సర్వర్ల డౌన్ తో వినియోగదారుల ఇక్కట్లు

సర్వర్ల డౌన్ తో వినియోగదారుల ఇక్కట్లు
November 03 19:10 2017
సకాలంలో పన్నులు చెల్లించండి. జివిఎంసికి సహకరించండి. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో నిత్యం కనిపించే, వినిపించే ప్రకటన సారాంశం. నగర పరిధిలోని పూర్వపు 72 డివిజన్లతో పాటు అనకాపల్లి, భీమునిపట్నం విలీన మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించాలంటే మాత్రం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. గత రెండు రోజులుగా జివిఎంసి రెవెన్యూ విభాగానికి సంబందించి పన్ను చెల్లింపుల్లో చోటుచేసుకుంటున్న జాప్యం వినియోగదారులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. నగరంలో 4,44,423 అసెస్‌మెంట్లు ఉన్నాయి. సాలీనా జివిఎంసికి పన్నుల రూపంలో రూ.300కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. మొండి బకాయిలను మినహాయిస్తే 90 శాతం పన్నులు వసూలవుతాయి. జివిఎంసి పన్ను వసూళ్లను సౌకర్యం, మీసేవ కేంద్రాలతో పాటు పలు బ్యాంకుల్లో కూడా పన్ను చెల్లించే సదుపాయం కల్పించారు. ఆస్తి యజమాని నేరుగా కూడా ఆన్‌లైన్ విధానంలో పన్ను చెల్లించవచ్చు. అయితే గత రెండు రోజులుగా జివిఎంసికి పన్ను చెల్లించేందుకు ఆస్తిపన్ను యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీసేవ, సౌకర్యం కేంద్రాల్లో పన్నులు చెల్లించేందుకు ప్రయత్నిస్తే నిరీక్షణ తప్పట్లేదు. ఎంతగా ప్రయత్నించినా సర్వర్ డౌన్ అనే సమాధానం వస్తోంది. దీంతో చేసేది లేక పన్ను చెల్లించేందుకు వచ్చే వారు వెనుదిరుగుతున్నారు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతోందో, సమస్యలు కూడా అంతే స్థాయిలో తలెత్తుతూ ఇక్కట్లకు గురిచేస్తున్నాయి.
అయితే జివిఎంసి పరిధిలో ఆస్తిపన్ను, మంచినీటి పన్ను చెల్లించే విషయంలో తలెత్తిన ఇబ్బందులు తాత్కాలికమేనంటూ జివిఎంసి అధికారులు వివరణ ఇస్తున్నారు. ఇటీవల ఎంటర్‌ప్రైజ్ రిపోర్ట్ ప్లానింగ్ (ఇఆర్‌పి) పేరిట కొత్త విధానాన్ని జివిఎంసి అందుబాటులోకి తెస్తోంది. దీంతో మొత్తం అసెస్‌మెంట్లు, ఇతర వివరాలను అప్‌లోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కారణంగా కొంత మేర అసౌకర్యం ఎదురవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా సర్వర్ మొరాయిస్తోందని, మరో రెండు, మూడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5874
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author