సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం

సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం
April 05 12:36 2019

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.

వాహన సేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. 

ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని  తమలో ఇముడ్చుకుని, స్వామి అమ్మవారికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
         ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి  శ్రీధర్‌, ఏఈవో  తిరుమలయ్య, సూపరింటెండెంట్‌  జి.రమేష్‌,  కంకణభట్టార్‌  ఆనందకుమార్‌ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.రమేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26479
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author