కరీంనగర్ ను కుదిపేస్తున్న జ్వరాలు

కరీంనగర్ ను కుదిపేస్తున్న జ్వరాలు
October 16 14:47 2017

కరీంనగర్ జిల్లాలో దోమలు విజృంభిస్తుండడంతో ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారు. ప్రధానంగా డెంగీ జ్వరాలను వ్యాపింపజేసే ఈడిస్‌ ఈజిప్టై దోమలు ప్రబలిపోతుండడం జిల్లా వాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రజలు వాడకానికి నిల్వ చేసుకుంటున్న నీటిలోనే ఈ దోమలు సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ స్త్వైరవిహారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిల్వ ఉంచుకునే కుటుంబాలు అప్రమత్తంగా లేకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యాధికారులు చెప్తున్నారు. అందుకే జిల్లాలో అత్యధిక డెంగీ జ్వరాలు నమోదయ్యాయని అంటున్నారు. ఇక నగరంలోని శ్రీనగర్‌కాలనీ, గోదాంగడ్డ, రాంనగర్‌, హుస్సేనిపుర, శేషామహల్‌, కాశ్మీర్‌గడ్డ, రాంపూర్‌, మంకమ్మతోట, జ్యోతినగర్‌, అంబేడ్కర్‌ నగర్‌, బుట్టిరాజారాంకాలనీ, శ్రీరాంనగర్‌ కాలనీ, మారుతినగర్‌, ముకరంపుర, హన్మాన్‌నగర్‌ ప్రాంతాల్లో జ్వరపీడితులు నమోదయ్యారు. కరీంనగర్‌ తో పాటూ చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, గంగాధర, శంకరపట్నం, మానకొండూర్‌, హుజురాబాద్‌, జమ్మికుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పలువురు జ్వరాల బారినపడ్డారు. చాలా మంది డెంగీ జ్వరంతో పాటు ఇతర జ్వరాలతోనూ ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటివరకు మొత్తం 61 డెంగీ కేసులు నమోదు కాగా 9 మలేరియా కేసులు నయోదయ్యాయి. ఇప్పటివరకు వివిధ రకాల జ్వరాల బారినపడ్డ 5,2712 మంది రక్త నమూనాలు సేకరించగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 61 కేసులు ఉన్నప్పటికీ వీటి సంఖ్య వందకు పైగా ఉంటుందని అంచనా. కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి లెక్కలు నమోదు కావడంలేదు. జిల్లాలో 61 కేసులు ఉండగా వాటిలో 16 మండలాల పరిధిలో 39, కేవలం కరీంనగర్‌లోనే 22 మంది డెంగీ జ్వరపీడితులు ఉన్నారు.  ప్రభుత్వ పరంగా ఆసుపత్రుల్లో ఈ జ్వరాలకు సంబంధించి పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులో లేకపోవడం పేద-మధ్యతరగతి వారికి సమస్యగా మారింది. దీంతో జ్వరంతో బాధపడేవారు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల నుంచి దండుకుంటున్నాయి.రోగులను భయపెట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. కొందరికి జ్వరాలు వచ్చి డెంగీ నిర్ధారణ కాకపోయినా తగ్గిన ప్లేట్‌లెట్స్‌ను చూపించి భయపెడుతూ చికిత్స పేరిట కనీసం వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోచుకుంటున్నాయి. ప్లేట్‌లెట్లు తగ్గడం సాధారణమైనా ప్రజల్లో పూర్తి అవగాహన లేకపోవడంతోనే ఆందోళనతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి బాధితులకు వైద్య సేవలు విస్తృత పరచడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3573
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author