రామాంతాపూర్ మునిగిపోయింది

రామాంతాపూర్ మునిగిపోయింది
October 12 13:51 2017
ప్రజా స‌మ‌స్యల‌పై క‌ల‌సి పని చేయాల్సిన ఆ ఇద్దరు స్థానిక ప్రజా ప్రతినిధులు జిహెచ్ఎంసి నాలాను క‌బ్జా చేయ‌డంలో మాత్రం త‌మ వంతు చేయి వేశారు. పార్టీలు వేరైనా ఆక్రమ‌ణ‌లో మాత్రం బాయిబాయి అంటూ భుజాలు క‌లుపుకుని ముందుకు వెళ్ళారు. ఫలితంగా రామంతాపూర్ చెరువు ప‌రివాహ‌క ప్రాంతాల‌న్నీ నీట‌మున‌గడానికి ఈ ఇద్దరూ కార‌ణ‌మ‌య్యారు. నాలా స్థానంలో ఐదంత‌స్తుల ఇంద్రభ‌వ‌న‌మే వెల‌సింది…అడ్డుకోవాల్సిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్, ఇరిగేష‌న్ అధికారులు మాత్రం చోధ్యం చూస్తూ తిలా పాపం త‌లా పిడికెడు అంటూ ఇష్ గప్ చుప్ అంటున్నారు.చెరువులో లే అవుట్లు…. చెరువు నాలాలు తూముల‌పైన ఇంద్రభ‌వ‌నాల‌ను త‌ల‌పించే మ‌ల్టీస్టోరీడ్ బిల్డింగ్స్… ఇవీ రామంతాపూర్ చెరువు ప‌క్కన ఉన్న కాల‌నీలు నీట‌మున‌గ‌డానికి ప్రధాన కార‌ణాలు. రామంతాపూర్ లోని పెద్ద చెరువు నిండితే ఆ నీరు పోవ‌డానికి ఏర్పాటు చేసిన తూములు, నాలాలపై ఇష్టానుసారంగా 60 అడుగుల మేర జిహెచ్ఎంసి స్థలాన్ని క‌బ్జా చేసేశారు. ఈ క‌బ్జా ఇప్పుడు వంద‌లాది కుటుంబాలు ఇళ్ళల్లో కాకుండా రోడ్లపై నివ‌సిస్తూ ప‌డ‌వ‌ల‌పై ప్రయాణం చేయ‌డానికి కార‌ణ‌మైంది. నాలాను, తూముల‌ను క‌బ్జా చేయ‌డానికి ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, అధికార పార్టీకి చెందిన ఓ కార్పోరేట‌ర్ భ‌ర్త చెట్టాప‌ట్టాలేసుకుని ఆ భ‌వనాన్ని ఓ బిల్డర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మించుకునేందుకు స‌హాయం చేశారు. ఇదే కాదు ఈ చెరువు పక్కన ఉన్న శిఖం భూములలో ద‌ర్జాగా వెంచ‌ర్ వేసి అమ్ముకున్నారు ఆ ఇద్దరు నాయ‌కులు. అసెంబ్లీలోనూ, బ‌య‌ట ఒక‌రిపై మ‌రోక‌రు దుమ్మెత్తి పోసుకునే ఈ అధికార, ప్రతిప‌క్ష నేత‌లు ప్ర‌త్యేకంగా  ఈ ఇంద్ర భ‌వ‌నం విష‌యంలో మాత్రం నీకింత నాకింత అన్న రీతిలో పంచేసుకుని బిల్డింగ్ ను పూర్తి చేశారు. అక్టొబర్ రెండు నుంచి సాయిచిత్ర కాల‌నీలు, మ‌హేశ్వీరీ న‌గ‌ర్, ర‌వీంద్ర‌న‌గ‌ర్ లు  నీట మునగ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషించిన జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్, మేయ‌ర్ ల‌కు దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.. రామంతాపూర్ పెద్ద చెరువు నీళ్లు బ‌య‌ట‌కు పోకుండా వెన‌క‌న లోత‌ట్టు ప్రాంతాల‌ను ముంచేయ‌డానికి కార‌ణం జిహెచ్ఎంసి నాలాలు, తూముల‌పై ఇంద్ర‌భ‌వ‌నం నిర్మాణ‌మే కార‌ణ‌మ‌ని తేల్చారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అక్క‌డిక‌క్క‌డే జెసిబిలు ర‌ప్పించి క‌బ్జా చేసిన 60 అడుగుల స్థ‌లంలో ఉన్న అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించి నాలా మార్గానికి రూపు క‌ల్పించారు. అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు జ‌రిగినంత సేపూ ఈ భ‌వ‌న నిర్మాణానికి స‌హ‌క‌రించిన ఎమ్మెల్యే, కార్పోరేట‌ర్ భ‌ర్త అస‌హ‌నంతో రగిలిపోయారు. అక్ర‌మంగా నిర్మించారు క‌నుక భ‌వ‌నానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్ ఓ సి ఇవ్వ‌కూడ‌ద‌ని, అనుమ‌తి కోసం ధ‌ర‌ఖాస్తున్న స‌స్పెండ్ చేయాల‌ని సిసిపి దేవేందర్ రెడ్డికి  మేయ‌ర్ బొంతు రామ్మెహ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలాఉండ‌గా స్వయంగా మేయ‌రే పూర్తి స్థాయిలో ప‌రిశీల‌న చేసి రామంతాపూర్ చెరువు నాలాపై నిర్మించిన ఇంద్రభ‌వ‌నం అక్రమంగా నిర్మించార‌ని ఆధారాల‌తో స‌హ చెప్పినా,  క‌మిష‌న‌ర్ జ‌నార్ధ‌న‌రెడ్డి మాత్రం అస‌లు అది క‌బ్జాయే కాదంటూ క్లీన్ చిట్ ఇవ్వడం చ‌ర్చనీయాంశంగా మారింది. మ‌రొక‌వైపు అక్రమంగా నిర్మించిన భ‌వ‌నానికి కాంపౌండ్ వాల్ కూడా జిహెచ్ఎంసి భూముల్లోనే నిర్మించారని స్థానికులు ధ‌ర్నాలు చేశారు. అయితే తెర‌వెనుక ఆ ఇద్ద‌రు  ప్రజాప్ర‌తినిధులు ఉండ‌టంతో ధ‌ర్నాకు వ‌చ్చిన వారి ఆందోళ‌న కంఠ‌శోష‌గానే మిగిలిపోయింది. రామంతాపూర్ ర‌గ‌డ ఆధారాల‌తో స‌హ బ‌య‌ట‌కు వచ్చి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే ఇంద్ర‌భ‌వ‌నం జోలికి వెళ్ల్ళ‌వ‌ద్దంటూ ఇరిగేష‌న్, టౌన్ ప్లానింగ్ యంత్రాంగానికి క‌మిష‌న‌ర్ ఆదేశాలు వెళ్లాయి. క‌బ్జాకుగురైన ప్రాంతాల‌లో జిహెచ్ఎంసి స్థ‌లం అంటూ బోర్డు పెట్టాల‌న్న మేయ‌ర్ ఆదేశాలు నాలా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ విష‌యంలో అధికారుల చిత్తశుద్ధి ఎలా ఉందంటే అక్రమ నిర్మాణం దందాలో కూరుకు పోయిన నాలాల‌ను, తూముల‌ను బాగు చేసి నీళ్ళను బ‌య‌ట‌కు పంపాల్సిన అధికారులు ఏళేశ్వ‌రం ప్రాజెక్టు నుంచి 150 హెచ్ పి పైపుల‌ను తీసుకువ‌చ్చి రోజుల త‌ర‌బ‌డి మోటార్లతో నీటిని పంపింగ్ చేయ‌డానికి గ‌ల కార‌ణాలెంటో ఇప్పటికి అంతు చిక్కడం లేదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3041
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author