వచ్చే జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు : మంత్రి

వచ్చే జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు : మంత్రి
October 11 18:19 2017
 వచ్చే జూన్ 8 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాజెక్ట్ డైరెక్టర్లను, ఇంజనీర్లను, ఇతర అధికారులను ఆదేశించారు. సమావేశమందిరంలో బుధవారం ప్రాజెక్ట్ డైరెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటగా అక్టోబర్ 2 గాంధీ జయంతి, ప్రపంచ ఆవాసదినోత్సవం సందర్భంగా లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గృహప్రవేశాలను చేయించిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వచ్చే జనవరి 10వ తేదీ నాటికి రాష్ట్రంలో 13 జిల్లాల్లో లక్షా 25 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ధేశించారు. 2019 నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్నారు.  లక్ష్యాలను పూర్తి చేసి చరిత్ర సృష్టిద్దామని అన్నారు. నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను పూర్తి చేసే బాధ్యత డీఈలదేనని చెప్పారు. రోజుకు వెయ్యి ఇళ్ల చొప్పున నెలకు 30వేలు, అదనంగా మరో 5 వేలు కలుపుకొని 35 వేల ఇళ్లు నిర్మించాలన్నారు. రోజువారీ పనులు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని మంత్రి సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు, సామాజిక సమస్యలు, ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన వాతావరణం, నెట్, సర్వర్ వంటి సాంకేతి సమస్యలు.. తదితర అంశాలను చర్చించారు. పలు సమస్యలకు మంత్రి కాలవ శ్రీనివాసులు, కార్పోరేషన్ ఎండి కాంతిలాల్ దండేలు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చెప్పారు. పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టినందున కావలసిన ఏఈలను, వర్క్ ఇనస్టెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. 2016-17లో మంజూరు ఇళ్లు వంద శాతం గ్రౌండ్ అవ్వాలని మంత్రి ఆదేశించారు.
ప్రతి పేదకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ల సమీక్షా సమావేశం అనంతరం సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో  బుధవారం మధ్యాహ్నం మంత్రి మీడియాతో మాట్లాడారు. పేదల సొంత ఇంటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాధాన్యతల్లో గృహ నిర్మాణం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో డ్వాక్రా సంఘాల మహిళలు కృషిచేస్తున్నారన్నారు.  సమీక్షా సమావేశంలో ఇళ్ల నిర్మాణం పురోగతిపై సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.  గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, ఇక ముందు ఇంకా వేగంగా జరగాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో ప్రతి పేదకు సొంత ఇల్లు అన్న ఆలోచన చేసిన మొదటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీరామారావు అని, అందువల్ల ఆయన పేరుపైనే గృహ నిర్మాణ పథకం చేపట్టినట్లు తెలిపారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఏటా రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇప్పటికి ఆరు లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 11,520 జనావాస ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అక్టోబర్ 2న  గృహప్రవేశాలు చేయించడంతో ఊరువాడ పండుగ వాతావరణం నెలకొందన్నారు.  వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన ఇళ్ల వద్ద 1,02,616 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జియోట్యాగింగ్ తో సహా లబ్దిదారుల పేర్లు, ఇళ్ల ఫొటోలను వెబ్ సైట్లో అప్ లోడ్ చేసినట్లు చెప్పారు. గృహప్రవేశ కార్యక్రమాలకు సంబంధించిన 28,158 ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ పథకం కింద నిర్మించే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.95వేలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.55 వేలు మొత్తం లక్షా 50వేల రూపాయలు ఇస్తున్నట్లు వివరించారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం(నరేగా) కింద 90 రోజుల పని దినాలను 5 నెలల నుంచి గృహ నిర్మాణ శాఖ లెక్కించిందని, మళ్లీ పంచాయతీరాజ్ శాఖకే అప్పగిస్తున్నట్లు తెలిపారు. తమ శాఖకు ప్రతి మండలంలోనూ సిబ్బంది ఉండరని, అందువల్ల ఆ బాధ్యతను వారికి అప్పగించామన్నారు.  సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే, సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు డైరెక్టర్ మల్లాది కృష్ణానంద్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2922
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author