అడ్డగోలు దోపిడి

అడ్డగోలు దోపిడి
October 31 11:39 2017
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో.. బైపాస్ నిర్మాణానికి భూములిచ్చిన వారికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఏళ్ల తరబడి ఎదురుచూపుల అనంతరం వచ్చిన నష్టపరిహారం అందుకోడంలో వారికి సమస్యలు ఎదురవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధానంగా కొందరు వసూళ్ల దందాకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పిడుగురాళ్ల మీదుగా బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. పట్టణ శివారులోని రిలయన్స్‌ పెట్రోలుబంకు వద్ద నుంచి బ్రాహ్మణపల్లి రోడ్డులో ఖలీల్‌ దాబా వరకు ఆరు కిలోమీటర్ల మేర బైపాస్‌ రహదారికి ప్రణాళికలు వేశారు. ఇందుకోసం 47.5 ఎకరాలు భూమిని, ఇళ్లస్థలాలను సేకరించారు. నష్టపరిహారంగా తొలివిడతలో 34.7 ఎకరాలు భూమిని కోల్పోయిన వారికి సుమారు రూ.14 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన వారికి ఈనెల 16న రూ.5.5 కోట్ల నష్టపరిహారాన్ని రెండో విడతలో భాగంగా విడుదల చేశారు. రెండు విడతల్లో సుమారు రూ.19.5 కోట్లు చెల్లించారు. అయితే ఈ నష్టపరిహారం కోసం భూములిచ్చినవారు చాలా పాట్లే పడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి వచ్చిన దాంతోనే సర్దుకున్నామనుకుంటున్న తరుణంలో బాధితుల నుంచి ఖర్చుల పేరుతో వసూళ్లు చేపడుతున్నారని పలువురు అంటున్నారు. ఖర్చుల పేరుతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, రెవెన్యూ సిబ్బంది వసూళ్ల ప్రక్రియను ప్రారంభించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి విడత పరిహారం చెల్లించిన బాధితులు దగ్గర రూ.లక్షకు వెయ్యి రూపాయలు చొప్పున వసూలు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే దందా కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ఇంతకు ముందు ఫోన్ ద్వారా ఈ దందా సాగించిన కొందరు.. ప్రస్తుతం దళారులను నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. మొదటి విడత బాధితులకు ఇచ్చిన పరిహారం కంటే ఇప్పుడు ఇచ్చే పరిహారం బాగా తగ్గిందనే చెప్పాలి. సెంటు భూమికి రూ.7 నుంచి రూ.8 వేలుపైనే తగ్గినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. అసలే నష్టం వచ్చిందని బాధపడుతుంటే.. వచ్చిన కొద్ది మొత్తంలో వాటాలు తీసుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఇప్పటికే  వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5335
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author