దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలా

దేవుడు కరుణించినా.. పూజారి  కరుణించలా
October 20 17:06 2017

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా రుణం మంజూరుకావడం లేదు. బ్యాంకులు సహకరించడం లేదు.. దీంతో ఉపాధి కల్పన ఎండమావేనా అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది.. లబ్ధిదారుల ఎంపిక జరిగి నెలలు గడుస్తున్నా సంబంధిత బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం  ప్రదర్శిస్తున్నారు.  దీంతో రుణాలు రాక ఇతర పనులు చూసుకోలేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యువతకు స్వయం ఉపాధి, కొత్త ప్రాజెక్ట్‌లు, కుటీర పరిశ్రమలకు అవకాశం కల్పించడంతో పాటు వివిధ వృత్తుల్లో నిపుణులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. నిరుద్యోగ యువతకు రాయితీతో కూడిన రుణాలు అందిస్తారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ద్వారా ఈ పథకం అమలవుతుంది. కేవీఐసీ జాతీయ స్థాయిలో నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాల పరిధిలో కేవీఐసీ, కేవీఐబీ, డీఐసీలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

పీయంఈజీపీ ద్వారా నిరుద్యోగులు వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి యువతకు రాయితీతో కూడిన రుణాలు అందజేస్తారు. దీంతో పాటు అవసరమైన శిక్షణ అందజేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రాయితీ సొమ్మును అందిస్తుండగా, మిగిలిన లోన్ బ్యాంకులు అందజేస్తాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ కన్వీనర్‌గా గల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి నేరుగా బ్యాంకులకు జాబితా పంపిస్తుంది. ఇంతకుముందు ఆరు నెలలకోసారి లబ్ధిదారుల ఎంపిక జరిగేది. ప్రస్తుతం నెలకోసారి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పరిశీలించి ఎంపిక చేస్తోంది.. అభ్యర్థుల ఎంపిక కూడా సక్రమంగా జరుగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కరీంనగర్‌ జిల్లాలో 2017-18 సంవత్సరానికి డీఐసీ ద్వారా 30 యూనిట్లు, కేవీఐసీ ద్వారా 23 యూనిట్లు, కేవీఐబీ ద్వారా 23 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీని అమలు కోసం రూ.151.12 లక్షల రాయితీ నిధులను ప్రభుత్వాలు కేటాయించాయి. వీటి ద్వారా 608 మందికి ఉపాధి లభించనుంది. గత నెల వరకు కేవీఐసీ, కేవీఐబీ, డీఐసీలకు ఆన్‌లైన్‌ ద్వారా 559 దరఖాస్తులు వచ్చాయి. అర్హతలను బట్టి 539 మందిని ఎంపిక చేసి బ్యాంకులకు పంపించగా 20 దరఖాస్తులను తిరస్కరించారు. లక్ష్యానికంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా బ్యాంకులకు పంపిస్తారు. కేంద్రం కూడా అందుకనుగుణంగా రాయితీ నిధులను విడుదల చేస్తుంది. పథకం మంచిదే అయినా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. సకాలంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడం, రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో బ్యాంకులు కాన్సెంట్‌ ఇవ్వకపోవడంతో నోడల్‌ శాఖలు అభ్యర్థులను ఎంపిక చేయడానికి వెనుకాడుతున్నట్లు తెలిసింది.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4120
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author