కంపెనీల్లేవ్… కాసులు మాత్రం కోట్లలో!

కంపెనీల్లేవ్… కాసులు మాత్రం కోట్లలో!
October 12 15:46 2017
డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. అక్రమ, నల్ల ధనం సమాచారం చూసి అధికార వర్గాలు అవాక్కవుతున్నాయి. పెద్దనోట్ల రద్దయ్యే వరకూ ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నడవని ఖాతాల్లో ఆ తరువాత పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి వేలాది కోట్లు జమచేసి, ఆ తరువాత వెంటనే ఆ డబ్బును విత్‌డ్రా చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించి 13 బ్యాంకులు కేంద్ర ఆర్థిక శాఖకు అందజేసిన మొదటి విడత సమాచారం వేల కోట్ల నల్ల ధనం వివరాలను వెల్లడిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల డొల్ల కంపెనీల ఖాతాలను స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు లక్షల డొల్ల కంపెనీల్లో 5, 800 డొల్ల కంపెనీలకు సంబంధించి 13, 140 ఖాతాల వివరాలను 13 బ్యాంకులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అందజేశాయి. మొత్తం స్తంభింపజేసిన 2 లక్షల డొల్ల కంపెనీల ఖాతాలతో పోలిస్తే సమాచారం అందిన ఖాతాల శాతం కేవలం 2.5 శాతం మాత్రమే. సమాచారం అందిన 5,800 డొల్ల కంపెనీల ఖాతాలను పరిశీలిస్తే వేల కోట్ల నల్లధనం సమాచారం వెలుగులోకి వస్తోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఓ కంపెనీ 2,132 ఖాతాలలోకి వేల కోట్ల నల్ల ధనాన్ని డిపాజిట్ చేసి ఆ తరువాత వెంటనే డబ్బును విత్‌డ్రా చేసుకున్నట్టు తేలింది. చాలా డొల్ల కంపెనీలకు సగటున వంద ఖాతాల వరకూ కలిగి ఉన్నట్టు తెలిసింది. ఒక డొల్ల కంపెనీ 900 ఖాతాలను నిర్వహిస్తే మరో కంపెనీ 1300 ఖాతాలను కలిగి ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబర్ 8 తేదీ సాయంత్రం ఎనిమిది గంటలకు పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు ఈ ఖాతాల్లో 22 కోట్ల రూపాయల డిపాజిట్ అయి ఉండగా మరుసటి రోజు నుంచి వాటిని స్థంభింపజేసేంత వరకు ఖాతాల్లోకి వచ్చి పడిన డబ్బు 4, 573.878 కోట్ల రూపాయలు. డిపాజిట్ చేసిన తరువాత కొన్ని రోజులకే ఈ ఖాతాల నుంచి 4, 552 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసుకున్నారు. ప్రతికూల నగదు ఉన్న ఖాతాలలోకి కూడా వందలు, వేల కోట్లను డిపాజిట్ చేసి ఆ తరువాత కొన్ని రోజులకు కొత్త నోట్ల రూపంలో తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పాత నోట్లను డిపాజిట్ చేసి ఆ తరువాత కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకున్న తరువాత ఆ ఖాతాల్లో గతంలో మాదిరిగానే అతి తక్కువ మొత్తాలను ఉంచినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకునేందుకు ఈ డొల్ల కంపెనీల ఖాతాలను ఉపయోగించుకున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని డొల్ల కంపెనీలు తమ గుర్తింపును రద్దు చేసిన తరువాత కూడా ఖాతాల్లోకి డబ్బు డిపాజిట్ చేసి, ఆ తరువాత విత్‌డ్రా కార్యక్రమాన్ని కొనసాగించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఒక బ్యాంకుకు చెందిన 13 వేల షెల్ కంపెనీల ఖాతాల్లో నవంబర్ 8న 13 కోట్ల రూపాయల డిపాజిట్ అయి ఉండగా, పెద్దనోట్ల రద్దు అనంతరం ఈ ఖాతాల్లో రూ.3,800 కోట్లు వచ్చి చేరాయి. ఆ తరువాత ఇంతే మొత్తాన్ని కొత్త నోట్ల రూపంలో విత్‌డ్రా చేసుకున్నారు. డొల్ల కంపెనీల అవినీతి, అక్రమాలకు ఇదో చిన్న ఉదాహరణగానే చెప్పవచ్చు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3070
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author