టీడీపీలో రేవంత్ ప్రకంపనలు

టీడీపీలో రేవంత్ ప్రకంపనలు
October 23 17:52 2017

హైద్రాబాద్, అక్టోబరు 23:

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో త‌న‌కు ఎలాంటి సంబంధాలు లేవ‌ని టీడీపీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీకి న‌ష్టం క‌ల్గించే ప‌ని తానెప్పుడు చేయ‌న‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి త‌న‌పైన చేసిన ఆరోప‌ణ‌లు ఎంతో బాధ‌క‌ల్గించాయ‌ని ప‌య్యావుల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో ర‌హాస్య చ‌ర్చలను క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే రేవంత్ తన‌పైన విమ‌ర్శ‌లు చేశార‌ని కేశ‌వ్ ఆరోపించారు. తెలుగుదేశంలో ప‌య్యావుల కేశ‌వ్, రేవంత్ రెడ్డి మ‌ధ్య వివాదం కొన‌సాగుతూనే ఉంది. రేవంత్ త‌న‌పైన చేసిన విమ‌ర్శ‌ల‌కు ఇంత కాలం మౌనంగా ఉన్న కేశ‌వ్ ఎదురుదాడి ప్రారంభించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నందు వ‌ల్ల తాను స్పందించ‌లేక‌పోయానన్న ఆయ‌న రేవంత్ పైన బ‌హిరంగంగా మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌లేదు.

మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ప‌య్యావుల కేశ‌వ్ టీడీఎల్పీ నేత‌పైన విరుచుకుప‌డ్డారు.  రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు త‌న‌నెంతో బాధించాయ‌న్న ఆయ‌న పార్టీ ప‌రంగా కాకుండా వ్య‌క్తిగ‌తంగా స్పందిస్తున్న‌ట్లు వివ‌రించారు.పెళ్లికి వ‌చ్చిన తెలంగాణ  ముఖ్య‌మంత్రిని సంస్కారంతో గౌర‌విస్తే ఆయ‌న‌తో లింకులు పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడ‌టం దుర్మార్గ‌మ‌ని కేశ‌వ్ అన్నారు. త‌న‌కు తెలంగాణ‌లో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవ‌న్న ఆయ‌న ప‌య్యావుల హైద‌రాబాద్ క‌నీసం సొంత ఇళ్లు కూడా లేద‌ని తేల్చి చెప్పారు.ప‌రిటాల సునీత కుటుంబం తో క‌లిసి వ్యాపారం చేస్తున్నార‌న్న రేవంత్ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. త‌న మేన‌ల్లుడికి హైద‌రాబాద్ లో  మైక్రో బేవ‌రీస్ తో కూడిన ప‌బ్ మాత్ర‌మే ఉంద‌ని, బీర్ల కంపెనీ కాద‌ని కేశ‌వ్ వివ‌రించారు. ఉద్దేశ పూర్వ‌కంగా రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. త‌న మీద విమ‌ర్శ‌లు చేస్తున్న రేవంత్ రెడ్డి ముందు త‌న వ్యాపారాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని కేశ‌వ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కూతురు, ఎం.పి క‌విత‌తో క‌లిసి రేవంత్ రెడ్డి ఒక కంపెనీని రిజిస్ట‌ర్ చేసిన మాట వాస్త‌వం కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త్వ‌ర‌లోనే ఈ వివ‌రాల‌న్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని కేశ‌వ్ హెచ్చ‌రించారు.

రేవంత్ రెడ్డి తాను మంచి మిత్రుల‌మ‌న్న ప‌య్యావుల కేశ‌వ్ ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు చాలా బాధ‌క‌ల్గించాయ‌ని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి జైలులో ఉన్న‌ప్పుడు ఆయ‌న కు తాను అండ‌గా నిలిచాన‌న్నారు.  రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల కారణంగా తనపైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని,అందుకే వివ‌ర‌ణ ఇస్తున్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.రాజ‌కీయాల కోసం మిత్రుల‌ను కూడా బ‌లి చేస్తార‌న్న విష‌యం రేవంత్ వైఖ‌రీ ద్వారా బ‌య‌ట‌ప‌డింద‌ని కేశ‌వ్ అన్నారు.  తెలంగాణ‌లో జ‌గ‌న్ తో క‌లిసి రేవంత్ రెడ్డి రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. సింగ‌రేణి ఎన్నిక‌ల్లో వైసీపీ కండువాలు క‌ప్పుకొని ఆయ‌న ఎలా ప్ర‌చారం చేశార‌ని కేశ‌వ్ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ మీడియాలో రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం వెనుక ఉద్దేశం ఏమిట‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీతో రాజ‌కీయ జీవితం ప్రారంభించిన రేవంత్ ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు టీడీపీలో ఉండి మ‌రో పార్టీకి వెళ్ళ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారని కేశవ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి న‌ష్టం క‌ల్గించే ప‌ని తానెప్పుడు చేయ‌న‌ని ప‌య్యావుల అన్నారు. తెలంగాణ రాజ‌కీయాల‌తో త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఒత్తిడిలోనే రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న ఆయ‌న త్వ‌ర‌లోనే అన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌న‌తో రేవంత్ రెడ్డి అంశాన్ని ప్ర‌స్తావించ‌లేద‌ని ప‌య్యావుల స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా సామాజిక స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4477
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author