తీరనున్న ప్రజల చిరకాల వాంఛ

తీరనున్న ప్రజల చిరకాల వాంఛ
October 25 04:10 2017

కరీంనగర్ మండల ప్రజల చిరకాల వాంఛ త్వరలో తీరనుంది. 44వ జాతీయ రహదారికి వెల్దుర్తి కేవలం 12కి.మీల దూరంలో ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉండేది. దీనికి ప్రధానంగా రవాణా వ్యవస్థ అడ్డంకిగా మారేది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వెల్దుర్తిలోని అంబేడ్కర్ చౌరస్తా నుండి కుడిచెరువు వరకు బిటి రోడ్డు నిర్మాణానికి రూ.1కోటి 50లక్షలు నిధులు మంజూరయ్యాయి. బాధితులు, ప్రభుత్వానికి మధ్య నష్టపరిహారం విషయంలో ఒప్పందం కుదరక పోవడంతో పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా స్థానిక సర్పంచ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి దీనిపై ప్రత్యేక శ్రద్ద కనబరిచారు. మండల పర్యటనకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వచ్చినప్పుడల్లా ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడం వల్ల కలి గే ఇబ్బందులను వివరించేవారు.చివరికి ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకుల సహకారంతో రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్నవారిని రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇండ్లు, విలువైన స్థలాలు, దుకాణాలు కోల్పోతున్న వారందరికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వాసితులకు హామీనిచ్చారు.

అయితే ప్రధాన రహదారికి నూతన బిటి రోడ్డు మంజూరైనప్పటికి దానిని సిసి రోడ్డుగా మార్పు చేసి అంబేడ్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు డివైడర్‌తో కూడిన రోడ్డును పూర్తి చేశారు. అదే విధంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించారు. ఇదిలా ఉండగా బాధితులకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు గాను భూమి కొనుగోలు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం తరపున రూ. 60లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో స్థానికంగా 4 ఎకరాలకు పైచిలుకు భూమిని కొనుగోలు చేశారు.మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కలిపి మొదటి విడత మంజూరైన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను రోడ్డు వెడల్పులో కోల్పోతున్న వారికి కేటాయించేలా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఒప్పించారు. దీంతో గత నెలలో మంత్రి హరీశ్‌రావ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిల చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సదరు గుత్తేదారు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేపడుతున్నారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి బాధితులకు కేటాయించిన అనంతరం రోడ్డు వెడల్పుకు అడ్డంగా ఉన్న దుకాణాలు, ఇండ్లు కూల్చివేసి మిగిలిన సిసి రోడ్డును పూర్తిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారు. ఏదేమైన దశాబ్దాల తరబడి మండల ప్రజలు ఎదురు చూసిన చిరకాల వాంఛ తీరనుండటం పట్ల పలువురు హర్శం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు విస్తరణకు బాధితులను ఒప్పించడంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కృషి ఎనలేనిదని సర్పంచ్ మోహన్‌రెడ్డి అన్నారు. అదే విధంగా డబుల్ బెడ్ రూంలు కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి రూ. 60 లక్షలు నిధులు మంజూరు చేసేలా మంత్రి హరీశ్‌రావ్, డి ప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు ఎంతగానో కృషి చేశారన్నారు. వీరికి మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ఇ టు 44వ జాతీయ రహదారితో పాటు, నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా కేంద్రానికి చేరుకోవడం సులభమవుతుందన్నారు. అదేవిధంగా మెదక్ నుండి హైదరాబాద్‌కు చేగుంట నుండి కాకుండా వెల్దుర్తి మండలం మీదుగా వెళితే దూరం తగ్గుతుందని, ఫలితంగా రవాణా వ్యవస్థ పెరిగి మండలం అభివృద్ది పథంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4679
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author