చదువుల లెక్క తేల్చని సర్వే 

October 11 17:49 2017
బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చదువు నేర్చాలన్న లక్ష్యం నీరుగారుతోంది. బడి బయట బాల్యం ఎలా బలైపోతున్నదీ లెక్కలతో సహా పల్స్ సర్వే స్పష్టం చేస్తే… ఆ జాబితాలపై మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లిన సర్వశిక్షాభియాన్‌ బృందాలు వాటికి కొత్త భాష్యం చెప్పాయి. మొత్తంగా చూస్తే ప్రజాసాధికార సర్వే గణాంకాలతో ఎస్‌.ఎస్‌.ఎ. లెక్కలు ఏమాత్రం సరిపోలడం లేదు.
ప్రభుత్వం గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం ఆరు నుంచి పద్నాలుగేళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలు జిల్లాలో బడి బయట77,952 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇంత పెద్దమొత్తంలో పిల్లలుండటంతో ఆందోళన చెందిన ప్రభుత్వం ఆ జాబితాల్లో పేర్కొన్న వారి వివరాలపై మళ్లీ సమగ్ర సర్వే చేయించాలని నిర్ణయించింది. ఎస్‌.ఎస్‌.ఎ. సిబ్బందితో క్షేత్రస్థాయిలో సర్వే చేయగా… అందులో 56,848 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్నట్లు గుర్తించి యాప్‌లో నమోదు చేశారు. మిగిలిన 21,104 మందికి సంబంధించి అధికారికంగా గుర్తించిన వివరాల ప్రకారం.. వలసలు వెళ్లిన వారు 8,111 మంది, ఆరేళ్లలోపు ఉన్న వారు 266 మంది, 14 కంటే ఎక్కువ వయసు కలిగిన వారు 5,289 మంది, పక్క రాష్ట్రాలకు వెళ్లిన వారు 1,411 మంది, వివాహాలైన వారు 547 మంది,మృతి చెందినవారు 442 మంది ఉన్నట్లు చూపారు. ఇప్పటి వరకూ 797 మంది మాత్రమే బడి మానేసిన పిల్లలుగా గుర్తించారు. ఈ లెక్కల ప్రకారం ఇంకా అయిదు వేల మంది ఏమయ్యారో తెలియదు. సర్వేలో గుర్తించినట్లుగా 77 వేల మంది లేకపోయినా ఎస్‌.ఎస్‌.ఎ. అధికారులు గుర్తించినవారికంటే క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ మంది బడిబయట ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
ప్రజాసాధికార సర్వేలో కూడా చాలామంది వలస కార్మికుల కుటుంబాల్లోని పిల్లలను గుర్తించలేదు. వీరివైపు తాజాగా ఎస్‌.ఎస్‌.ఎ. అధికారులు చేసిన సర్వే బృందాలు కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే కేవలం ప్రజాసాధికార సర్వేలో నమోదైన పిల్లల జాబితాల ప్రకారమే వారినే గుర్తించేందుకు వివరాలు సేకరించారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరంతోపాటు పలు ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం తల్లిదండ్రులు చాలామంది వలసలు వచ్చారు. వారి పిల్లల్లో కొద్ది మంది మాత్రమే బడుల్లో చేరారు. మిగిలినవారు ముఖ్యంగా ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. సర్వేలో నమోదైన వారు, నమోదుకాని వారిని లెక్కిస్తే కనీసం జిల్లాలో కనీసం 30 వేలకు పైగా బడి ఈడు పిల్లలు విద్యాలయాల్లో కాకుండా పనుల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఆలమూరు మండలాన్ని పరిశీలిస్తే ప్రజా సాధికార సర్వేలో 1,069మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తిస్తే దీనిపై ఎస్‌.ఎస్‌.ఎ. సర్వేలో వీరిలోని 910 మంది విద్యాసంస్థల్లో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 159 మందిలో వలసలు వెళ్లినవారు 121 మంది, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇద్దరు, అధిక వయసు కలిగినవారు 33,వివాహమైనవారు 1, చనిపోయినవారు ఇద్దరున్నట్లు తేల్చారు. దీనిప్రకారం బడిఈడు పిల్లల్లో ఒక్కరు కూడా బడిబయట లేనట్లుగా గుర్తించినట్లయ్యింది. వాస్తవానికి ఈ మండలంలోనే వందల సంఖ్యలో బడి ఈడు పిల్లలు(6-14 మధ్య వయసువారు) పలు చోట పనులు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఒక్కరు కూడా బాలకార్మికులు లేనట్లుగా సర్వేలో పేర్కొనటం విడ్డూరంగా ఉంది. చాలా మండలాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2896
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author