అయ్యో చెరకు రైతులు..!

అయ్యో చెరకు రైతులు..!
October 30 15:59 2017
చెరకు రైతులకు చేదువార్త.. సరిగ్గా సీజన్‌ మొదలయ్యే క్రమంలో హనుమాన్‌జంక్షన్‌ సమీపంలోని డెల్టా చక్కెర కర్మాగార యాజమాన్య నిర్ణయం రైతులకు శరాఘాతంగా మారుతుంది. ఎప్పట్నుంచో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ ఈ కర్మాగారాన్ని శాశ్వత ప్రాతిపదికన మూసివేయాలని నిర్వాహకులు నిశ్చయించారు. ప్రస్తుతానికి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా, ఈ ఏడాది చెరకు పంటను గానుగ నిమిత్తం ఉయ్యూరుకు తరలించాలని ఇప్పటికే రైతుల ప్రతినిధులకు చెప్పేశారు. వరుసగా నష్టాలు వస్తున్న క్రమంలో ఇక మీదట దీనిని నడపలేమన్నది యాజమాన్య నిర్ణయమని సూచనప్రాయంగా తేల్చేశారు. దీంతో రైతులు, ఉద్యోగులు, కార్మికులు గందరగోళంలో పడిపోయారు.
మెట్ట ప్రాంతం అధికంగా ఉండటం, పలు నియోజకవర్గాలకు కేంద్రంగానూ ఉండటంతో హనుమాన్‌జంక్షన్‌ శివారు శేరీనరసన్నపాలెం పంచాయతీ పరిధిలో సహకార వ్యవస్థ కింద 1983లో హనుమాన్‌ షుగర్స్‌ పేరుతో ప్రభుత్వం చక్కెర కర్మాగారం నెలకొల్పింది. 16వ జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కర్మాగారం పరిధిలో గన్నవరం, నూజివీడు, గుడివాడ, తిరువూరు, దెందులూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 15 వేల ఎకరాల వరకు చెరకు సాగవుతుండేది. సహకార వ్యవస్థలో బాగా నష్టాలు రావడం, నిర్వహణ సరిగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో 2001లో దీనిని ప్రైవేటు పరం చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.11 కోట్లకు పైగా ధరకు దీనిని విక్రయించింది.
చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. కానీ నిర్వాహకులు కర్మాగారాన్ని ఆధునికీకరించడం, రైతులకు ప్రోత్సాహకాలు అందించడంతో వివాదం సద్దుమణిగింది. ‘డెల్టా’ చక్కెర కర్మాగారంగా రూపాంతరం చెందింది. దీని పరిధిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2001-02లో 4,935 ఎకరాల్లో మాత్రమే చెరకు సాగులో ఉండగా, తర్వాత ఏడాదికి రెట్టింపైంది. 2006-07 సంవత్సరంలో అత్యధికంగా 12,670 ఎకరాలకు సాగు విస్తరించింది. చెరకు దిగుబడి 1.50 లక్షల టన్నుల నుంచి 3.51 లక్షలకు పెరిగింది. మధ్యలో కొంత ఎత్తుపల్లాలు వచ్చినా 2011-12 వరకు చెరకు సాగు బాగా వృద్ధి చెందింది.
చెరకు సాగు 2012 నుంచి తగ్గుముఖం పట్టింది. ధర గిట్టుబాటు కాకపోవడం, ప్రత్యామ్నాయ పంటలు లాభసాటిగా మారడంతో రైతులు క్రమక్రమంగా చెరకు సాగుపై విముఖత చూపుతూ వస్తున్నారు. గతేడాది అయిదు వేల ఎకరాల్లోపుగానే సాగు చేయగా.. ఈ ఏడాది ఇంచుమించు అలానే ఉంది. గతేడాది మొత్తం మీద 1.60 లక్షలకు లోపుగానే గానుగ జరిగింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో మరో పదివేలు దిగుబడి పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.
మరి కొన్ని రోజుల్లో చెరకు క్రషింగ్‌ మొదలు కావాల్సి ఉంది. ఈ తరుణంలో ధర గురించి కర్మాగార యాజమాన్యం చేసే ప్రకటన గురించి రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ యాజమాన్యం ఇందుకు భిన్నంగా ఈ ఏడాది గానుగ జరపలేమంటూ ఒకేసారి బాంబు పేల్చింది. ఉయ్యూరు కేసీపీ కర్మాగారంతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ ఏడాదికి పంటను తామే బాధ్యత తీసుకుని గానుగకు అక్కడకు పంపుతామంటూ సోమవారం ధరపై చర్చలు జరిపేందుకు వెళ్లిన పలువురు రైతునాయకులకు, ఉన్నాతాధికారులు స్పష్టం చేశారు. వేలాది మంది రైతులు, వందల సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు ఆధారపడి ఉన్న కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేసేందుకు నిర్ణయించడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5203
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author