రంగారెడ్డిలో 1000 అడుగులకు పడని నీరు

రంగారెడ్డిలో 1000 అడుగులకు పడని నీరు
March 02 14:25 2019

వరుసగా రెండేళ్లుగా వరుణుడు ముఖం చాటేయడంతో చెరువులు, కుంటల్లో నీరు రాలేని దుస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కరువు భయం జనాన్ని పట్టిపీడిస్తోంది. అదేవిధంగా జిల్లాలో భూగర్భ జలమట్టాలు కనిష్టస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని భూగర్భ జలశాఖ ప్రతినెలా నీటి మట్టాలను నమోదు చేస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే నీటి మట్టాలు ప్రతినెలా పడిపోతున్నాయి తప్పా ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవు. జిల్లాలోని 18 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 4 మండలాల్లో 40 మీటర్ల లోతులో, మరో 7 మండలాల్లో 20 మీటర్ల కంటే లోతులో భూగర్భ జలాల లభ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మరో 6 మండలాల్లో నీటి లభ్యత 18 మీటర్ల లోతుల్లో ఉంది. ఈ లెక్కల ప్రకారం రానున్న సమీప రోజుల్లో నీటికి కటకట తప్పదేమోననే భావన కలుగుతోంది. గతేడాది జనవరిలో జిల్లాలో సాధారణంగా నీటి లభ్యత 11 మీటర్లలోతులో ఉండగా, ప్రస్తుతం అది 40 మీటర్లకు పైగానే చేరుకుంది. అంటే సుమారుగా 29 మీటర్లకు పైగా నీటి మట్టం తగ్గింది. వికారాబాద్, బంట్వారం, కొడంగల్, దోమ మండలాల్లో ఈ సీజన్‌లో భూగర్భజల నీటిమట్టం సుమారుగా 25 మీటర్లకు పైగా లోతులో ఉంది. అదేవిధంగా మోమిన్‌పేట ధారూరు, యాలాల, తాండూరు మండలాల్లో 22 మీటర్ల లోతులో ఉంది.ఈ సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు కేవలం 475 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. సుమారుగా 40 శాతం తక్కువ వర్షం కురిసింది.జిల్లాలోని ఆయా గ్రామాల్లో మొత్తం 55,436 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 3 వేలకు పైగా బోరుబావులు ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. మరో 8వేల పైచిలుకు బోర్లలో నీళ్లు తక్కువగా వస్తున్నాయి. ఇక పట్టణాల్లో గృహావసరాలకు సుమారుగా ప్రతి ఇంటికీ ఒక బోరు ఉంది. ప్రస్తుతం 1000 అడుగుల మేర తవ్వించినా నీరు రాలేదని పరిస్థితి నెలకొంది. ప్రతి ఫీట్‌ డ్రిల్లింగ్‌కు వంద ఫీట్ల వరకు రూ.60 ధర కాగా, ఆ తర్వాత ప్రతి అడుగుకు రూ.70 వసూలు చేస్తున్నారు నిర్వాహకులు.  సుమారుగా రెండు లక్షలకు పైగా ఖర్చవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇకపోతే తాగునీటి అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 5వేల చేతిపంపులు, 775 రక్షిత మంచినీటి పథకాలు, 162 సీపీడబ్ల్యూ, ఎంపీడబ్ల్యూ నీటి సరఫరా పథకాలు కొనసాగుతున్నాయి. వీటితో జిల్లాలోని 9.4 లక్షల జనాభాకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీరు ఇప్పటికే సుమారుగా జిల్లాలోని 70 శాతం ఆవాసాలకు సరఫరా అవుతున్నాయి. వేసవిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడం, వ్యవసాయ బోర్లు, బావు లు వట్టిపోతున్న నేపథ్యంలో బోరు డ్రిల్లింగ్‌ వాహనాలకు భళే గిరాకీ ఏర్పడింది.  సీజన్‌లో సుమారుగా 6 మీటర్ల లోతుకు  పైగా భూగర్భజలాలు పాతాళానికి వెళ్లాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 1నుంచి వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీంతో రైతులు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్‌ పంపుసెట్లను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో భౌగోళిక పరిస్థితుల ప్రకారం వర్షాకాలంలో సగటున 6 మీటర్లు, వేసవిలో 12 మీటర్లలోపు భూగర్భ నీటి మట్టాలు ఉండాలి. అయితే, ప్రస్తుతం సగటున 40 మీటర్లకుపైగా పడిపోయా యి. ఇక ఎండల తీవ్రత పెరిగితే ఏప్రిల్, మే నెలలో గంగమ్మ మరింత లోపలికి వెళ్లిపోతుందేమోనని రైతులు ఆందోళనచెందుతున్నారు. రోజురోజుకూ గంగమ్మ పాతాళంలోకి వెళ్తున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25593
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author