ఓయూలో సోలార్ ప్రాజెక్టు

ఓయూలో సోలార్ ప్రాజెక్టు
October 12 13:20 2017
శతాబ్ది వేడుకలతో ఓయూకు మహర్దశ పట్టనుంది. ఎన్నో ఏళ్లుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వేడుకలు నాంది పలుకనున్నాయి.  నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలను పూర్తిగా పునరుద్ధరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. యూనివర్సిటీకి ఒకవైపు లక్షల్లో విద్యుత్ బిల్లు మోత మోగుతుంటే మరోవైపు వ్యర్థాల నిర్వహణకు సరైన యంత్రాగమే లేదు. ఈ సమస్యలకు శతాబ్ధి ఉత్సవాలు చెక్ పెట్టనున్నాయి. యూనివర్సిటీలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వర్సిటీకి ఉన్న విశాలమైన స్థలంలో నాలుగు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించి, విద్యుత్ భారానికి వీడ్కోలు పలుకనున్నారు. వ్యర్థాల నిర్వహణకు సేవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్  నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
వర్సిటీ ప్రారంభించి వందేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా దానికి గుర్తుగా ఒక పైలాన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిపాలనా భవనం వర్సిటీ అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. స్థలాభావం వల్ల కొన్ని కార్యాలయాలు వేరే భవనాల్లో ఏర్పాటు చేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం వర్సిటీకి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు నూతనంగా ఒక సెంటనరీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ను నిర్మించనున్నారు. దీంతో పరిపాలనాపరమైన సమస్యలకు తెరపడనుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన వాటిలోనే నేటికీ కొన్ని హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ మధ్య కాలంలో నాలుగు హాస్టళ్లు నూతనంగా నిర్మించినప్పటికీ అవి విద్యార్థుల అవసరాలను పదిశాతం కూడా తీర్చడంలేదు. విద్యార్థుల అవస్థలకు చరమగీతం పాడుతూ నూతనంగా ఎనిమిది హాస్టల్ భవనాలను నిర్మించనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు ఎదురుచూస్తున్న నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు తెరలేవనుంది. సికింద్రాబాద్ పీజీ కళాశాల, సైఫాబాద్ పీజీ కళాశాల, ఓయూ సైన్స్ కళాశాల, నిజాం కళాశాల, కోఠి ఉమెన్స్ కాలేజ్, అకాడమిక్ స్టాఫ్ కాలేజ్‌లకు నూతన భవనాలు నిర్మించనున్నారు. వాటితో పాటు ఇప్పటికే ఉన్న దాదాపు అన్ని భవనాలను పూర్తిగా పునరుద్ధరించనున్నారు. యూనివర్సిటీలో వివిధ సమావేశాలు, సదస్సులు నిర్వహించుకునేందుకు వీలుగా నూతన సెంటనరీ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయిలో దీని నిర్మాణం పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఠాగూర్ ఆడిటోరియాన్ని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని నిర్ణయించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3019
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author