ప్రయివేటు బ్యాంకులను నాటి ప్రజా ప్రభుత్వం ఎందుకు జాతీయం చేసింది? నేటి కార్పోరేట్ ప్రభుత్వాలు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నాయి?

ప్రయివేటు బ్యాంకులను నాటి ప్రజా  ప్రభుత్వం ఎందుకు జాతీయం చేసింది? నేటి కార్పోరేట్ ప్రభుత్వాలు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నాయి?
July 19 21:04 2019

బ్యాంకుల జాతీయకరణకు
నేటికి సరిగ్గా
యాభయ్ ఏళ్ళు*

★నాడు జాతీయకరణ
నేడు కార్పొరేటికరణ!౦

50 సంవత్సరాల క్రితం ఇదే రోజున (జులై 19) అప్పటి దేశాధ్యక్షుడు వివి.గిరి 14 ప్రయివేటు బ్యాంకుల్ని జాతీయం చేస్తూ ఒక ఆర్డినెన్సు జారీ చేశారు. ఈ చర్యకు సిఫార్సు చేసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణిలో ప్రసంగిస్తూ
(1) దేశవ్యాప్తంగా, అన్ని ప్రాంతాలలోకీ చొచ్చుకుపోయేలా బ్యాంకు శాఖలను విస్తృతంగా ఏర్పాటు చేయడం,
2) బ్యాంకు డిపాజిట్ల సేకరణను మెరుగుపరచడం,
3) స్వల్ప ఆదాయవర్గాలకు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా బ్యాంకు రుణ పరపతి విధానాన్ని రూపొందించడం,
4) బ్యాకింగ్‌ రంగంపై కొద్దిపాటి ప్రైవేటు వ్యాపారసంస్థల పెత్తనాన్ని తొలగించడం,
5) బ్యాంకుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం….

ఈ అయిదు లక్ష్యాలతో బ్యాంకుల జాతీయికరణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు దేశ ప్రజలకి తెలిపారు.

ఈ లక్ష్యాలకు తోడు బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి తగిన శిక్షణ జరపడం, మెరుగైన జీతభత్యాలను చెల్లించడం కూడా ప్రభుత్వ ఉద్దేశ్యం అని ప్రకటించారు.

1969కి ముందు అనేక సందర్భాలలో పార్లమెంటులో ఎంపిలు బ్యాంకులను జాతీయం చేయాలన్న డిమాండును లేవనెత్తుతూ వచ్చారు. దేశంలో ఆదాయాల పంపిణీ ఏతీరుగా ఉందో అధ్యయనం చేసిన పి.సి మహాలనోబిస్‌ కమిటీ 1960 నాటికి దేశంలోని పది శాతం మంది సంపదలో 40 శాతం వాటా పొందుతున్నారని తేల్చింది. దేశంలో గుత్తసంస్థల తీరును అధ్యయనం చేసిన మోనోపలీస్‌ ఎంక్వైరీ కమిషన్‌ 1964 నాటికి దేశంలోని పరిశ్రమలలో 85 శాతం కొద్దిపాటి గుత్తసంస్థల చేతుల్లో ఉన్నాయని తెలిపింది. 1967లో ప్లానింగ్‌ కమిషన్‌కు నివేదిక సమర్పించిన ఆర్‌కె హాజారీ ”దేశంలో ప్రధాన ఆర్థిక సంస్థలు, బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తల ప్రత్యక్ష/ పరోక్ష పెత్తనంలలోనే కొనసాగుతున్నాయని, బ్యాంకుల్ని జాతీయం చేసి ఈ లంకెను తెగ్గొట్టకపోతే కొద్దిపాటి చేతుల్లో కేంద్రీకృతమై ఉన్న ఆర్థికశక్తి అదేవిధంగా కొనసాగుతూనే ఉంటుంది’అని పేర్కొంది.

ఇలా ఫలితాలు!

1947-1951 మధ్య 205 ప్రయివేటు బ్యాంకులు బోర్డులు తిప్పేశాయి. 1951లో 567 ప్రయివేటు బ్యాంకులు ఉంటే 1969 నాటికి అవి కాస్తా 91 అయ్యాయి. ప్రైవేటు బ్యాంకులెంత దివాలా తీశాయో దీనిని బట్టి స్పష్టం అవుతుంది. మరి 1969లో బ్యాంకుల జాతీయీకరణ సందర్భంగా ప్రకటించిన లక్ష్యాలు నెరవేరాయా?
అంటే కచ్చితంగా నెరవేరాయానే చెప్పాలి.
1969లో 1443 గ్రామీణ బ్యాంకు శాఖలుంటే 1990 నాటికి అవి 35,000 దాటాయి. 18 శాతం నుండి 58 శాతానికి గ్రామీణబ్యాంకులు పెరిగాయి. అందునా అంతవరకు బ్యాంకు మొహం ఎరగని మారుమూల గ్రామాలలోకి విస్తరించాయి. 1969 నాటికి గ్రామీణ ప్రజానీకానికి అందుతున్న బ్యాంకురుణాలు 3శాతంగా ఉండేవి. 1987నాటికి ఇది 15 శాతానికి అయిదురెట్లు పెరిగింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతపు డిపాజిట్లు కూడా 6 శాతం నుండి 9 శాతానికి పెరిగాయి. వ్యవసాయం, వ్యవసాయసంబంధిత కార్యకలాపాలు ప్రాధాన్యతా రంగంగా నిర్ణయించడంతో మొత్తం రుణాల్లో 40 శాతం వ్యవసాయానికి, కుటీరపరిశ్రమలకు వచ్చాయి. 1970లో వ్యవసాయరంగంలో రుణాల లబ్ధిదారులు 10లక్షలమంది ఉంటే 1990 నాటికి ఆ సంఖ్య 3కోట్లు దాటింది. వీరిలో 42శాతం చిన్నమధ్యతరహా రైతులే. 4శాతం స్వల్పవడ్డీతో బలహీన వర్గాలకు రుణాలు లభించాయి. 1980లో మరో ఆరుబ్యాంకులను జాతీయం చేశారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా పనిచేసిన ఆర్‌కె. తల్వార్‌ వంటి వారు బ్యాంకింగ్‌ రంగంలో ఎట్టి రాజకీయ జోక్యమూ ఉండడానికి వీలులేదన్న వైఖరికి కచ్చితంగా నిలబడి వ్యవహరించారు. పెద్దఎత్తున బ్యాంకు సిబ్బంది, ఆఫీసర్ల నియామకాలు, గ్రామీణ అభివృద్ధి అధికారుల నియమకాలు చేపట్టారు.ఉద్యోగుల, అధికారుల వేతన స్థాయిలలో వివిధ బ్యాంకుల మధ్య ఉండిన వ్యత్యాసాలు తొలగిపోయి ఒక ఏకరూపత వచ్చింది. ఆర్‌బిఐ స్టాఫ్‌ కాలేజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజిమెంట్‌, స్టేట్‌బ్యాంక్‌స్టాఫ్‌ కాలేజీ వంటి వృత్తి నిపుణత కల్పించే శిక్షణా సంస్థలు ఏర్పడ్డాయి.
1940లో 1శాతం జనాభా వద్ద దేశసంపదలో 20శాతం పోగుబడి ఉండేది. కాస్తా 1980నాటికి 6 శాతానికి ఆ పోగుబడటం తగ్గింది. దిగువన ఉన్న 50 శాతం జనాభా అభివృద్ధిలో 28శాతం పొందగలిగారు.

ప్రపంచీకరణతో పెనుమార్పులు
దేశంలో బ్యాంకింగ్‌ రంగం యొక్క చిత్రం 1991 నుండి పెనుమార్పులకు లోనయింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకుల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం ప్రారంభించాయి. ఎవరికైనా రు. ఒకకోటికి మించి రుణం ఇవ్వాలంటే రిజర్వుబ్యాంకు నుండి ముందస్తు అనుమతి ఉండాలన్న నిబంధనను తొలగించారు.వ్యవసాయం, సంబంధితరంగాలకు, బలహీనవర్గాలకు రుణాలు ఇవ్వడం ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలన్న విధానాన్ని ఆచరణలో అమలుచేయకుండా నీరు గార్చారు.

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల నియామకాలు దాదాపు దశాబ్ద కాలంపాటు నిలిపివేయడమేగాక, 1,34,000 మందిని స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో సాగనంపారు.
గుత్తపెట్టుబడుల నిరోధ చట్టం (ఎంఆర్‌టి.పి యాక్టు) ను రద్దుచేశారు. గతనాలుగేళ్లలో రు.4లక్షలకోట్లకుపైగాకార్పొరేట్‌ రుణాలను రద్దుచేశారు.
‘హెయిర్‌ కట్‌’ పేరుతో భారీ బకాయిలు పడిన సంస్థలను అతితక్కువ మొత్తం చెల్లించి బడా గుత్తసంస్థలు చేజిక్కించుకోగలుగుతున్నాయి. ఉదాహరణకు : అలోక్‌ ఇండిస్టీస్‌ అనే సంస్థ విలువ రు.29,500కోట్లు ఉంటుంది. బ్యాంకులకు బకాయి పడింది. చెల్లించలేక చేతులు ఎత్తేసింది. బకాయిలో 83శాతం ‘హెయిర్‌కట్‌’ పేర కుదించి తక్కిన 17శాతం చెల్లించిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ సదరు అలోక్‌ ఇండిస్టీస్‌ను స్వాధీనంచేసుకుంది! ”ప్రభుత్వరంగం చావడానికే పుట్టింది. దాని మానాన అది చావనైనా చావాలి. లేదా దానిని మనం ప్రైవేటీకరించాలి” అని స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు. రిజర్వుబ్యాంకు గవర్నరు, నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు, ప్రధాన ఆర్థిక సలహాదారు వీరంతా ప్రయివేటీకరణను సమర్థిస్తూన్నవారే. అరవింద్‌ ఏనగరియా (మాజీ ఆర్థిక సలహాదారు) ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామన్న హామీని ప్రతిరాజకీయపార్టీ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని ప్రకటించారు.
నయాఉదారవాద విధానాలు మొదలవక ముందు 1991లో బ్యాంకులిచ్చిన మొత్తం రుణాలలో 35.9శాతం రు.రెండులక్షలు, అంతకన్నా తక్కువ మొత్తాలలో రుణాలు తీసుకున్నవారికి దక్కాయి. మొత్తం రుణగ్రహీతలలో వీరు 99.3శాతంగా ఉన్నారు. అప్పుడు రు.10కోట్లు, అంతకన్న ఎక్కువ అప్పుతీసుకున్నవారు 577మంది మాత్రమే. వీరు తీసుకున్న అప్పు మొత్తం బ్యాంకులిచ్చిన రుణాలలో 10.8శాతం మాత్రమే ఉండేది. అదే 2018 వచ్చేసరికి రు. రెండులక్షలలోపు అప్పులు దక్కినది 7శాతం మాత్రమే. 1991లో 39.5 శాతం ఉన్నది 7శాతానికి పడిపోయింది. అదే రు.100కోట్లుపైబడి అప్పు పొందిన వారి సంఖ్య 13,142. వీరికి మొత్తం బ్యాంకురుణాలలో ముట్టినది 34.2శాతానికి పెరిగింది (10.8 శాతం 1991లో) వీరికి దక్కిన రుణం రు.26,14,141 లక్షల కోట్లు!
వీటి పర్యవసానంగా 2000 సంవత్సరం నాటికి దేశసంపదలో 20 శాతం కేవలం జనాభాలో ఒకశాతంగా ఉన్న వారిదగ్గర పోగుచేయబడింది. 91శాతం ప్రజలవద్ద సగటు తలసరి సంపద రు.73,000 కాగా 0.6శాతం (ప్రజలవద్ద సగటు తలసరి సంపద రు. 73లక్షలుగా ఉంది. శతకోటీశ్వరుల సంఖ్య ఏటికేడూ పెరుగుతూనే ఉంది. సంపద కేంద్రీకరణ వేగం పెరుగుతూనే ఉంది.
బ్యాంకుల దగ్గర అందరికంటే ఎక్కువ రుణం తీసుకున్నవారిలో మొదట ఉన్నది ముకేష్‌ అంబానీ. (రు.2లక్షల 26వేల కోట్లు) అనిల్‌ అంబానీ రు.లక్షకోట్లు రుణం పొందాడు. ఇతగాడు ఇప్పటికే రుణ ఎగవేతదారుగా ఉన్నాడు. కాని అతని సంస్థ రిలయన్స్‌ పేమెంట్‌ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో జాయింట్‌ భాగస్వామ్యంలో (రిలయన్స్‌ వాటా 30శాతం) ఒక ఫైనాన్సు సంస్థ ఏర్పాటుకు భారత ప్రభుత్వం అనుమతించింది. బడా కార్పొరేట్‌ సంస్థలు అప్పులు ఎగ్గొడితే మాఫీ చేయడమే గాక కొత్త అప్పులు కూడా ఇచ్చే వాతావరణం వచ్చింది. కారుచవకగా ప్రభుత్వరంగ బ్యాంకుల్ని చేజిక్కించుకోవడానికి చాలామంది బడా కార్పొరేట్లు తహతహ లాడుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26561
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author