వామ్మో…. బోరబండ

వామ్మో….  బోరబండ
October 23 15:17 2017

హైద్రాబాద్,  అక్టోబరు 23:

బోరబండ, రహమత్‌నగర్ డివిజన్లలో నివసించే ప్రజలు భూకంప భయంతో వణికి పోతున్నారు. భూ పొరల నుంచి భారీ శబ్ధాలు వస్తూ స్వల్పంగా భూమి కంపిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం సాయంత్రం బోరబండ సైట్ 3, హబీబ్ ఫతిమానగర్, ప్రతిభనగర్, మహాత్మానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే దీపావళి బాంబుల శబ్ధంవల్ల అలా జరిగి ఉంటుందని స్థానికులు భావించారు. కాగా శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో భూమిలోనుంచి భారీ శబ్దాలు రావడం మరింత కొంత తీవ్రతతో కంపించడంతో ఇళ్లలోని వస్తువులు క్రిందపడి పోయాయి. గాడ నిద్రలో ఉన్నవారు ఒక్కసారి ఉలిక్కిపడి మేల్కొని ప్రాణభయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. తెల్లవారినా ఇళ్లలోకి వెళ్లేందుకు ఆయా బస్తీల వాసులు సాహసించలేదు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పోరేటర్ షరీఫ్ ఆయా బస్తీల్లో పర్యటించి భూకంప పుకార్లపై ఆరా తీశారు. కాగా స్థానికులు వెలిబుచ్చిన విషయాల ఆధారంగా భూమిలో నుంచి శబ్దంతోపాటు స్వల్ప ప్రకంపనలు జరిగి ఉంటాయని గుర్తించి వెంటనే సమాచారాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు.

ఖైరతాబాద్ మండల తహసీల్దార్ సైదులు తన సిబ్బందితో బస్తీల్లో పర్యటించి శబ్దాలు, ప్రకంపనలు ఏ స్థాయిలో జరిగాయనే అంశాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా ప్రకంపనలు శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున కూడా కొనసాగడంతో ప్రజల ఆందోళన మరింత తీవ్రతరం అయింది. దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న భయంతో ఆయా బస్తీల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చిన్నపాటి శబ్దం వచ్చినా అదేనన్న భయంతో కుటుంబ సభ్యులతో సహా పరుగులు పెడుతున్నారు. భారీ బండరాయితో నిండి ఉండే ఈ ప్రాంతాల్లో స్వల్ప కదలికలు వచ్చినా భారీ ఆస్థినష్టం, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉటుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రాణ భయంతో ఉరుకులు పరుగులు పెడుతున్న బస్తీల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యటిస్తూ భూకంప తీవ్రతపై ఆరా తీస్తున్నారు.భూమి కంపిస్తుందని ప్రజలు వణికిపోతుంటే అధికారులు మాత్రం దీనిని నిర్ధారించడం లేదు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందోనన్న విషయాన్ని నిర్ధారించని అధికారులు భారీ వర్షాల కారణంగా నీరు చేరి భూ పొరల్లో సర్దుబాటువల్లే ఇలాంటి శబ్దాలు వస్తుండవచ్చునని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరమే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4427
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author