కోట్ల ఆదాయం అర్జిస్తున్న గోదావరి పేపర్ మిల్

కోట్ల ఆదాయం అర్జిస్తున్న గోదావరి పేపర్ మిల్
November 01 15:34 2017
రాజమండ్రి పేరు వినగానే గోదావరి ఎలా గుర్తొస్తుందో అలాగే పేపర్ మిల్ గుర్తొస్తుంది. ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ గా మారి కోట్లు ఆర్జిస్తోంది. కానీ కాలుష్యం అనే పంజా విసురుతూ జనాన్ని పీడిస్తోంది. వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. పక్కనున్న గోదావరి జలాలను విషంగా మార్చేస్తోంది. యాజమాన్యం చెబుతున్న నియంత్రణ కేవలం కాగితాలకే పరిమితమై స్థానికుల్ని రోగాల బారిన పడేస్తోంధి. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్ సంస్థ దశాబ్ధాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ ఫ్యాక్టరీ ఇటీవలే అమెరికన్ సంస్థ యాజమాన్యంలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ పేపర్స్ గా ఈ ఫ్యాక్టరీ రన్ అవుతోంది. సుమారు నాలుగు వేల మంది మేన్ పవర్ తో నడుస్తోంది. రాజమండ్రికి ఫ్యాక్టరీ ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో తెలియదు కానీ అంతకంటే ప్రమాదకరమైన వ్యాధులకు మాత్రం కారణమవుతోంది. గలగలపారే గోదావరి జలాలు విషంగా మారుతున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సైతం ఫ్యాక్టరీ కాలుష్యంపై తనిఖీలు చేసి చాలా లోపాలు గుర్తించింది. రాజమండ్రిలో గోదావరి తీరాన నెలకొన్న ఈ ఫ్యాక్టరీ కాలుష్యంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ ద్వారా వెలువడుతున్న బూడిద, వ్యర్ధ జలాల కారణంగా సమీపంలోని కోటిలింగాల పేట, శ్రీరాంనగర్, మల్లయ్యపేట, ఆనంద్ నగర్, కాతేరు ప్రాంతాల్లో దాదాపు లక్షన్నర మంది ప్రత్యక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతున్న కాలుష్య నియంత్రణ పద్థతులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఎందుకంటే గత యేడాది పీసీబీ చేసిన తనిఖీల్లో సైతం చాలా లోపాలున్నట్టు గుర్తించింది.
ఈ లోపాల్లో ప్రధానంగా గోదావరి మధ్యలోని తూర్పు లంకలో నేరుగా వ్యర్ధ జలాల్ని నదిలో కలిపేస్తున్న పరిస్థితి ఉందని గుర్తించింది. దీంతో పాటు తక్కువ ఎత్తులోనే నిర్ణీత సమయాల కంటే ఎక్కువ సార్లు వాతావరణంలోకి విష వాయువులు వదులుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ సంస్థ నుంచి వెలువడే వ్యర్ధాలన్నీ నదిలో నేరుగా కలవడం వల్ల నదీ జలాలు తీవ్ర స్థాయిలో కలుషితమవుతున్నాయి. వాయు కాలుష్యంతోనూ, దుమ్ము, ధూళితో ఇళ్ళన్నీ నిండిపోతున్నాయని స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజా ప్రతినిధులు కూడా ఈ విషయంపై ప్రత్యేకమైన శ్రద్ధ కనపర్చడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పైకి మాత్రం ప్రజల్ని మభ్యపెడుతూ ఎప్పటికప్పుడు నెట్టుకొస్తున్నారు. సమస్య తీవ్రమైనప్పుడు కాస్త ధర్నాలు నిర్వహించి హడావిడి చేసి, అనంతరం దానిని పట్టించుకోకపోవడం సర్వసాధారణమైపోయింది. తక్షణం పేపర్ మిల్ యాజమాన్య  నిర్లక్ష్య వైఖరిపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  వాయు, జల, శబ్ధ కాలుష్యానికి తావులేని విధంగా చర్యలు తీసుకొని, స్థానిక ప్రజలను కాలుష్య కోరల నుంచి కాపాడాలని సర్వత్రా కోరుతున్నారు. లేదంటే పేపర్ మిల్ కార్యకలాపాల్ని కొనసాగించనివ్వమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5579
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author