గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం

గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం
April 04 16:53 2019

ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నపుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. గురువారం విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో మెడ్ఆల్ హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గిరిజన సంక్షేమశాఖలోని అన్ని విభాగాలకు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులకు మెడ్ఆల్ హెల్త్ కేర్ సంస్థ సాధారణ రక్తపరీక్షలతోపాటు  57 రకాల టెస్ట్ లు నిర్వహించారు. డైరెక్టర్ గంధం చంద్రుడు, ట్రైకార్ ఎండి రవీంద్రబాబు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. బ్యాంకు రుణాల కోసం వెళ్లినపుడు సిబిల్ స్కోర్ ఎంత కీలకమో.. మన హెల్త్ స్కోర్ ను కూడా అదే కీలకంగా భావించాలన్నారు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు. ఉద్యోగులంతా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నపుడే మంచి ఫలితాలు సాధిస్తారన్నది తన విశ్వాసమని అన్నారు. ఈ వైద్య పరీక్షల అనంతరం రిపోర్టులు వచ్చాక అరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉన్నవారికి అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారు. పని ఒత్తిడిలో ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటామని.. ఇలాంటి వైద్య శిబిరాలు శరీరంలో ఆరోగ్య సమస్యలు గుర్తించి.. నివారణా చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు.అనంతరం ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ.. రోజువారి వ్యవహారాలు, ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నమని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం డైరెక్టర్ గంధం చంద్రుడు గారు తీసుకున్న చొరవ అభినందనీయమని, ఈ అవకాశాన్ని ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆఫీసులోనే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ గంధం చంద్రుడు, ట్రైకార్ ఎండి రవీంద్రబాబు, హెల్త్, ఐటి విభాగం డిప్యూటీ డైరెక్టర్ చినబాబుతోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26269
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author