రేషన్ తీసుకోకపోయినా కార్డు రద్దుకాదు

రేషన్ తీసుకోకపోయినా కార్డు రద్దుకాదు
October 23 19:00 2017

అమరావతి అక్టోబర్ 23 :

రేషన్ షాపుల్లో ఎన్ని నెలలు రేషన్ తీసుకోకపోయినా రేషన్ కార్డు రద్దుకాదని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ప్రతి నెలా రేషన్ తీసుకోకుండా ఆ కార్డును ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని, అటువంటివారి కార్డు రద్దు చేయవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రేషన్ వద్దనుకునేవారు తీసుకోవలసిన అవసరంలేదని, కార్డుని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చునని వివరించారు.  రేషన్ షాపులో బియ్యం తీసుకోనివారికి బియ్యం బదులు ఆ విలువకు చిరుధాన్యాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. బియ్యం బదులు నగదు ఇచ్చే ఆలోచనలేదన్నారు. రేషన్ డిపోల ద్వారా మార్కెట్ ధర కంటే రూ.5ల తక్కువకు కిలో  కందిపప్పును అమ్మనున్నట్లు చెప్పారు. అలాగే మార్కెట్ ధరకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి అర కిలో పంచదారను ఇవ్వనున్నట్లు తెలిపారు. కొన్ని వర్గాల వారికి కిరోసిన్ ఇస్తామని చెప్పారు.  రాష్ట్రంలో నాణ్యమైన వస్తువులు మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు అమ్మడానికి  6500 చంద్రన్న మాల్స్ ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ మాల్స్ ను అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న డీలర్లకే అప్పగిస్తామని, కొత్తవారికి ఎవ్వరికీ ఇవ్వం అని వివరించారు. ఈ మాల్స్ ద్వారా డీలర్లకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగేవిధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాజస్థాన్  రాష్ట్రంలో అన్నపూర్ణ బండార్ పేరుతో ఇటువంటి మాల్స్ ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మాల్స్ లో వస్తువులు కార్డు ఉన్నవారేకాకుండా ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చని, కార్డు ఉన్నవారు తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీ లేదని, వారివారి ఇష్టానుసారం కొనుగోలు చేసుకోవచ్చని, బలవంతం ఏమీలేదని మంత్రి వివరించారు. ఈ మాల్స్ ఏర్పాటుకు రిలయన్స్, ఫీచర్స్ గ్రూప్ వారే ముందుకు వచ్చారని తెలిపారు. రిలయన్స్ గ్రూప్ వారు పది జిల్లాల్లో, ఫీచర్స్ గ్రూప్ వారు తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారన్నారు. ఒక్కో మాల్ ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చవుతుందని అంచనా అని, అందులో రూ.2.5 లక్షలు సంస్థవారు భరించాలని, లక్షా 25 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, మిగిలిన లక్షా 25 వేల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించాలని ప్రతిపాదించినట్లు మంత్రి వివరించారు.వేలిముద్ర పడనివారికి రేషన్ డిపోల్లో బియ్యం ఇవ్వడంలేదన్నది వాస్తవం కాదని, కార్డులో పేరు ఉన్నవారు రాకుండా, ఇతరులు వచ్చినందునే వేలిముద్ర పడదని తెలిపారు. నిజంగా వ్యక్తులు వారే అయి ఉండి, వేలిముద్ర పడకపోతే బియ్యం ఇవ్వండని చెప్పామని, అలా 7వేల మందికి బియ్యం ఇచ్చినట్లు తెలిపారు. లెప్రసీ వారికి వేలిముద్ర పడదని, వారికి వచ్చే నెల నుంచి బియ్యం ఇస్తారని మంత్రి ప్రత్తిపాటి చెప్పారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4512
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author