డీసీసీబీ బ్యాంకుకు పోటీ షురూ

డీసీసీబీ బ్యాంకుకు పోటీ షురూ
October 31 18:58 2017

జిల్లా కేంద్రసహకారబ్యాంకు చైర్మన్ పదవి కోసం నలుగురు డైరెక్టర్లు ముమ్మరంగా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేవలం పాలకవర్గానికి సుమారు నాలుగునెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ చైర్మన్ పదవి కోసం మాత్రం ఆశావాహులు రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చుట్టూ కొంతమంది తిరుగుతుండగా మరికొంతమంది ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాతనే రాజకీయాలు మరింత రసకందాయంలో పడే అవకాశాలున్నాయి. ఈ నాలుగునెలల వ్యవధిలో ఎందుకులే ఎన్నికలు అని పార్టీకి చెందిన ముఖ్యనాయకులు అనుకుంటే మాత్రం ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కండే శ్రీనివాసరావే కొనసాగే అవకాశాలున్నాయి. లేనిపక్షంలో పోటీలో ఉన్న నలుగురిలో ఏవరిని విజయలక్ష్మి వరిస్తుందో వేచిచూడాల్సింది. చైర్మన్ రేసులో ప్రధానంగా ప్రస్తుత చైర్మన్ కండే శ్రీనివాసరావు, జాగర్లమూడి యలమందరావు, చిడితోటి మస్తానయ్య, రాచగర్ల వెంకట్రావు ఉన్నారు. ఈ నలుగురిలో ప్రస్తుతం చైర్మన్‌గా కండే శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. కాగా కండేతోపాటు మరో ముగ్గురు సైతం తమకు చైర్మన్‌పదవులు కావాలంటూ ముమ్మరప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈపాటికే కండే శ్రీనివాసరావు రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్లతోపాటు మిగిలిన శాసనసభ్యులను కలిసి తనకు ప్రస్తుతం ఉన్న చైర్మన్‌పదవిని కొనసాగించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా బిసి నాయకుడు ఆర్ వెంకట్రావు కూడా మంత్రిని శిద్దాను కలిసి తనకు చైర్మన్ పదవి అవకాశం కల్పించాలని కోరారు. ఇదిలాఉండగా ఎవరివారే తమ కులసంఘాలను అడ్డంపెట్టుకుని నాయకుల వద్ద పావులు కదుపుతున్నారు. ఈపాటికే కండేకు మద్దతుగా దళిత సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు ఇవ్వాలని కోరటం జరిగింది. ఇదిలాఉండగా మస్తానయ్య,యలమందరావు సైతం మంత్రి,దామచర్ల, ఇతర నియోజకవర్గాల శాసనసభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.ఇదిలా ఉండగా గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఈదర మోహన్ పలు ఆరోపణలపై తనపదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. వైస్ చైర్మన్‌గా ఉన్న కండే శ్రీనివాసరావును ఇన్‌చార్జి చైర్మన్‌గా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం చైర్మన్‌గా కండే వ్యవహరిస్తున్నారు. మరో నాలుగునెలల సమయంలోనే ఆ పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఈ నేపధ్యంలో ఈ నాలుగునెలల పదవి కోసం నలుగురు డైరెక్టర్లు ముమ్మరంగా పావులు కదుపుతూ రాజకీయచక్రం తిప్పుతున్నారు. కేవలం మాజీ చైర్మన్లుగా అనిపించుకునేందుకు ఈ తాపత్రయం జరుగుతుందన్న వాదన రాజకీయ వర్గాలనుండి వినిపిస్తొంది. పిడిసిసి బ్యాంకు పాలకవర్గంలో 20మంది డైరెక్టర్లు ఉండగా ఇటీవల ఈదర మోహన్ తన చైర్మన్‌పదవికి, డైరెక్టర్ పదవికి రాజీనామా చేయటంలో 19మంది డైరెక్టర్లు ఉన్నారు. ఎవరైనా 10మంది డైరెక్టర్ల మద్దతు కూడగడితే మాత్రం వారికే చైర్మన్ పదవి వరించనుంది. మొత్తంమీద పిడిసిసి బ్యాంకు చైర్మన్ పదవి వ్యవహరం రాజకీయంగా జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5465
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author