రావయ్యా..రాహుల్

రావయ్యా..రాహుల్
October 14 15:14 2017
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటాడని శుక్రవారం సంకేతాలు ఇచ్చారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. త్వరలోనే ఆ పని కూడా పూర్తవుతుందని అన్నారామె. కానీ ఇదే అంశంపై రాహుల్ గాంధీని స్పందించాల్సిందిగా కోరినప్పటికీ ఆయన అందుకు నిరాకరించారు.కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు చాలా రోజులుగా పార్టీలో అంతర్గతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, నాగాలాండ్, మేఘాలాయ, త్రిపురవంటి రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాలకు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పోటీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ తంతు సాగింది. కొత్త పిసిసి కార్యవర్గాలు చాలా వరకూ రాహుల్ వెంటనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మానాలు వెలువరించాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో కూడా శుక్రవారం రాహుల్ కాంగ్రెస్ నాయకత్వ తీర్మానం వెలువడింది.  రాహుల్‌ను ఆహ్వానిస్తూ ఢిల్లీ పిసిసి తొలుత తీర్మానం వెలువరించింది. పార్టీలో సంస్థాగత ఎన్నికల వ్యవహారాలను పార్టీ కేంద్ర ఎన్నికల సాధికారిక సంస్థ (సిఇఎ) పర్యవేక్షిస్తోంది. అన్ని రాష్ట్రాల పిసిసిల నుంచీ డెలిగేట్ల పేర్లతో కూడిన జాబితాలు, తీర్మానాలు అందిన తరువాత సిఇఎ అధికారికంగా పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తుంది. త్వరలోనే ఈ సంస్థ సభ్యులు సోనియాను కలిసి సంస్థాగత ఎన్నికల వివిధ దశల సంపూర్తి గురించి వివరించనున్నారు. తరువాత పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కార్యవర్గం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశం అవుతుంది. పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికల తేదీలను, దరఖాస్తు , ఉపసంహరణ తేదీలను ఖరా రు చేస్తుంది. సిడబ్లుసి దీపావళికి ముందుగానే సమావేశం కానుంది. ఇక లాంఛనప్రాయపు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25నాటికి ముగుస్తుంది. 131 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ సారథ్యం వహించాలని గత ఏడాది నవంబర్‌లో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారు. 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలలో వరుసగా 19 సంవత్సరాల నుంచీ కొనసాగుతూ పార్టీలో రికార్డు పుటలలో చేరారు. ఆమెఒక్కసారి జితేంద్ర ప్రసాద నుంచి పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచారు. మిగిలినవన్నీ ఏకగ్రీవ ఎన్నికలుగానే మారాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికల తరువాత సిడబ్లుసి ఎన్నికలు ఉంటాయి. ఎఐసిసి డెలిగేట్స్ 25 మంది వర్కింగ్ కమిటీ సభ్యులలోని 12 మందిని ఎన్నుకుంటారు.ఇటీవలే ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్టీని ముందుండి నడిపించే రోజు ఇంకెంతో దూరంలో లేదని, ఈ దీపావళి తర్వాతే అది జరిగినా జరగొచ్చని అన్నారు. రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సంబంధించిన తేదీలని ఖరారు చేసేందుకు త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3331
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author