ఉల్లం’ఘనులు’

ఉల్లం’ఘనులు’
October 30 14:09 2017
అనంతపురం జిల్లాలో కొద్దిరోజులుగా గనుల శాఖ కార్యాలయాలు నిర్లక్ష్యానికి మారుపేరుగా మారాయి.. తనిఖీలు అనే మాటే అధికారులు మరచిపోయారు. ఫలానా చోట అక్రమంగా ఖనిజ తరలింపు, తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఎవరైనా సమాచారం ఇచ్చినాసరే… ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమార్కులది ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది.
 బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడుపల్లిలో సర్వే నంబరు 348లో ఓ గ్రానైట్‌ లీజు ఉంది. గుంటూరుకు చెందిన ఒకరు గతంలో ఇక్కడ లీజు పొందారు. అయితే కొంతకాలంగా తాడిపత్రికి చెందిన ఓ గ్రానైట్‌ రవాణాదారుడు లీజును నిర్వహిస్తున్నాడు. ఇటీవల గనుల శాఖ నుంచి ఎటువంటి పర్మిట్లు తీసుకోకుండానే ఆ లీజు ప్రాంతంలో గ్రానైట్‌ గుండ్లను తవ్వితీశారు. దీనిపై సమాచారం రావడంతో గనుల శాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. మొత్తం 52 గ్రానైట్‌ గుండ్లు ఉన్నాయని తేల్చారు. ఇవి 186 క్యూబిక్‌మీటర్ల మేర ఉన్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా తవ్విన నేపథ్యంలో లీజుదారుడికి కనీసం రూ.30 లక్షల వరకు అపరాధరుసుము విధించేందుకు అవకాశం ఉంది.
అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంత జాప్యం చేశారు. ఇంతలో ఆ లీజు ప్రాంతం నుంచి 52 గ్రానైట్‌ గుండ్లు మాయమయ్యాయి. తాడిపత్రికి చెందిన గ్రానైట్‌ వ్యాపారి వీటన్నింటినీ తరలించేసినట్లు తెలిసింది. ఎటువంటి పర్మిట్లు లేకుండా గ్రానైట్‌ గుండ్లను తరలిచడంలో పేరుగాంచిన ఆయన వీటిని తరలించినట్లు సమాచారం. ఈయన బ్రహ్మసముద్రంతోపాటు, కళ్యాణదుర్గం, ఓబులదేవరచెరువుల్లోని పలు గ్రానైట్‌ లీజుల నుంచి ఇలా పర్మిట్లు లేని గ్రానైట్‌ను ఎక్కువగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ తెలిసినా అధికారులు కళ్లకు గంతలు కట్టేసుకుంటున్నారు.
అనంతపురం, తాడిపత్రి గనుల శాఖ ఏడీ కార్యాలయాలు, గుత్తిలోని గనుల శాఖ విజిలెన్స్‌ విభాగం ఏడీ కార్యాలయ అధికారులు సైతం వీటిని పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా అక్రమార్కులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఇందులో భాగంగానే అధికారులు తనిఖీ చేసినా సరే పడమటి కోడుపల్లి లీజు నుంచి గ్రానైట్‌ గుండ్లను దర్జాగా తరలించేశారు. ఆ లీజు ప్రాంతం నుంచి గ్రానైట్‌ గుండ్లు మాయమయ్యాయని తెలిసినా సరే గనుల శాఖ అధికారులు రహస్యంగా ఉంచారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
దీంతో జిల్లా అధికారుల్లో హడావిడి మొదలైంది. కర్నూలులో ప్రాంతీయ విజిలెన్స్‌ స్క్వాడ్‌ అధికారులు వచ్చి ఆ లీజు ప్రాంతాన్ని పరిశీలించారు. ఎవరిపై ఏం చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. వాస్తవానికి గ్రానైట్‌ గుండ్లను తొలుత గుర్తించినపుడే కఠినంగా వ్యవహరించి ఉండి ఉంటే, ఇప్పుడీ హైరానా పడాల్సిన అవసరం ఉండేదికాదని ఆశాఖలోనే విమర్శలు వస్తున్నాయి.
అనంతపురం గనులశాఖ పరిధిలోని ఎవరైనా కొత్తగా ఏదైనా ఖనిజాన్ని తవ్వి తీసేందుకు వీలుగా లీజు కావాలని దరఖాస్తు చేసుకుంటే.. వారికి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా దరఖాస్తుదారులు కోరుతున్న ప్రాంతాన్ని సర్వే చేయకుండా నెలలు, ఏళ్లపాటు వాయిదాలు వేస్తున్నారు. దరఖాస్తులో పేర్కొన్న ప్రాంతంలో సర్వే చేసేందుకు సమయం కేటాయించండని దరఖాస్తుదారులు ఎంతలా వేడుకున్నా సరే పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో అదే ప్రాంతంలో మరొకరు లీజు పొందేందుకు వీలుగా అధికారులు తెర వెనుక సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలోని సర్వే నంబరు 506లో 2 హెక్టార్లలో గ్రానైట్‌ లీజు కోసం ఒకరు 2014లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో సర్వే చేయకుండా అనంతపురం గనుల శాఖలో సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. విచిత్రం ఏమంటే సమీపంలోని సుబ్బరాయినపల్లిలో వేరొకరికి గ్రానైట్‌ లీజు ఉంది. అతడు తన లీజు ప్రాంతం నుంచి కాకుండా న్యామద్దలలో కొత్తగా లీజు కోసం వేరొకరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలోని గ్రానైట్‌ను తవ్వితీసి తరలించడం ఆరంభించాడు. ఇదంతా గనులశాఖ అధికారులకు తెలిసే జరిగినట్లు సమాచారం.
తలుపులలో కూడా ఇదే విధంగా సర్వే నంబరు 1026లో 15 హెక్టార్లలో క్వార్ట్జ్‌ ఖనిజం తవ్వకాల కోసం ఒకరు ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత తహసీల్దార్‌ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాన్ని తీసుకొచ్చి ఏప్రిల్‌లో గనుల శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయినా సరే ఆగస్టు వరకు సర్వే చేసేందుకు సమయం కేటాయించకుండా జాప్యం చేశారు. దీంతో ఆగస్టులో మరొకరు ప్రాంతంలో లీజు విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. వాస్తవానికి కోర్టుకెళ్లే వ్యక్తికి సహకరించడంలో భాగంగానే ఇన్ని నెలలూ సర్వే చేయకుండా వేర్వేరు కారణాలు చూపించి జాప్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5175
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author