బోధిసత్వ అంబేడ్కర్ కలలపంట సామ్రాట్ కాన్షీరామ్ — — కలేకూరి ప్రసాద్

బోధిసత్వ అంబేడ్కర్ కలలపంట సామ్రాట్ కాన్షీరామ్ —                  — కలేకూరి ప్రసాద్
March 15 11:59 2019

అప్పుడే కుట్టించుకున్న కొత్తబట్టలు వేసుకొని ట్రంకు పెట్టెలు చేతపట్టుకుని , సంచులు మోసుకుంటూ భార్యాబిడ్డలతో తడబడే అడుగులతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కారిడార్లలో నడుస్తున్నారు కొంతమంది వ్యక్తులు.ముఖాలు చూసి వారి కులాల పేర్లను చెప్పగల మేధావులున్న మన దేశంలో వాళ్లెవరో కనుక్కోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. వాళ్ళు అందరి బట్టలు ఉతికే చాకలి వాళ్ళు. అందరికీ సవరాలు చేసే మంగలి వాళ్ళు. దూదేకుల పింజారీ వాళ్ళు. గుర్జార్లు, వాల్మీకులు కుండలు చేసే కుమ్మరులు.
అయితే వాళ్ళు అక్కడికి వచ్చింది తమ తమ కుల వృత్తులను చేయడానికి కాదు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం,జపాన్, పాకిస్తాన్ దేశాల కంటే కూడా పెద్ద భూభాగం కల రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి , ఏనాడూ తమ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లోకి కూడా వెెల్లని వాళ్లు, ఏనుగు అంబారి ఎక్కి ఉత్తర ప్రదేశ్ రాజధానికి ఎకాఎకిన వచ్చి వాలారు.నేడు ఉత్తర భారతాన్ని ఏనుగుల గుంపు చుట్టుముట్టింది.ఆ ఏనుగులకు అంబారీలను అలంకరించి మట్టికాళ్ళ మొరటు చేతుల మనుషులను, అణగారిన మనుషులను నిరంతరం అవమానాలకు, అత్యాచారాలకు గురవుతున్న మనుషులను, అంటరాని మనుషులను, పల్లెల్లో పదిమంది నడిచే రహదారుల్లో నడిచి వెళ్ళినందుకే దాడులకూ హత్యాకాండలకు గురైన మనసులను రాచవీధుల గుండా ఠీవిగా నడిపించుకు వచ్చాడు ఒక సామాన్యుడు, మాన్యుడు, అసమాన్యుడు, ఆయనే మాన్యశ్రీ కాన్షీరామ్.

“నా ప్రజలు ఈ దేశంలో పాలితులుగా కాక పాలకులుగా ఉండాలి” అని అంబేద్కర్ కన్న కలల్ని సాఫల్యం చేశాడు మాన్యశ్రీ కాన్షీరామ్. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక chamar మహిళను ముఖ్యమంత్రిగా చేసి చెప్పులు కుట్టే చేతులకు రాజదండాన్ని అందించాడు.

ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు సాగిన రాజకీయ వ్యవసాయం,త్యాగశీలమైన ఆచరణ, నిరంతర శ్రమ, సంఘర్షణ, ఎన్నో అవమానాలు, కాన్షీరామ్ రాజీలేని పట్టుదల, అంబేడ్కర్ ఆశయాల పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం. బహుజన సమాజం పట్ల ఉన్న అమితమైన ప్రేమ, ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురొచ్చినా ఎదురొడ్డి నిలబడగలిగిన శక్తిసామర్థ్యాలు, మొండితనం వీటన్నిటి వలన దళితులు రాజ్యాధికారాన్ని చవిచూడగలిగారు.

1956 డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మరణించేరోజు వరకూ కాన్షీరామ్ కు అంబేద్కర్ గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆయన బీఎస్సీ పూర్తిచేసి డెహ్రాడూన్లోని స్టాఫ్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. కొంతకాలం భారతీయ భూ వైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగం చేశాడు అదే సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ చనిపోయారు. కాన్షీరామ్ తో పాటు ఉద్యోగం చేస్తున్న ఆయన మిత్రుడు శ్రీ గైని అంబేడ్కర్ మరణవార్తను తట్టుకోలేక మూడు రోజులపాటు అన్నం నీళ్లు మానివేసి కంటికి మంటికి ఏకధారగా విలపిస్తుంటే కాన్షీరామ్ కదిలిపోయాడు. అప్పటివరకూ ambedkar పేరు వినడమే కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నడిపిన సామాజిక-రాజకీయ ఉద్యమాలను తెలుసుకొనే అవకాశం ఆయనకు రాలేదు. అయితే మిత్రుడు శ్రీగైని వల్ల కాన్షీరామ్ అంబేడ్కర్ పట్ల , ఆయన రాజకీయ ఆశయాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన జీవితాన్ని, ఉద్యమాన్ని ,రచనలని లోతుగా అధ్యయనం చేసి బాబా సాహెబ్ సిద్ధాంతాన్ని గుండెల్లో నింపుకుని మహామనిషి కాన్షీరామ్.

కాన్షీరామ్ ఉద్యమ ప్రస్థానంలో తన తల్లికి రాసిన ఉత్తరం కానీ , ఆయన నిర్మించిన సంస్థల చరిత్ర కానీ బామ్సెఫ్ , డీఎస్ 4,బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం కోసం ఆయన సాగించిన కృషి,సాగించిన సైకిల్ యాత్రలు, ప్రసంగాలు ఉద్యమాలను అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే.

ఇది బహుజన సమూహాలను, మొత్తంగా మానవాళిని అమితంగా ప్రేమించిన ప్రేమ మూర్తి చరిత్ర. ఇది జాతీయ నాయకులకూ, ప్రధాన ప్రసార సాధనాలకూ కొరకరాని కొయ్యగా మారిన ఒక రాజకీయ దురంధరుడి చరిత్ర.వందల కోట్ల రూపాయలను ఎడమచేత్తో ఖర్చుచేస్తూ స్వంత ఆస్తి లేని ఒక నిరుపేద చరిత్ర.ఒక బౌద్ధ భిక్షువు ఏవిధంగా ఉండాలో ఆ విధంగా జీవించిన ఒక బౌద్ధ భిక్షువు చరిత్ర.

(ఆత్మకూరి చెన్నయ్య గారు రచించిన “మాన్యశ్రీ కాన్షీరాం పోరాటజీవితం” పుస్తకానికి కలేకూరి ప్రసాద్ గారు రాసిన ముందుమాట నుండి)

   -- నేడు : మాన్య శ్రీ కాన్షీరాం 85 వ జయంతి --
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25772
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author