పర్యవేక్షణ కరువైన “ఉపాధి హామీ”

పర్యవేక్షణ కరువైన “ఉపాధి హామీ”
October 12 12:15 2017
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పూర్తిస్థాయి వేతనాన్ని ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులు పొందలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీనివల్ల ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 1600 కోట్ల రూపాయల మేర వేతనం, మెటీరియల్ కాంపొనెంట్ కింద నష్టపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామాల్లో వలసలను నివారించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు చేయడం తెలిసిందే. రాష్ట్రంలో ఈ పథకం కింద 13 శాఖలను సమన్వయం చేస్తూ 6వేల కోట్ల రూపాయలకు పైబడి పనులు చేస్తున్నారు. వివిధ పనులు చేసే వేతనదారులకు కూలి, ఆ పనికి సంబంధించి మెటీరియల్ కాంపొనెంట్ కింద కొంత మొత్తాన్ని కేంద్రం చెల్లిస్తుంది. అయితే కేంద్రం సిఫారసు చేసిన కూలి రాష్ట్రంలోని వేతనదారులు పొందలేక పోవడంతో భారీ మొత్తాన్ని రాష్ట్రంలోని వేతనదారులు నష్టపోతున్నారు. వేతనదారులకు మరింత అదనంగా కూలి లభించే వీలులేకుండా పోతోంది.
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చెరువులు, కుంటల తవ్వకం, సిసిరోడ్లు, ఇళ్ల నిర్మాణం, మొక్కల పెంపకం, తదితర పనులు చేపడుతున్నారు. ఒక్కో గ్రూపులో 20 మంది వరకూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న పనులను ఈ గ్రూపులకు కేటాయిస్తుంటారు. చేసిన పనిని ఫీల్ట్ అసిస్టెంట్లు లెక్కించి, కూలి మదింపు చేస్తారు. కేంద్రం ఉపాధి పథకం కింద వేతనదారులకు 197 రూపాయలు చెల్లించేందుకు ప్రతిపాదించింది. కానీ రాష్ట్రంలో వేతనదారులకు 135 నుంచి 165 రూపాయలు మాత్రమే లభిస్తోంది. అధిక శాతం గ్రామాల్లో వేతనదారులకు 140 రూపాయలకు మించి కూలి లభించడం లేదని అధికారిక లెక్కలే తెలుపుతున్నాయి. దీంతో కేంద్రం 197 రూపాయలు కూలి ప్రకటించినప్పటికీ రాష్ట్రంలోని వేతనదారులకు కేవలం 140 రూపాయలు సగటున దక్కుతోంది. దీంతో కేంద్రం ప్రకటించిన వేతనాన్ని పొందలేకపోవడం వల్ల 960 కోట్ల రూపాయలు, మెటీరియల్ కాంపొనెంట్ కింద 640 కోట్ల రూపాయల మేర రాష్ట్రం కోల్పోయింది. కేంద్రం ప్రకటించిన వేతనాన్ని రాష్ట్రంలోని వేతనదారులు పొందలేకపోవటం వెనుక వివిధ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చాలా సందర్భాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు సరిగా చేసిన పనిని నమోదు చేయకపోవడం, ఒక గ్రూపునకు పని కేటాయించినప్పటికీ ఆ గ్రూపులో వేతనదారులు అందరూ వచ్చి, పూర్తిస్థాయిలో పనులు చేయకపోవడం వల్ల కేంద్రం ప్రకటించిన వేతనాన్ని పూర్తిస్థాయిలో పొందలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు కూడా గ్రూపుల్లో ఉండటంతో దాని ప్రభావం వేతనంపై పడుతోంది. కొన్ని గ్రూపుల్లో కొందరు మాత్రమే పనిచేయడం కూడా కారణంగా చెబుతున్నారు. గ్రూపులో ఉన్న సభ్యుల ఆరోగ్యం, ఇతర పరిస్థితుల ఆధారంగా పనులు కేటాయిస్తే మరింత మెరుగైన వేతనం లభించే వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తవౌతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని గమనించి, పూర్తిస్థాయిలో వేతనం లభించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించింది. ఇది నేరుగా నష్టం కాకపోయినప్పటికీ, కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఆమేరకు ఆదనంగా నిధులు లభించేవని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2978
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author