కోట్లు ఖర్చు పెడుతున్నా…మారని సీన్… దవాఖానాలు…దారికెప్పుడొస్తాయి…

కోట్లు ఖర్చు పెడుతున్నా…మారని సీన్… దవాఖానాలు…దారికెప్పుడొస్తాయి…
October 31 16:06 2017

పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్షంతో ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు కోట్లాది రూపాయాల నిధులు మంజూరీ చేస్తున్నప్పటికీ ఆసుపత్రుల్లో మాత్రం కనీస వసతులు కూడా కరువయ్యాయి. నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, పేట్లబురుజు, నిలోఫర్‌లతో పాటు తదితర ప్రభుత్వాసుపత్రుల్లో అనేక సమస్యలతో రోగులు, సహాయకులు ఆందోళన చెందుతున్నారు.నిమ్స్ ఆస్పత్రిలో ఆపదలో ఉన్న అన్ని తరగతుల వారిని ఆదుకునేది హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి. కానీ ఇక్కడ అనేక సమస్యలతో రోగులు, రోగుల సహాయకులు సతమతమవుతున్నారు. ఆసుపత్రిలోని వార్డుల్లో రోగులు రాత్రి వేళల్లో కనీసం ప్రశాంతగా నిద్రపోలేని దుస్థితి నెలకొంది. అన్ని వార్డుల్లో సాయంత్రం ఐదు దాటిందంటే నల్లుల బెడద, ఓ పక్క ఉన్న రోగంతో బాధపడుతుంటే నల్లులతో మరో బాధ అని రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రిలో ఎవరికి తెలిపినా దానకి మేమేం చేయాలి అని ఎదురు సమాధానం ఇస్తున్నారని రోగులు తెలుపుతున్నారు. నల్లుల బెడదతో రోగులు ఆసుపత్రిలో ఉండలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. ఇక రోగుల సహాయకులకు విశ్రాంతి గది ప్రత్యేకంగా లేదు. మెయిన్‌గేట్ లోపల ఆలయం పక్కన ఉన్న కొద్దిపాటి స్థలాన్ని విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు. కానీ ఇక్కడ ఉదయం ఆరోగ్య మిత్ర కేంద్రం కొనసాగుతుండంతో కేవలం రాత్రి వేళల్లో మాత్రమే రోగుల సహాయకులు ఉంటున్నారు. కానీ, ఇక్కడ ఒక్క మరుగుదొడ్డి కూడా అందుబాటులో లేకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఉంది నగరంలోని ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న వారి రోగుల పరిస్థితి. ప్రభుత్వం కోట్లాది రూపాయాల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వసతులు కల్పించడంలో వైద్యారోగ్యశాఖాధికారులు విఫలమవుతున్నారని పలువురు రోగుల కుటుంబసభ్యులు విమర్శిస్తున్నారు.గాంధీనగరంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీలోనూ రోగుల సహాయకులకు కనీస సౌకర్యాలు లేవు. క్వాజువాలిటీ వార్డు ఆవరణలో ఉన్న షెడ్డు కింద కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. ఇక ఓపికి వచ్చే రోగులు వైద్యుల్ని కలవడానికి కూడా చెట్ల కిందనే తలదాచుకోవాల్సిన దుస్థితి. ఇన్ పెషేంట్ల సహాయకుల కోసం డార్మిటరీని ఉన్నా అది లేనట్టే. ఈ భవనం ఆసుపత్రిలోని మార్చురీ పక్కనే ఉండటంతో అక్కడ క్షణం కూడా వేచి ఉండేందుకు వీల్లేని పరిస్థితి. ఇలా గాంధీలో రోగుల సహాయకులకు ఇక్కట్లే నిత్యకృత్యమైపోయాయి.ఉస్మానియాలో పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. కనీస వసతులు లేకపోవడంతో రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులను తీసుకెళ్లే వీల్‌చైర్లు, స్ట్రెచర్లు కూడా సరిపడాలేవు. ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది కూడా లేకపోవడంతో రోగులకు వైద్యసేవలు సమయానికి అందడంలేదు. వీటికి తోడు మంచినీరు, మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు నానా అవస్థలు పడుతున్నారు. రోగి సహాయకులు ఆసుపత్రి ఆవరణలో తల దాచుకునేందుకు సరిపడా విశ్రాంతి గదుల్లేవు. దీంతో రోగుల సహాయకులకు నిలువ నీడలేకుండా పోయింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5393
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author