక్కడే ఉంటే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయిగా ” అని ఎవరైనా చెబితే, ” ఇక్కడెవరుంటారు ” అని అడిగేవారు మాస్టారు. నిజమే నోరులేని వారికి, అపన్నులు అసహాయులైన దళితులకు మాస్టారే పెద్దదిక్కు… ఒక్కమాటలో చెప్పాలంటే ఎజ్రా మాస్టారు మనకు ఒక ” మోషే”
(ఎజ్రా మాస్టారి గారి మొదటి వర్ధంతి- వారి జ్ణాపకాలతో…జోహార్ మాస్టారు !! )

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25581
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author